Off The Record: కాంగ్రెస్ వాగ్దానాలే బీఆర్ఎస్ అస్త్రాలు
Off The Record: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోనే కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ వ్యూహం!
Off The Record: కాంగ్రెస్ వాగ్దానాలే బీఆర్ఎస్ అస్త్రాలు
Off The Record: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విషయంలో మరింత దూకుడు పెంచాలని చూస్తోంది గులాబీ దళం. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలెన్ని..? ఇప్పటి వరకు అమలుకు నోచుకోనివి ఎన్ని..? ఇంకా ఎన్ని హామీలు బాకీ ఉన్నాయనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఎన్నికల టైంలో ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషన్లతో ప్రజలకు దగ్గరైంది హస్తం పార్టీ. వరంగల్‌లో రైతు డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, సరూర్‌నగర్‌లో నిరుద్యోగ డిక్లరేషన్ ఇలా... మహిళా, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా డిక్లరేషన్లను ప్రకటించి పవర్‌లోకి వచ్చింది. నాడు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డ డిక్లరేషన్లనే.. ఇప్పుడు రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను ఇంప్లిమెంట్ చేసి హస్తాన్ని దెబ్బ కొట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ సర్కార్‌కు రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా.. ప్రజల్లో ఆ పార్టీని ఎండగట్టేలా ప్రణాళికలు రచించింది.
నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని పక్కనపెట్టిందని తీవ్రంగా విమర్శిస్తోంది. నిరుద్యోగులను ఏకం చేస్తూ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు గులాబీ పార్టీ ప్లాన్ చేసింది. బీఆర్ఎస్ తాజా వ్యూహం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎక్కడైతే డిక్లరేషన్లు ప్రకటించిందో, కచ్చితంగా అదే ప్రదేశంలో ఇప్పుడు కౌంటర్ సభలు పెట్టాలని గులాబీ దళం నిర్ణయించింది. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను ఎలా మోసం చేశారో అక్కడే వివరించేలా కఠినమైన కార్యాచరణ రూపొందించారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వరుస సభలు నిర్వహించనుంది. మహిళా, బీసీ, ఎస్సీ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ఏయే ప్రాంతాల్లో అయితే ప్రకటించిందో, అదే ప్లేస్ లో భారీ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభల ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఇప్పటికే రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ముఖ్యంగా అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఇలా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేయాలని పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై నేరుగా ప్రజల్లోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూనే, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ కు ఉత్సాహం నింపేలా ఈ సభలు ఉపయోగపడతాయని అంచనా వేస్తోంది.
అన్ని చోట్లా సభలు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధిష్టానం పార్టీ శ్రేణులకు సూచించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పట్టుకుని మరీ ఈ సభల్లో కాంగ్రెస్ ను నిలదీసేందుకు సన్నద్ధం అవుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వాగ్దానాల చుట్టే ఇప్పుడు రాష్ట్ర పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కల్లాల్లోకి వెళ్లి రైతులకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం అయ్యింది.. తడిచిన ధాన్యం కొనకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట వ్యాప్తంగా ధర్నాలు చేసేలా బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంది. ఇక డిక్లరేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాత్మక దెబ్బకు ఎలా కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి హామీలను ఇప్పటికే నెరవేర్చామని, మహిళాల అభ్యున్నతికి ఇందిరా శక్తి వంటి పథకాలు అమలు చేస్తున్నామని, కుల సర్వే నిర్వహించి.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు చొరవ తీసుకున్నామని, అలాగే తొలి ఏడాదిలోనే 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని చూస్తున్నారు. మరి ఈ డిక్లరేషన్ వార్‌లో ఎవరిది పైచేయిగా నిలుస్తుంది. కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.




