Off The Record: సీఎం రేవంత్ పై యుద్ధం ప్రకటించిన మాస్ లీడర్ హరీష్ రావు?
Off The Record: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన మాస్ లీడర్ హరీష్ రావు! ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యంపై బీఆర్ఎస్ పోరుబాట.
Off The Record: సీఎం రేవంత్ పై యుద్ధం ప్రకటించిన మాస్ లీడర్ హరీష్ రావు?
Off The Record: తెలంగాణలో సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈపాటికే అలర్ట్ అయింది. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని నిర్ణయించారు గులాబీ పార్టీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కారు పార్టీ రెండున్నరేళ్ల సమయం ఇచ్చింది. అయినా ప్రభుత్వం ఎక్కడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనేది ఆ పార్టీ ప్రధాన ఆరోపణాస్త్రం. అదే పనిగా ఏ ఛాన్స్ దొరికినా ప్రజా ప్రభుత్వంపై ఆరు గ్యారంటీల మాటేంటీ అంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీపై పోరాటాలకు సిద్ధం కావాలని బిఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వ హామీలపై నిలదీయడమే కాదూ.. ఉద్యమాలకు కూడా సిద్ధం కావాలంటూ గులాబీ శ్రేణులకు ఆ పార్టీ అధినేతలు పిలుపునిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అంటూ.. ఉద్యమాలు కొత్త కాదు అని, ఎలాంటి పోరాటాలకు అయినా సిద్ధం అంటున్నారు కారు పార్టీ ముఖ్య నేతలు.
డిక్లరేషన్ పేరుతో ప్రజలకు మంచి చేస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్‌పై ముప్పేట దాడి చేస్తోంది బీఆర్ఎస్. ఎక్కడైతే డిక్లరేషన్ ప్రకటించారో అక్కడ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. రైతు డిక్లరేషన్ పేరుతో వరంగలులో సభను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ.. హైదరాబాద్ లోని సరూర్‌నగర్ స్టేడియంలో విద్యార్థుల కోసం బహిరంగ సభను ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించింది. అదే ప్లేస్ లో నిరుద్యోగుల కోసం బహిరంగ సభను పెట్టాలని బిఆర్ఎస్ ప్లాన్ చేసింది. చేవెళ్ల డిక్లరేషన్ తోపాటు మిగతా డిక్లరేషన్లు ఎక్కడైతే ప్రకటించారో అక్కడే బహిరంగ సభలు పెట్టి ప్రజల్లోకి వెళ్లనుంది గులాబీ పార్టీ. నిరుద్యోగులకు సంబంధించి సరూర్‌నగర్ వేదికగా ఈ నెల చివరి వారంలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది గులాబీ దళం.
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతోందని విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో చాలామంది రైతులు కళ్లాల వద్దనే ప్రాణాలు వదిలారని మండిపడుతున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. అయినా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేకపోయిందని విమర్శిస్తోంది. రైతులు యూరియా కావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో యూరియాని బుక్ చేసుకుంటే ఇస్తామని చెప్పడంపై ఎద్దేవా చేస్తోంది. రైతుల దగ్గర యాప్ ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం యాప్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇదే ఇష్యూపై రైతుల పక్షాన మండలాల వారీగా పోరాటాలకు సిద్ధమవుతోంది గులాబీ దళం. సన్నాలకు బోనస్ ఇస్తానని ప్రకటించిన ప్రభుత్వం.. ఇంతవరకు ఇవ్వలేక పోయిందని విమర్శిస్తున్నారు బిఆర్ఎస్ నేతలు..
గత ఏడాది రైతులకు ఇతర పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.,. పండించిన పంటలను కొనలేకపోయిందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఈసారి పండించిన పంటలకైనా బోనస్ ఇస్తుందా అని ప్రశిస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష నేతలు. వ్యవసాయం, హైడ్రా.. ఇలా ప్రతీ డిపార్ట్మెంట్‌లోనూ స్కాంలే జరుగుతున్నాయని మండిపడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తయినా కూడా రేవంత్ సర్కార్.. మిగతా పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
ఇలా ప్రతీ అంశంపై పోరాటాలతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని గులాబీ దళం పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే పోరు బాటకు సిద్దమవ్వడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది బీఆర్‌ఎస్. బీఆర్‌ఎస్ విమర్శలకు ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెబుతుందో చూడాలి మరి.




