Off The Record: వచ్చే ఎన్నికలపై బీఆర్ఎస్ సర్వేలో ఏం తేలింది ?
Off The Record: ఎన్నికలు లేకపోయినా బీఆర్ఎస్ సర్వేల జోరు. గులాబీ పార్టీ అంచనాలు, సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్‌పై పొలిటికల్ విశ్లేషణ.
Off The Record: వచ్చే ఎన్నికలపై బీఆర్ఎస్ సర్వేలో ఏం తేలింది ?
Off The Record: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కాని, లోక్‌సభ ఎన్నికలు కానీ ఇప్పట్లో లేవు. అయినా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే అనడం వెనుక ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల మర్మమేంటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
డిలిమిటేషన్, మహిళా బిల్లుపై రాజకీయలు, ఎన్నికల ఫలితాలు ఆధారపడే అవకాశం కూడా లేకపోలేదు. కానీ పొలిటికల్ పార్టీలు ఇప్పటి నుంచే సర్వేల జపం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా గులాబీ పార్టీ దూకుడుగా వెళుతోందన్న టాక్ ఉంది.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని ఘంటాపథంగా చెబుతోది బిఆర్‌ఎస్. అయితే ఆ పార్టీకి ఇంతటి ధీమా ఎలా వచ్చిందన్న ప్రశ్నలు రాజకీయ పరిశీలకులకు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో తప్ప జిల్లాల్లో అంతగా సానుకూల పవనాలు లేని కారు పార్టీ.. ఎలా అధికారంలోకి వస్తుందన్న క్వశ్చన్ ఎదురవుతోంది.
ప్రజల్లో అధికార కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని, అదే సమయంలో బిఆర్‌ఎస్‌కు మళ్లీ ఆదరణ వస్తోందని.. గులాబీ పార్టీ నేతలు పదేపదే చెబుతున్నారు. దీనంతటికీ ఆ పార్టీ సర్వే రిపోర్టులను నమ్ముకోవడమేనన్న టాక్ రీసౌండ్ చేస్తోంది.
ఈమధ్య గ్రేటర్ హైదరాబాద్ బిఆర్‌ఎస్ నేతల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్వేలపై కీలక వ్యాఖ్యలు చేయడం ఇందుకు బలం చేకూరిందన్న చర్చ వినపడుతోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 70కిపైగా సీట్లతో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయని కేటీఆర్ ప్రకటించారట.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నది బిఆర్‌ఎస్ నేతల వాదన. రైతులకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని, ఫలితంగా రైతులు బీఆర్ఎస్‌వైపే ఉన్నారని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్నికలకు ఒక సంవత్సరం లేదా ఆరు నెలల ముందు అమలు చేసినా ప్రజలు నమ్మబోరని చెబుతున్నారు.
ఇక రీసెంట్‌గా చాలా సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలిచే స్థానాలపై ఒక సర్వే సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌లో 12కి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
అయితే గతంలో ఆ పార్టీ ఓటమికి గల కారణాలను కూడా వెల్లడించింది. ఓటమికి మొత్తం 8 కారణాలు తెలియజేసిందట. మరోసారి అలాంటి తప్పు చేయకుండా ముందే ఎక్కడ, ఎలా కార్యక్రమాలు చేయాలి అనేది కూడా సూచించారట.
ఆ సర్వే సంస్థ ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకత ఉందనే దానిపై కూడా రిపోర్టులో చెప్పారట. ఆ సర్వే సంస్థ రాష్ట్రంలో అన్ని నియోజవర్గాల్లో కూడా సర్వే చేస్తోదందట. ఇక మరో సర్వే సంస్థ కూడా దాదాపు 30కిపైగా పేపర్స్‌తో కలిపి సర్వే రిపోర్ట్ ఇచ్చిందట.
అందులో కూడా దాదాపు 70 స్థానాల్లో గెలుస్తారని తేలిందట. అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ఇంటెలిజెన్స్‌తోపాటు ఓ ప్రైవేట్ సర్వే సంస్థ కూడా నివేదికలు ఇచ్చాయని గులాబీ నేతలు చెబుతున్నారు.
బిఆర్‌ఎస్ చెబుతున్న సర్వే లెక్కల వెనుక కేవలం ప్రజాభిప్రాయమే ఉందా..? రాజకీయ వ్యూహం కూడా ఉందా..? పార్టీ కేడర్‌లో జోష్ నింపడానికే.. బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మరోవైపు.. 2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. BRS చెబుతున్న సర్వే లెక్కలకు కౌంటర్‌గా మారాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
దీంతో సర్వేల వ్యవహారం ఇప్పుడు BRS-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంగా మారనుందా..? అనే చర్చ జరుగుతోంది. భవిష్యత్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది కాలమే చెప్పాలి మరి.




