Off The Record: రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట!

Off The Record: తెలంగాణలో రైతు సమస్యలను కేంద్రబిందువుగా చేసుకుని విద్యుత్ కోతలు, సాగునీటి కొరతపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Oct 2026 7:45 AM IST
Off The Record
X

Off The Record: రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట!

Off The Record: తెలంగాణలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనపై నమ్మకం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రైతుల సమస్యలను కేంద్రబిందువుగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి.

"రైతు ఇబ్బంది.. ప్రభుత్వ వైఫల్యం" అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. కేవలం రాజకీయ విమర్శలతో కాకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యమాల రూపంలో ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారట.

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడం.. అప్రకటిత విద్యుత్ కోతలు.. లో వోల్టేజీ సమస్యలు.. సాగునీటి కొరత.. ఎండిపోతున్న పంటలు.. ఇవన్నీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఆందోళనల ప్రధాన అజెండాగా మారనున్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే పలుచోట్ల విద్యుత్ సబ్ స్టేషన్లను సందర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. లాగ్ బుక్స్ పరిశీలిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కలు ఒకలా ఉంటే.. రైతులు చెబుతున్న వాస్తవాలు మరొకలా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ అంశాన్ని పెద్దఉద్యమంగా మార్చాలని వ్యూహరచన చేస్తున్నారట. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తున్నామని చెబుతుంటే.. "అసలు విద్యుత్ ఎప్పుడు వచ్చింది..? ఎన్నిసార్లు ట్రిప్పింగ్ జరిగింది..? ఎన్ని గంటలు నిలిచిపోయింది..? లోవోల్టేజీతో ఎన్ని మోటార్లు కాలిపోయాయి..?"అనే ప్రశ్నలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోందట.

ఇటీవల హరీశ్ రావు, కేటీఆర్ సహా పలువురు నేతలు సబ్ స్టేషన్లను సందర్శించిన సమయంలో కూడా విద్యుత్ సరఫరాపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చగా మార్చేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..

"కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. పంటలకు రక్షణ లేదు.." అనే నినాదాలతో రైతులలో పెరుగుతున్న అసంతృప్తిని రాజకీయ ఉద్యమంగా మలచాలని గులాబీ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.

రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ప్రకారం.. సరైన సమయంలో విద్యుత్ లేకపోవడంతో మోటార్లు పనిచేయడం లేదని.. లోవోల్టేజీతో పరికరాలు దెబ్బతింటున్నాయని.. సాగునీటి విడుదలలో ఆలస్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

ఈ అంశాలను కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం చేయకుండా.. రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోందట. ఎండిపోయిన పంటలను ప్రదర్శిస్తూ ధర్నాలు.. సబ్ స్టేషన్ల వద్ద ముట్టడి కార్యక్రమాలు.. విద్యుత్ కార్యాలయాల ముందు ఆందోళనలు.. ఇలా పలు దశల్లో పోరాట కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

అయితే బీఆర్ఎస్ వ్యూహం కేవలం విద్యుత్ సమస్యల వరకే పరిమితం కాదు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి కీలకమైన సింగరేణి బొగ్గు ఉత్పత్తి అంశాన్ని కూడా రాజకీయంగా హైలైట్ చేయాలని భావిస్తోంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయి..? థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా ఎలా జరుగుతోంది..? అందుబాటులో ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రభుత్వం పూర్తిగా వినియోగిస్తోందా.. లేదా..? అనే ప్రశ్నలను ప్రజల ముందుకు తీసుకురావాలని పార్టీ భావిస్తోంది.

ప్రత్యేకంగా యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరుపై మళ్లీ చర్చను రగిలించాలని చూస్తోందట. బొగ్గు కొరత ఉందని ప్రభుత్వం చెబుతున్న సందర్భంలో.. అసలు నిల్వలు ఎంత ఉన్నాయి..? ఉత్పత్తి ఎందుకు తగ్గింది..? అనే అంశాలపై వివరణ కోరాలని భావిస్తోంది.

ఇక రైతు సమస్యలకు సంబంధించి మరో కీలక అంశం కూడా ఇప్పుడు రాజకీయ వేడిని పెంచుతోంది. యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచనలు ఇస్తోంది. ఇదే సమయంలో క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం సాధారణ వ్యవసాయ నిర్ణయంగా కాకుండా.. రాబోయే రోజుల్లో భారీ రాజకీయ వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైతులను వరి సాగుకు దూరం చేస్తున్నారా..? లేక నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా..? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రైతు అజెండా చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి.. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రైతు ఎజెండానే కేంద్ర బిందువుగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలు, ఎండిపోతున్న పంటలు, బొగ్గు నిల్వలు, క్రాప్ హాలిడే ప్రచారం. ఇవన్నీ రాబోయే రోజుల్లో అధికార-ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధానికి ప్రధాన అంశాలుగా మారబోతున్నాయి. రైతు సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టబోయే ఈ ఉద్యమం ప్రభుత్వాన్ని ఎంతవరకు ఇబ్బందులకు గురి చేస్తుంది..? ప్రజల్లో ఎంత ప్రభావం చూపుతుంది..? అనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోఆసక్తికర చర్చగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్