Off The Record: అసెంబ్లీ బయట నుంచే బీఆర్ఎస్ యుద్ధం!
Off The Record: హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. టెస్సరాక్ట్ భూములు, 22-A బాధితుల సమస్యలపై చర్చించి మాక్ అసెంబ్లీకి ప్రణాళికలు సిద్ధం చేశారు.
Off The Record: అసెంబ్లీ బయట నుంచే బీఆర్ఎస్ యుద్ధం!
Off The Record: సస్పెన్షన్లు.. నిరసనలు.. పోలీసుల అత్యుత్సాహం.. అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పెరిగిపోయింది. ఇప్పుడు అదే హీట్‌ను కంటిన్యూ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో జరుగుతున్న భేటీ.. కేవలం బ్రేక్‌ఫాస్ట్ మీటింగా..? లేక రాబోయే రాజకీయ పోరాటానికి వార్ రూమ్ మీటింగా..? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసెంబ్లీలో ఏం జరిగింది..? తమ ఎమ్మెల్యేలపై ఎందుకు సస్పెన్షన్ వేటు వేశారు..? పోలీసుల వ్యవహారంపై ఎలా పోరాడాలి..? ప్రజా సమస్యలను ఎలా జనంలోకి తీసుకెళ్లాలి..? అన్నదానిపై కేటీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంటే.. సభలో గొంతు నొక్కారని బీఆర్ఎస్ భావిస్తే.. ఆ గొంతును ప్రజల్లో మరింత గట్టిగా వినిపించడమే కేటీఆర్ ప్లాన్ అని భావిస్తున్నారు రాజకీయ విశ్లేతషకులు.
తెలంగాణలో టెస్సరాక్ట్ భూముల కేటాయింపు వ్యవహారం రేవంత్ రెడ్డి సర్కార్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా, తక్కువ ధరకు భూములు కేటాయించారంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. హైదరాబాద్ శివారు తుక్కుగూడ పరిధిలోని ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ' ప్రాంతంలో దాదాపు 200 కోట్ల నుంచి 250 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 7 కోట్లకు టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థకు కట్టబెట్టారని కేటీఆర్, హరీశ్ రావు ఆరోపించారు. ఈ టెస్సరాక్ట్ కంపెనీ అనుముల కొండల్ రెడ్డికి చెందినదని, కేవలం ఒక లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్, సున్నా ఉద్యోగులు ఉన్న కంపెనీకి ఇంత భారీగా భూములను ఎలా కేటాయిస్తారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.
ఈ సంస్థ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు, నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని కారు పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ సామర్థ్యం.. పెట్టుబడి.. ఉద్యోగాలు.. భూమి కేటాయింపు ప్రక్రియ.. ఇలా ఒక్కో అంశాన్ని బయటకు తీస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కేవలం అసెంబ్లీలో ఆరోపణలకే పరిమితం చేయకుండా.. ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు న్యాయపరమైన వేదికలపై కూడా పోరాడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అంటే.. ఒక భూవివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్‌గా మారబోతోందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు
మరోవైపు.. మహిళా ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ను కూడా బీఆర్ఎస్ వదిలిపెట్టేలా కనిపించడం లేదు. అసెంబ్లీకి వెళ్లే సమయంలో పోలీసులు తమపై దాడి చేశారంటూ మహిళా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఈ అంశాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. వీడియోలు.. ఫొటోలు.. ఘటనకు సంబంధించిన ఆధారాలతో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అంటే.. అసెంబ్లీ గేటు దగ్గర జరిగిన ఘటనను.. ఢిల్లీ గేటు వరకు తీసుకెళ్లడమే గులాబీ పార్టీ నెక్స్ట్ స్టెప్ అంటున్నారు.
ఇక 22-A.. ఇది బీఆర్‌ఎస్ పార్టీకి మరో కీలక అస్త్రం. భూములు 22-Aలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు పడుతున్న బాధితులను ఒకే వేదికపైకి తీసుకురావాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే లీగల్ సెల్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయ సహాయం అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు బాధితులతో సమావేశాలు.. వారి సమస్యలపై ప్రభుత్వం ముందు ఒత్తిడి.. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం.. ఇలా 22-Aను కూడా ప్రజా సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తోంది. అంటే.. రైతులు.. భూములు.. ఉద్యోగాలు.. ప్రజా సమస్యలు.. ఒక్కొక్కటి ఒక్కో పొలిటికల్ పాయింట్‌గా మార్చడమే కేటీఆర్ స్ట్రాటజీగా కనిపిస్తోంది.
అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీ బయటే మాక్ అసెంబ్లీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది. సభలో తమకు ఏం మాట్లాడే అవకాశం రాలేదు..? ఏ సమస్యలు చర్చకు రాలేదు..? ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది..? అన్నదాన్ని ప్రజలకు చూపించేలా మాక్ అసెంబ్లీని పొలిటికల్ థియేటర్‌గా మార్చే ప్రయత్నం చేయబోతోందట. అంటే.. అసెంబ్లీ తలుపులు మూసేస్తే.. తెలంగాణ భవన్ తలుపులు తెరిచి.. అక్కడే ప్రత్యామ్నాయ అసెంబ్లీ నిర్వహిస్తారన్నమాట.
ఇప్పటివరకు అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. కానీ ఇకపై అసెంబ్లీ బయట కూడా అదే ఫైట్ కంటిన్యూ చేయాలన్నదే గులాబీ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం.. మరోవైపు భూముల వివాదాలు.. మహిళా ఎమ్మెల్యేల అంశం.. 22-A బాధితులు.. మాక్ అసెంబ్లీ.. ప్రజా సమస్యలపై ఉద్యమాలు.. అంటే.. ఒకే అంశంతో కాదు.. అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొలిటికల్‌గా ప్రెజర్‌లో పెట్టడమే కేటీఆర్ మాస్టర్ ప్లాన్ అని టాక్. డిఫెన్స్ మోడ్ నుంచి అటాక్ మోడ్‌లోకి మారుతున్న బీఆర్‌ఎస్.. ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరుకున పెట్టగలదో చూడాలి.




