Off The Record: రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాట!
Off The Record: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రైతుల సమస్యలపై కరపత్రం రూపంలో ఉద్యమానికి సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్. కేటీఆర్, హరీష్‌రావు నేతృత్వంలో పొలాల బాట.
Off The Record: రైతుల కోసం బీఆర్ఎస్ పోరుబాట!
Off The Record: రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేస్తోందట. రైతు భరోసా, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతోపాటు.. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు అందక విద్యుత్ సమస్యలు, వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంతోపాటు.. రైతు భరోసా పేరుతో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 60 వేల చొప్పున పరిహారం అందించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించడం, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు తక్షణ ఉపశమనం కల్పించడంలో విఫలమైందని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారట.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రతి సభలోనూ ప్రస్తావించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర హామీల అమలు తీరును ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించింది. హామీలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించనుందట. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో ఉద్యమాన్ని విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తోందట. సాగునీటి అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ ప్రధాన రాజకీయ అస్త్రంగా మలుచుకోనుందట. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ వాటిని ఎత్తిపోసి రైతులకు అందించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆరోపిస్తోంది. సాగునీరు అందిస్తే పంటలు పండుతాయని, రైతులకు బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నీటి సరఫరాపై నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రాజెక్టుల నిర్వహణ, ఎత్తిపోతల పథకాల పనితీరు, కాలువలకు నీటి విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారట.
రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో కేటీఆర్, దక్షిణ తెలంగాణలో హరీశ్‌రావు రైతుల సమస్యలపై విస్తృతంగా పర్యటించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించడం, రైతులతో నేరుగా మాట్లాడటం, వారి నష్టాలను తెలుసుకోవడం, స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశంగా ఉండనుంది. ఆదిలాబాద్ జిల్లాలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటే ప్రమాదం జరగడంతో వారి కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంది. పార్టీ తరఫున హరీష్ రావు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు.. ఇదే సమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో కేటీఆర్, హరీష్ రావు రైతుల సమస్యలపై వరుసగా పర్యటనలు చేసి.. ఎండిన పొలాలను పరిశీలించి రైతులకు జరుగుతున్న నష్టంపై ప్రభుత్వాన్ని ప్రశ్ని్స్తున్నారు.
అదే విధంగా నియోజవర్గాల వారీగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎండిన పంట పొలాలను పరీశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లితోపాటు పలువురు ఆ పార్టీ నేతలు ఎండిన పొలాలను పరిశిలించి.. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్లు ఎత్తితే రైతులు పండించే పంటలు ఎక్కడ కూడా ఎండిపోయేవి కావు అన్నది బీఆర్ఎస్ నేతల వాదన. ఇలా అన్ని నియోజవర్గాల్లో నేతలు పంటలను పరిశీలిస్తున్నారు. మొదటగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత బహిరంగ సభలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.
రైతుల సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభల ప్రధాన అజెండాగా మార్చాలని భావిస్తోంది. సాగునీరు అందక ఎండుతున్న పంటలు, తాగునీటి ఇబ్బందులు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, పెట్టుబడి సాయం, పంట నష్ట పరిహారం వంటి అంశాలను ప్రస్తావించనుంది. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి అందించిన విద్యుత్, రైతు సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ ప్రస్తుత పరిస్థితులతో పోల్చాలని భావిస్తోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటుంది బీఆర్ఎస్.
రైతుల ఆందోళనలను ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మలచగలిగితే రాజకీయంగా లబ్ధి పొందవచ్చన్న అంచనాతో గులాబీ పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది. ఇంతకీ కారు పార్టీ పెద్దలు వేసిన స్కెచ్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.




