Off The Record: సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్

Off The Record: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యూహం, ప్రత్యర్థుల విమర్శలకు స్పందించడంలో జాప్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Nov 2026 7:25 AM IST
Off The Record
X

Off The Record: సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్

Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే.. 'బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా సోషల్ మీడియాని నమ్ముకునే రాజకీయం చేస్తోందా..?' అని. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. అధికారంలో లేనప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా, ప్రజల్లోకి తమ గొంతు వినిపించాలన్నా డిజిటల్ మాధ్యమాలే ప్రధాన ఆయుధాలుగా మారాయి.

ఇందులో భాగంగానే గులాబీ పార్టీ తన సోషల్ మీడియా విభాగాన్ని పూర్తిస్థాయిలో యాక్టివ్ చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, 'ఎక్స్'.. వంటి అన్ని ప్రధాన సామాజిక మాధ్యమాల్లో దూకుడు పెంచింది. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియానే బలమైన వేదికగా భావిస్తోంది. అయితే, సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో.. కొన్నిసార్లు అంతే ప్రమాదం కూడా ఉంటుందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ప్రస్తుత కాలంలో ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా ఒక ముఖ్యమైన అస్త్రంగా మారింది. కేవలం తమ స్వంత కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడమే కాకుండా.. ప్రత్యర్థి రాజకీయ పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపడానికి, ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి సోషల్ మీడియానే కీలకంగా మారుతోంది.

తెలంగాణలో బిఆర్ఎస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ప్రత్యక్ష ఆందోళనలతోపాటు, డిజిటల్ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే వ్యూహంతో గులాబీ అధిష్టానం ఉంది. "మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి.. సోషల్ మీడియానే మనకు బలమైన సాధనం" అనే గట్టి నమ్మకంతో పార్టీ వర్గాలు పనిచేస్తున్నాయి. భారీ స్థాయిలో సోషల్ మీడియా క్యాంపెయిన్ల ద్వారా పార్టీని హైలైట్ చేయాలని, ప్రజల్లో నిత్యం చర్చనీయాంశంగా ఉండాలని అధిష్టానం భావిస్తోంది.

అయితే, ఇక్కడే పార్టీలో ఒక అంతర్గత చర్చ మొదలైంది. సోషల్ మీడియా ద్వారా పార్టీకి డిజిటల్ హైప్ వస్తున్నప్పటికీ.. కేవలం దీనినే నమ్ముకుంటే సరిపోతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. సోషల్ మీడియా ద్వారానే పార్టీ ప్రజల్లోకి పూర్తిగా వెళ్తోందని అధిష్టానం భావిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి వేరేలా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

డిజిటల్ తెరపై కనిపించే హడావుడికి, గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంటుందని కొందరు సీనియర్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా హైప్ తాత్కాలిక ప్రయోజనాలను ఇస్తుందేమో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కాకపోతే నష్టం జరుగుతుందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన మరో కీలక అంశం.. ప్రత్యర్థుల విమర్శలకు సోషల్ మీడియా వేదికగా వెంటనే స్పందించకపోవడం! అధికార పార్టీతో పాటు ఇతర విపక్షాలు బిఆర్ఎస్ నేతలపై తరచూ తీవ్ర ఆరోపణలు చేస్తుంటాయి, వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తుంటాయి. కానీ, సోషల్ మీడియాలో బిఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులపై ఆశించిన స్థాయిలో రిప్లై ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి.

సోషల్ మీడియాలో ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు, కామెంట్లకు అదే వేదికపై ఎప్పటికప్పుడు స్పందించకపోతే.. ప్రజలు ఆ ప్రచారాన్ని నిజమేనని నమ్మే ప్రమాదం ఉందని పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పార్టీపై, నాయకులపై ఎటువంటి విమర్శలు వచ్చినా వెంటనే వాటిని తిప్పికొట్టాలని, కానీ కొన్ని సెలెక్టెడ్ అంశాలపై మాత్రమే స్పందించి మిగతా వాటిని లైట్ తీసుకోవడం పార్టీకి నష్టం చేస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.

అంతేకాదు, సోషల్ మీడియాలో వచ్చే అంశాలపై స్పందించకపోవడం వల్ల మరో ప్రమాదం కూడా పొంచి ఉందనే చర్చ జరుగుతోంది. ఎక్కడెక్కడో జరిగే విషయాలపై స్పందిస్తూ, పార్టీకి నేరుగా తగిలే విమర్శలను విస్మరిస్తే.. సోషల్ మీడియాలో పనిచేసేది కేవలం 'పెయిడ్' లేదా నామ్ కే వాస్తేగా ఉండే ఒక వర్గమేనేమో అనే అనుమానాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. "సోషల్ మీడియాని పూర్తిగా నమ్మవచ్చా..? లేక ఇది ఒక వర్గం లేదా ఒక పార్టీ కోసమే పనిచేస్తోందనే ముద్ర పడుతుందా..?" అని విశ్లేషకులు, సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

సోషల్ మీడియాలో దూకుడు పెంచిన గులాబీ పార్టీ.. ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా రిప్లై ఇవ్వడంలో, నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ వార్‌లో దూసుకుపోవాలని చూస్తున్నప్పటికీ.. రిప్లై ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం, నెగెటివ్ కామెంట్లను తిప్పికొట్టడంలో అనుసరిస్తున్న మౌనం పార్టీకి ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..? అనేది ఇప్పుడు గులాబీ శిబిరంలో హాట్ టాపిక్‌గా మారింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై మరింత పదునైన వ్యూహాలు రచిస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. సోషల్ మీడియా ప్రచారానికి పెద్దపీట వేస్తున్న బీఆర్‌ఎస్ పెద్దలు.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో కూడా శ్రద్ధ వహిస్తారా..? విమర్శలకు ఏం జవాబు చెబుతారో అన్నది చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్