Off The Record: వ్యూహం మార్చిన గులాబీ బాస్ బీఆర్‌ఎస్ మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి?

Off The Record: బిఆర్ఎస్ పార్టీని మళ్లీ టిఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారా? జాతీయ రాజకీయాల కోసం చేసిన ప్రయోగం విఫలమైందా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 6:42 AM IST
Off The Record
X

Off The Record: వ్యూహం మార్చిన గులాబీ బాస్ బీఆర్‌ఎస్ మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి?

Off The Record: టీఆర్ఎస్‌. తెలంగాణలో కారు పార్టీ నేతలకు, ప్రజలకు అదో ఎమోషన్. 13 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా, మరో ఎనిమిదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా టీఆర్ఎస్‌కు ఘన చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంది. నీళ్లు, నిధులు, నియామకాల సెంటిమెంట్‌తో స్వరాష్ట్ర సాధనకు 2001 ఏప్రిల్ 27న TRSను స్థాపించారు కేసీఆర్. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు ఎదురైనా.. టీఆర్ఎస్‌ జెండానే నమ్ముకున్నారు. చివరికి లక్ష్యాన్ని చేరుకున్నారు. స్వరాష్ట్ర కల సహకారం తర్వాత ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారింది. టీఆర్ఎస్‌ పేరుతోనే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు కేసీఆర్. 2014 , 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ... తెలంగాణ అంటే టీఆర్ఎస్‌గా అనేంతగా కారు పార్టీ నేతలు పదేపదే చెబుతూ వచ్చారు.

కేసీఆర్‌ మదిలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో బీఆర్ఎస్‌కు బీజం పడింది. 2022 అక్టోబర్‌ 22న టీఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండాలని వివిధ రాష్ట్రాలలో బిఆర్ర్ఎస్ పేరుతోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల పర్యటన చేశారు కేసీఆర్. తెలంగాణలో హ్యాట్రిక్‌ కొట్టి దేశ రాజకీయాల్లో క్రీయాశీలంగా వ్యవహరించాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా జీరో స్థానానికి బిఆర్ఎస్ పరిమితమైంది.

ప్రతిపక్షంలోకి వచ్చాక కంటోన్మెంట్ ఉపఎన్నికతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ ఓటమి చవిచూసింది. బీఆర్ఎస్‌గా పేరు మార్పు టైంలోనే.. సొంత పార్టీలో కొంత అసమ్మతి వ్యక్తం అయింది. టీఆర్ఎస్‌ అంటే.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని, ఇక్కడి ప్రజలతో పేగు బంధాన్ని ఏర్పరచుకుందని, అలాంటి పార్టీ పేరును మార్చి..ప్రజలకు దూరం అవ్వొద్దనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అన్నట్టుగానే.. బీఆర్ఎస్‌గా పేరు మారాక గులాబీ పార్టీకి అంతగా కలిసి రాలేదు. అసెంబ్లీ నుంచి మొదలుకొని.. ఉప ఎన్నికల వరకు ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. పార్లమెంట్‌లో ఘోర ఓటమి తర్వాత.. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలన్న డిమాండ్స్.. సొంత పార్టీ నుంచి బలంగా వినిపించింది.

టీఆర్ఎస్‌ పేరు మార్చి.. సెంటిమెంట్‌ పరంగా తెలంగాణ ప్రజలకు దూరం అయ్యామనే భావన గులాబీ నేతల్లో ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ.. బిఆర్ఎస్‌గా అవతరించినప్పటి నుంచి చాలామంది నేతల్లో, ఎమ్మెల్యేల్లో జరిగిన చర్చనే మరోసారి తెరపైకి వస్తోంది. 2023 ఎన్నికతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి ఒక కారణం పార్టీ పేరు మార్పే అన్న చర్చ కూడా జరిగింది. BRSకు స్కోప్‌ లేదు, TRS పార్టీనే గులాబీ జెండాకు శ్రీరామ రక్ష అన్న అభిప్రాయం వ్యక్తం అవుతూ వస్తోంది.

వాస్తవానికి టిఆర్ఎస్ అంటే తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలు హక్కున చేర్చుకున్నారు. కానీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీలు వేయకపోవడం పార్టీకి మైనస్‌గా చెప్పుకోవచ్చు. కార్యకర్తలు బలంగా ఉండాలంటే కమిటీలు వేసి వారిని ఆక్టివ్ చేసినప్పుడు మాత్రమే క్షేత్రస్థాయిలోకి వెళ్తుంది. అలా కాకుండా అధికారంలో ఉన్న రోజుల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలను పట్టించుకోకుండా నియోజకవర్గ ఇన్చార్జిల్గా ఎమ్మెల్యేలకే అప్పజెప్పడం కూడా బిఆర్ఎస్ కు మైనస్ అయిందట. ఇక సంక్షేమ పథకాలు అమలు చేసినా.. అవి పక్క దారి పట్టకుండా.. అర్హులకు అందుతున్నాయా లేదా అనేది దృష్టి పెట్టకపోవడం, ఒకవేళ అందినా ప్రచారం చేసుకోకపోవడం బీఆర్ ఎస్ కి మైనస్. నిరుద్యోగుల అంశంపై కూడా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ ఎస్ పట్టించుకోలేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

రెండుసార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేసుకోలేకపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి అని దృష్టి పెట్టి రాష్ట్రంలో పార్టీ నిర్మాణంపై ఎక్కడా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోలేకపోయింది. పార్టీ సంస్థాగత నిర్మాణం మెంబర్షిప్ పై వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో బిఆర్ఎస్ సోషల్ మీడియాలో టిఆర్ఎస్ గా పేరు మార్చాలనే చర్చ జరుగుతుంది. అదే విషయాన్ని కేటీఆర్ వ్యక్తపరిచారు. బీఆర్ఎస్‌గా మారక నష్టపోయాం..మళ్లీ టీఆర్ఎస్‌గా ఉండాలనుకుంటున్నాం అన్నారు కేటీఆర్. టిఆర్ఎస్ గా పార్టీ పేరు మారిస్తే ఉద్యమ పార్టీగా మళ్లీ పూర్వ వైభవం వస్తుందని బిఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ పేరు మార్పుపై బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది..

ఇక బి ఆర్ ఎస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్ర కి సిద్ధమవుతున్నారు.. 2027 నుంచి పాదయాత్ర చేస్తానన్ని ప్రకటించారు..అప్పటి వరకు పార్టీ పేరు మార్పు..కమిటీలు పూర్తి చేసుకొని పార్టీని సంస్థగతంగా బలంగా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.. కమిటీలతోపాటు పార్టీ నిర్మాణంపై ఎలాంటి దృష్టి పెట్టబోతుందని ఆసక్తి నెలకొంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story