Off The Record: ఒట్ల సవరణపై బీఆర్ఎస్ అలర్ట్!
Off The Record: గ్రేటర్ హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపును అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.
Off The Record: ఒట్ల సవరణపై బీఆర్ఎస్ అలర్ట్!
Off The Record: కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ పేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియకు తెరలేపింది.బోగస్ ఓట్లు టార్గెట్ గా ఎస్.ఐ.ఆర్ ను చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం అంటోంది.దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్.ఐ.ఆర్ ను అమలు చేస్తోంది.ఇక తెలంగాణలో ఎస్.ఐ.ఆర్
జూన్ 25 వ తేదీ నుంచి జూలై 26 వ తేదీ వరకు జరగనుంది.ఈ అంశంపై తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అలెర్ట్ అయ్యాయి.కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ లో జాగ్రత్తగా వ్యవహరించాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన గులాబీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ నేతలతో
భేటీ అయి ఎస్.ఐ.ఆర్ పై సమీక్షలు చేశారు.ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాలని బిఆర్ఎస్ డిసైడ్ అయింది. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు బీఎల్ఎల లిస్ట్ ఇవ్వాలని గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు చెప్పింది.అయితే అందులో 38 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంకా లిస్ట్ అందలేదని ఇటీవల కేసీఆర్ ఆయా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు.ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు ఎస్.ఐ.ఆర్ పైన కేటీఆర్ సూచనలు చేశారు.ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో భాగంగా గులాబీ క్యాడర్ ఎక్కువగా వున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో ఎస్.ఐ.ఆర్ పై మీటింగ్ నిర్వహించారు.కేటీఆర్ హాజరై సర్ పై కామెంట్స్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ గందరగోళానికి దారి తీసిందని కేటీఆర్ ఆరోపించారు. ఇక గులాబీ పార్టీ క్యాడర్ ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా వుంది.ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో అధికారులు అడిగే అర్హత పత్రాలు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్ల వద్ద ఉన్నాయా లేవా ఒకవేళ అర్హత పత్రాలు లేకపోతే స్థానిక గులాబీ పార్టీ నేతలు వారికి అర్హత పత్రాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పారు.
అదే విధంగా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.రెండు సార్లు గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది.ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియతో హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయని బిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.దీంతో తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు డిలీట్ కాకుండా ఉండే చర్యలు బిఆర్ఎస్ చేపట్టింది.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు సైతం గులాబీ పార్టీకి అండగా నిలిచింది.పాత బస్తీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మైనారిటీ ఓటు బ్యాంకు బిఆర్ఎస్ పార్టీకి పడింది.దీంతో ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట లేని చోట బూత్ ల వారీగా బీఎల్ఎలను నియమించి ఎస్.ఐ.ఆర్ లో గులాబీ పార్టీ అనుకూల ఓటు బ్యాంకును కోల్పోకుండా క్షేత్ర స్థాయిలో క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తోంది.
మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎస్.ఐ.ఆర్ తో తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు డిలీట్ కాకుండా ఉండేందుకు గులాబీ పార్టీ చేస్తున్న చర్యలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.




