OFF The Record: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల గగ్గోలు.. BRSV ఎక్కడ?
OFF The Record: బీఆర్ఎస్‌వీ ఉనికిపై చర్చ: అధికారంలోకి వచ్చినా విద్యార్థి సమస్యలపై పోరాడడంలో విఫలమైందన్న విమర్శలు. కొత్త కమిటీపై నాయకుల ఎదురుచూపులు.
OFF The Record: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల గగ్గోలు.. BRSV ఎక్కడ?
OFF The Record: ఏ రాజకీయ పార్టీకి అయినా విద్యార్థి విభాగం కీలకం. విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం విద్యార్థి సంఘాల పని. స్కూళ్లు, కాలేజీల్లో ఇష్టారీతిన ఫీజుల పెంపు, విద్యా వ్యవస్థలో లోటు పాట్లపై ఫైట్ చేస్తూ.. స్టూడెంట్స్‌కు అండగా నిలుస్తుంటాయి.
అందుకే విధ్యార్థి విభాగాలు క్రియాశీలకంగా ఉండేలా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతుంటాయి. ప్రజా సమస్యల్లో భాగంగా తమ పోరాటాల్లో విద్యార్థి విభాగాలూ భాగం అయ్యేలా పార్టీల కార్యాచరణ ఉంటుంది. అధికారంలోకి రావడంలోనూ ఆయా రాజకీయ పార్టీల విద్యార్థి విభాగాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
కాలేజీ, యూనివర్సిటీ లెవల్లోనే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటాయి. పార్టీలకు కొత్త నాయకత్వం కూడా ఇక్కడి నుంచే ఎదుగుతూ వస్తుంది. ఐతే గతంలో ఎంతో క్రియాశీలకంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగమైన బీఆర్ఎస్వీ మాత్రం.. ప్రస్తుతం ఉనికిలో లేకుండా పోతోందట.
చెప్పుకోవడానికే విద్యార్థి సంఘం తప్ప.. ఆశించిన మేర క్షేత్రస్తాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్వీ పటిష్టం కోసం అధిష్టానం స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయి.? దీనిపై విద్యార్థి నాయకులు ఏం చర్చించుకుంటున్నారు అనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.
విద్యార్థి విభాగానికి కొత్త నాయకుడిని ఎప్పుడు ప్రకటన చేస్తారనే దానిపై కారు పార్టీ ప్రతిపక్షలోకి వచ్చినప్పటి నుంచీ ఎదురుచూస్తున్నారట. గత సంవత్సరమే అన్ని విభాగాలకు కొత్త నాయకత్వ నియామకాలు ఉంటాయని భావించినా ఆ దిశగా బీఆర్‌ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దీంతో కొత్త కమిటీ, అందులో సభ్యుల భర్తీ ఎప్పుడని ఎదురుచూస్తున్నారు బీఆర్ఎస్‌స్వీ స్టూడెంట్. కొంతమంది కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి నిరాశకి గురి అవుతున్నారట. ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌ఎస్వీ అంతగా విద్యార్ధుల పక్షాన పోరాటాలు చేసింది ఏమీ లేదట. ఎక్కడ ఏ పోగ్రామ్ చేసిన కొంతమంది విద్యార్థి నాయకులే కనిపిస్తున్నారనే
వాదన వినబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగ సమస్యను ఓ ఉద్యమంలా లేవనెత్తాలని చూస్తోంది బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్వీ వైపు నుంచి పార్టీకి ఆశించిన మేర సపోర్ట్ ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా యూనివర్సిటీల్లో.. బీఆర్ఎస్వీ విభాగం బలంగా లేక స్టూడెంట్స్ నుంచి కొత్త చేరికలు కూడా తగ్గాయన్న ఆరోపణ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురు విద్యార్థి నాయకులకు.. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే పదవులు వచ్చాయి.
వాళ్ళకే ఇంకా విద్యార్థి విభాగం పక్షాన ప్రియార్టీ ఇస్తున్నారని, మరి కొత్త వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారని విద్యార్థి లీడర్లు చర్చించుకుంటున్నారట. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం చేసిన కార్యక్రమాల గురించి పక్కన పెడితే.. 2026 అకడమిక్ ఇయర్‌లో ఫీజులు భారీగా పెంచాయి విద్యాసంస్థలు.
అలాగే ఫీజురియింబర్స్‌మెంట్ రాక విద్యార్ధులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు కాలేజ్ యాజమాన్యాలు. కొన్ని వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. చాలా మంది విద్యార్థులు అకడమిక్ ఇయర్ అయిపోయినా కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. అయినా బీఆర్ఎస్‌స్వీ తరుపున విద్యార్థులకు భరోసా ఇచ్చే ఒక్క పోగ్రామ్ కూడా చేయలేదు.
అధికారంలో ఉన్నప్పటి కన్నా.. ప్రతిపక్షంలోకి వచ్చాక విద్యార్థి విభాగం చేసే కార్యక్రమం పార్టీకి ఎక్కువ మైలేజ్ తెచ్చి పెడుతుంది. కానీ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఫీజు రియింబర్స్ మెంట్‌పై 2026లో ఎక్కడా పోరాటం చేయలేదు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కొన్ని యూనివర్సిటీలలో brsv స్టూడెంట్స్.. ఏమైన పోగ్రామ్ చేద్దామంటే విద్యార్థి సంఘం ముఖ్య నాయకులు ఎందుకు మేము చెప్పకుండా పోగ్రామ్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారట. ఇలా ప్రశ్నించడం ద్వారా స్టూటెండ్ ఇష్యూస్‌పై ప్రోగ్రామ్స్ చేద్దామనుకునే వారికి నిరాశే మిగులుతుందట.
నాయకులు ముందుకు రాక.. వాళ్లు చేయరు.. చేసే వారిని చేయనివ్వరు అనేలా బీఆర్‌ఎస్వీ పరిస్థితి తయారంటైందట. గ్రౌండ్ లో ఎలాంటి పోగ్రామ్ చేయకుండా మేము వర్కింగ్ ప్రెసిడెంట్ వెంట ఉండి ఆయన కళ్ళల్లో నిత్యం పడితే బీఆర్‌ఎస్‌ఎస్వీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ప్రకటిస్తారని కొంత మంది భావిస్తున్నారట.
యూనివర్సిటీలలో యాక్టివ్ గా ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని.. విద్యార్ధుల సమస్యలపై ప్రభుత్వాన్నీ ప్రశ్నిస్తూ నిత్యం విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూ పార్టీకి ఉపయోగపడే వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని చర్చించుకుంటున్నారట. brsv కొత్త విభాగం ప్రకటన తర్వాతనే యాక్టివ్ అవుతుందని చర్చించుకుంటున్నారట..చూడాలి పార్టీ brsvపై ఏ విధంగా దృష్టి పెట్టీ ఎవరికి అవకాశాలు ఇస్తుంది అనేది.




