Off The Record: బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్న తక్కెళ్లపల్లి రవీందర్ వ్యాఖ్యలు

Off The Record: భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు మొదలైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Jun 2026 6:34 AM IST
Off The Record
X

Off The Record: బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్న తక్కెళ్లపల్లి రవీందర్ వ్యాఖ్యలు

Off The Record: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో వర్గాల మధ్య ఘర్షణ ఇప్పట్లో తగ్గేలా లేదట. తాజాగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలతో మరింత రచ్చకెక్కతున్న తీరుతో గులాబీ కేడర్ దిగులు పడుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు ఓటమితో పార్టీలో కొందరు నేతల అత్యుత్సాహం పెరిగిందనే వాదనలు వ్యక్తం అయ్యాయి. ఎన్నికల తర్వాత జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావును, ఆ తర్వాత జిల్లా ఇంచార్జ్‌గా వద్ధిరాజు రవిచంద్రను పార్టీ నియమించింది. ఆ తర్వాత పార్టీలో వర్గాల లొల్లి మరింత ఆజ్యం పోసుకుందనే టాక్ కార్యకర్తల్లో వినబడుతోంది.

ఇలాఉంటే తాజాగా బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవకు పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవిందర్ రావు మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన వనమా రాఘవ వ్యవహార శైలి మార్చుకోవాలని తక్కెళ్లపల్లి రవిందర్ రావు చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన కొందరు రాఘవ వర్గీయులు ఛైర్స్ విరగొట్టడంతో వర్గాల గొడవ కాస్త రోడ్డు మీద పడ్డట్టు అయింది. వనమా రాఘవను రాజకీయంగా ఎదగనీయకుండా చూడాలని సస్పెన్షన్ ఎత్తివేయకుండా చూసేలా సీనియర్ నాయకుడు ఒకరు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని చర్చ సైతం జరుగుతోంది.

తక్కెళ్లపల్లి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వనమా రాఘవ ఆయన సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లిపోతుండగా ఎంపీ వద్దిరాజు నచ్చజెప్పి సభలోకి తీసుకురావడం జరిగిందట. అయితే ఘర్షణ సృష్టించే ఘటనలపై తక్కెళ్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాఘవ వర్గానికి చెందిన అక్బర్ అనే బూత్ నాయకుడిని సస్పెన్షన్ చేయడం చర్చకు దారి తీసింది. పార్టీ నియమావళి ఉల్లంఘిస్తే ఎవరైనా ఇలానే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించనట్లు నాయకులకు తెలియజేశారట. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జరిగిన రచ్చతో వనమా రాఘవ.. గీత దాటాడనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ వ్యూహాత్మక తప్పిదాలతో భవిష్యత్ గందరగోళం ఏర్పడిందనే జోరుగా ప్రచారం అవుతోంది.

మరోవైపు గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇంచార్జ్‌గా వ్యవహరించిన ఎంపీ వద్ధిరాజు రవిచంద్రకు, అప్పటి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుకు మధ్య పార్టీ విషయాల్లో పలుమార్లు వాదోపవాదాలు జరిగాయి. అదే కోవంలో ఇప్పుడు మళ్లీ ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవిందర్ రావుకు, వనమా రాఘవ మధ్య గొడవతో అధిష్టానానికి తలనొప్పి తప్పట్లేదట. అయితే వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం ఇంచార్జ్‌గా అధిష్టానం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

కొత్తగూడెం జనరల్ స్థానం కావడంతో రాబోయే ఎన్నికల నాటికి రవిచంద్ర అక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికోసమే మాజీ వనమా వెంకటేశ్వరరావు తన సామాజిక వర్గం ఒక్కటే కావడంతో ఆ సామాజిక వర్గంలోని నాయకులకే గత మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తాయి. తనకు అనుకూలమైన వారికే పార్టీ ఎన్నికల నిధులు ఇచ్చి మిగతా వారికి మెుండి చేయి చూపారని ఓటమి పాలైన కార్పొరేట్ అభ్యర్థులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇక పార్టీ కార్యక్రమాల్లో వనమా రాఘవ సస్పెన్షన్‌‌ దృష్ట్యా ఆయన అనుచరులను దూరం పెడుతూ ప్రాధాన్యత ఇవ్వట్లేదనే టాక్ వినపడుతోంది.

ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియ అధిష్టానం చేయకుంటే రాబోయే రోజుల్లో మరింత విభేదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. జరిగిన పరిణామాల దృష్ట్యా అధిష్టానం ఆదేశాల మేరకు.. పార్టీ పటిష్టత కోసం వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి కొత్తగూడెంపై గులాబీ అధిపతి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story