Off The Record: ఉత్తర తెలంగాణపై కన్నేసిన KCR!

Off The Record: ఉత్తర తెలంగాణలో కోల్పోయిన పట్టును సాధించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Oct 2026 8:21 AM IST
Off The Record
X

Off The Record: ఉత్తర తెలంగాణపై కన్నేసిన KCR!

Off The Record: ఒకప్పుడు ఉత్తర తెలంగాణ అంటే బీఆర్ఎస్‌కు కంచుకోటగా భావించేవారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉండేది. అయితే 2023 ఎన్నికల్లో పరిస్థితులు మారాయి. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలపడగా, మరికొన్ని ప్రాంతాల్లో బీజేపీ తన ప్రభావాన్ని మరింత పెంచుకుంది. ఫలితంగా బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంక్‌లో కోత పడింది. ఈ నేపథ్యంలో "ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి" అనే ఫార్ములాతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అందుకే ఉత్తర తెలంగాణలో పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కేడర్‌లో ఉత్సాహం నింపడం, ప్రజల్లో పార్టీ ఉనికిని బలంగా చాటడం కోసం వరుస బహిరంగ సభలకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండంలో సింగరేణి అంశాన్ని కేంద్రంగా చేసుకుని భారీ సభ నిర్వహించింది బీఆర్ఎస్. ఆ సభకు వచ్చిన స్పందనతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో నవంబర్ నెల మొత్తం ఉత్తర తెలంగాణలో వరుస సభలతో హోరెత్తించాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 1న నిర్మల్ కేంద్రంగా "రైతు గర్జన" సభ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అనంతరం నవంబర్ 11న మరో భారీ సభ, నవంబర్ 18న బాల్కొండలో "ఇందూరు గర్జన" పేరుతో బహిరంగ సమావేశం, నవంబర్ 29న దీక్ష దివస్ సందర్భంగా కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇలా వరుసగా సభలు నిర్వహించడం వెనుక కేవలం రాజకీయ ఉనికి చాటుకోవడమే కాకుండా, ఎన్నికల నాటికి బలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలన్న ఆలోచన ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో బీజేపీ బలపడిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ అధిక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా ప్రధాన పోటీదారుగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కంటే బీజేపీ ఓటు శాతం పెరగడం పార్టీని ఆందోళనకు గురి చేసిందని అంటున్నారు. అందుకే బీజేపీ ఓటు బ్యాంక్‌లో కొంత భాగాన్ని తిరిగి తమవైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట.

ఇందుకోసం సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు పదును పెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రైతు సంక్షేమం, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రజల్లో చర్చకు తీసుకెళ్లాలని చూస్తోందట. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన హామీలపై కూడా ప్రశ్నలు సంధించే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం గడిచినా కీలక హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తోంది. ఇప్పుడు అదే అంశాలను సభల్లో ప్రధాన అజెండాగా మార్చి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయడంతో పాటు, బీజేపీకి మొగ్గు చూపుతున్న ఓటర్లను కూడా తమ వైపునకు ఆకర్షించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సభలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, పార్టీ కేడర్‌లో నమ్మకం పెంచే కార్యక్రమాలుగా కూడా ఉండనున్నాయని సమాచారం. ఎన్నికల్లో నిరుత్సాహానికి గురైన కార్యకర్తలను మళ్లీ చైతన్యపరిచేందుకు బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు.

ఉత్తర తెలంగాణ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దక్షిణ తెలంగాణలో కూడా ఇదే తరహాలో భారీ బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంటే రాబోయే నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ రాజకీయ కార్యక్రమాలు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి, ఉత్తర తెలంగాణలో కోల్పోయిన రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. వరుస సభలతో పార్టీ కేడర్‌ను చైతన్యపరచడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచడం, బీజేపీ ఓటు బ్యాంక్‌ను ఆకర్షించడం ద్వారా మళ్లీ ఉత్తర తెలంగాణలో పాత బలాన్ని సంపాదించాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఉత్తర తెలంగాణ వేదికగానే బీఆర్ఎస్ తన రాజకీయ పునరాగమన యాత్రను ప్రారంభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్