Off The Record: భీమిలిలో బొత్స వారసురాలి ఎంట్రీ!
Off The Record: విశాఖపట్టణం భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష నియామకం. రాజకీయ వ్యూహాలపై ప్రత్యేక విశ్లేషణ.
Off The Record: భీమిలిలో బొత్స వారసురాలి ఎంట్రీ!
Off The Record: విశాఖ నగర పరిసరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం భీమిలి. రాజకీయంగా కూడా ఇది ప్రతిష్టాత్మక స్థానం. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా రాజకీయ అనుభవం, అన్ని వర్గాల్లో నెట్‌వర్క్, ఎన్నికల వ్యూహాల్లో నైపుణ్యం ఆయనను బలమైన ప్రత్యర్థిగా నిలబెడుతున్నాయి. అలాంటి నియోజకవర్గంలో వైసీపీకి స్థిరమైన నాయకత్వం అవసరం ఏర్పడింది. చిన్న శ్రీను వైదొలిగిన తర్వాత వచ్చిన శూన్యాన్ని భర్తీ చేయడంతోపాటు కొత్త ముఖాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతోనే వైసీపీ సీనియర్ లీడర్, ఉత్తరాంధ్ర పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణ కూతురు డాక్టర్ అనూష ఎంపిక జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కుటుంబ రాజకీయ నేపథ్యం మాత్రమే ఇప్పటివరకు బొత్స కూతురు అనూష చూస్తూ వచ్చారు. ఇప్పుడు రాజకీయ అరంగేట్రం తర్వాత సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకునే అవకాశం కోసం అడుగులు వేస్తున్నారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాస్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో పార్టీ కేడర్ గందరగోళంలో పడింది. భీమిలి లాంటి పెద్ద నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాస్‌ను ఎదుర్కోవడం ఎలా అనుకుంటున్న క్రమంలో తెరపైకి డాక్టర్ అనూష పేరు తెరపైకొచ్చింది. అనూష కుటుంబ నేపథ్యం, వృత్తి అన్నీ భేరీజు వేసుకున్న వైసీపీ అధిష్టానం.. భీమిలి పగ్గాలు ఆమెకు అప్పగించింది. అయితే ఇదేమంత ఈజీగా జరగలేదంటున్నారు. వైసీపీ కీలక ప్రయోగం చేసిందనే చెబుతున్నారు.
ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి చిన్న శ్రీను కీరోల్ పోషించారు. చీపురుపల్లి ఇన్‌చార్జ్‌గా బొత్స అనూషను పొలిటికల్‌గా ప్రచారం చేయడంతో చిన్న శ్రీను అదును చూసి సైకిల్ ఎక్కేశారు. దీంతో ఉలిక్కిపడిన వైసీపీ హైకమాండ్.. భీమిలి కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే పనిలో పడింది. అందుకు పెద్ద కసరత్తే చేసిందట. చాంతాడంత జాబితాను జల్లెడ పట్టి మరీ.. IVRS లాంటి సర్వేల ద్వారా 24 శాతం రేటింగ్ పొందిన బొత్స అనూషను సెలక్ట్ చేశారట. ఇందులో పెద్ద మతలబే ఉందంటున్నారు. అనూషకు బాధ్యతలు అప్పగిస్తే.. బొత్స ఫ్యామిలీ నుంచి వలసలు లేకుండా చూడటంతోపాటు గంటా లాంటి గట్టి ప్రత్యర్థి నాయకుడిని ఎదుర్కోవాలంటే బొత్స లాంటి సీనియర్, సిన్సియర్ నాయకుడు అవసరం ఉందని అధిష్టానం భావించిందట. భీమిలిలో కాపు సామాజిక వర్గందే అత్యధిక ఓటు బ్యాంకుగా చెబుతున్నారు. గంటా అదే కమ్యూనిటీ కాబట్టి భీమిలీ వైసీపీ బాస్ అనూష అయితేనే కరెక్ట్ అని వైసీపీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుందట. స్థానిక, సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట.
డాక్టర్ అనూష ఎంపిక వెనుక పలు రాజకీయ లక్ష్యాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బొత్స కుటుంబాన్ని మరింత బలంగా వినియోగించుకునేందుకు వైసీపీ అధిష్టానం పక్కా స్కెచ్ వేసిందట. ఉత్తరాంధ్రలో ఇప్పటికీ బొత్సకు బలమైన కేడర్ ఉంది. ఆయన వ్యక్తిగత నెట్‌వర్క్, బీసీ వర్గాల్లో ఉన్న ప్రభావం వైసీపీకి ఆస్తిగా భావిస్తారు. ఆ బలాన్ని భీమిలిలోకి మళ్లించాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోందట. మరోవైపు 2024 తర్వాత వైసీపీలో యువ నాయకులను ముందుకు తేవాలన్న ప్రయత్నం జరుగుతోంది. అందులోభాగంగానే డాక్టర్ అనూష.. బొత్స కుటుంబ రాజకీయ వారసురాలిగా ఇప్పటికే చర్చల్లో ఉన్నారు. ఆమెకు ప్రత్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా కొత్త తరం నేతగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం కనిపిస్తోంది.
2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, ఇప్పటినుంచే నియోజకవర్గంలో పనిచేసే అవకాశం అనూషకు కల్పించారు. ఫలితంగా స్థానిక స్థాయిలో పార్టీని పునర్వ్యవస్థీకరించడం, కొత్త కేడర్‌ను తయారు చేయడం, గ్రామస్థాయిలో పరిచయాలు పెంచుకోవడం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అనూషకు ఉన్న బలాబలాలు చూస్తే.. రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ అనూష వెనుక ఆమె తండ్రి బొత్స సత్యనారాయణ అనే పెద్ద రాజకీయ శక్తి ఉంది. కార్యకర్తలకు కూడా బొత్స కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అంతాకాకుండా భీమిలిలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఇది మహిళా నాయకత్వం కూడా నయా ప్లాన్‌గా భావిస్తున్నారు. పైగా డాక్టర్ అనూషకు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడమనేది.. కొత్త ప్రయోగంగా మారవచ్చంటున్నారు. వైద్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యాన్ని కూడా వైసీపీ ప్రచారంలో ఉపయోగించే అవకాశం ఉంది. ఇవన్నీ ఒకఎత్తయితే.. డాక్టర్ అనూష రాజకీయాలకు పూర్తిగా కొత్త. పైగా గత రాజకీయ వివాదాలకు ఆమె దూరంగా ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్. ప్రత్యర్థులపై దాడి చేసే రాజకీయాల కంటే అభివృద్ధి, యువత, మహిళల అంశాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఎన్నికలు వచ్చే ప్రతిసారి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గం మారుతూ ఉంటారు. అలా వచ్చే ఎన్నికల్లో భీమిలిలో గంటా పోటీ చేయకపోతే అనూష గెలుపు ఈజీ అవుతుందనే వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు.
అదే క్రమంలో అనూషకు ప్రధాన సవాళ్లు స్వీకరించడం కాని, సవాళ్లు చేయడం కానీ మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రత్యర్థి, తాజా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దశాబ్దాల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. ఎన్నికల సమయంలో సమీకరణాలు మార్చగల సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి నాయకుడిని ఎదుర్కోవడం కొత్త నాయకురాలికి అంత సులువు కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. అనూష రాజకీయ ప్రస్థానం ప్రధానంగా విజయనగరం జిల్లాతో ముడిపడి ఉంది. ఫలితంగా స్థానికేతర ముద్రను అనూష ఎదుర్కోవాల్సి ఉంటుంది. భీమిలిలో పూర్తిస్థాయి స్థానిక గుర్తింపు సంపాదించుకోవాలి. స్థానిక నాయకులను కలుపుకోవాలి. ఇది ఒకరకంగా పెద్ద పరీక్షగానే భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
చిన్న శ్రీను పార్టీని వీడి వెళ్లిపోయిన తర్వాత కేడర్‌ను ఒక్కచోట చేర్చడం, అసంతృప్తులను తగ్గించడం కూడా కీలక అంశంగా మారనుంది. వైసీపీ అధిష్టానం కూడా నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఆమెకంటూ పూర్తి స్వేచ్ఛను, ప్రత్యేక బాధ్యతను అప్పగించాలన్న వాదన కూడా జోరందుకుంది. అయితే వైసీపీ ప్రస్తుత వ్యూహం చూస్తే నేరుగా గంటాపై వ్యక్తిగత రాజకీయ పోరాటం కంటే, సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.




