Burning Topic: హార్ముజ్ సంక్షోభానికి భారత్ చూపిన బ్రహ్మాస్త్రం

Burning Topic: అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ పోషిస్తున్న కీలక పాత్ర ఏంటి?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 April 2026 7:17 AM IST
Burning Topic
X

Burning Topic: హార్ముజ్ సంక్షోభానికి భారత్ చూపిన బ్రహ్మాస్త్రం

Burning Topic: పశ్చిమాసియా సంక్షోభం మరింత చిక్కుముడిగా మారుతోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రారంభమై 50 రోజులు దాటింది. పాకిస్థాన్‌ వేదికగా రెండు దేశాల మధ్య కొనసాగాల్సిన చర్చల్లో ప్రతిష్టంభకు ఇంకా తెరపడలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణను పొడగించినా చదురుమదురు దాడులు, పరస్పర హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీగానే దాడులు చేసింది. భారీ క్షిపణులు, వైమానిక దాడులతో విధ్వంసమే సృష్టించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఆయుధాలను ఉపయోగించింది. దీంతో, ఇరాన్ సైనిక సామర్థ్యం తగ్గకపోగా అమెరికా ఆయుధ నిల్వలు మాత్రం గణనీయంగా తగ్గాయి. అమెరికా వద్ద ప్రస్తుత యుద్ధాన్ని కొనసాగించడానికి సరిపడా మిసైళ్లు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో కొత్త యుద్ధాలు తలెత్తితే నిల్వల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితి అగ్రరాజ్యానికి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో 2027 బడ్జెట్‌లో అమెరికా భారీగా కొత్త మిసైళ్లను ఆర్డర్ చేసింది.

ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు స్వల్పకాలమే అంటూ వస్తోన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తోసిపుచ్చారు. మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ సంఘర్షణను తాను తొందరగా ముగించాలనుకుంటున్నాననే వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజల కోసం ఒక మంచి ఒప్పందం కుదుర్చుకోవడం పైనే తమ ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదని.. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు మాత్రమే నిర్ణయిస్తారని తెలిపారు. హర్మూజ్ జలసంధి దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారని కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ట్రంప్ ప్రయోగించిన ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది ఆమె చెప్పుకొచ్చారు. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హర్మూజ్ జలసంధి దిగ్బంధంపై అమెరికా వివరణ ఇచ్చింది.

కాగా కాల్పుల విరమణను అమెరికా వేసిన మరో ఎత్తుగడగానే ఇరాన్ భావిస్తోంది. తాము సదభిప్రాయంతో తొలిదఫా చర్చలకు కూర్చుంటే అమరికా అసంబద్ధ డిమాండ్లను తెర మీదకు తెచ్చిందని ఆ దేశ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఈ వారాంతంలోపు అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కాగా ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణం అమెరికాయేనని ఆరోపించారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఆ దేశం గౌరవించలేదని గుర్తు చేశారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. రాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.

మరోవైపు జర్మనీలో పర్యటిస్తున్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సైనిక సంక్షోభాలలో భారత్ కీలక పాత్ర పోషించి, వాటిని పరిష్కరించే సమయమూ రావచ్చని అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం సహా పలు అంతర్జాతీయ ఘర్షణలను నిలువరించడానికి భారత్‌ తనవంతు ప్రయత్నాలు చేసిందని తెలిపారు. అయితే ఈ ప్రయత్నాల ఫలితాలు అనేవి సమయం, ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు. ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ ఘర్షణలోనూ యుద్ధాన్ని ముగించాలని ఇరుపక్షాలను ప్రధాని మోదీ కోరారని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. దౌత్య వ్యవహారాల్లో ప్రధాని మోదీ సమతూకంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. భారత దౌత్య ప్రయత్నాల ప్రభావం వల్లే పెద్ద సంఖ్యలో భారతీయ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి వచ్చాయని రక్షణ మంత్రి అన్నారు. సైనిక సంక్షోభం టైంలోనూ 7 నుంచి 8 నౌకలను హర్మూజ్‌ దాటించడం అనేది కేవలం భారత దౌత్యపు ఘనత అని ఆయన వ్యాఖ్యానించారు.

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెల్లింది. అమెరికా- ఇరాన్‌ మధ్య చర్చల్లో జాప్యం మరికొంత కాలం కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాగా హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇంకా ఆరు నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్‌ ఓ నివేదికలో వెల్లడించింది. ఇందుకు కారణం ఇరాన్ ఈ జలసంధిలోని 20కి పైగా ప్రాంతాల్లో సీమైన్స్ అమర్చడమేనని చెబుతున్నారు. వీటన్నింటినీ గుర్తించి పూర్తిగా తొలగించేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు. శాంతిచర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలు ఫలించి, ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో ఈ ఆపరేషన్‌ చేపట్టడానికి వీలుంటుందని పెంటగాన్ స్పష్టం చేసింది. అమెరికా చట్టసభ సభ్యులతో నిర్వహించిన రహస్య సమావేశంలో అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ కీలకమైన నివేదిక వివరాలను వెల్లడించిందని చెబుతున్నారు.

మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ అమెరికా హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించడంపై ఇరాన్ ఆగ్రహంతో ఉంది.. ఈ నేపథ్యంలో సముద్ర గర్భంలోని కేబుల్స్ తెగవచ్చని ఐఆర్‌జీసీకి అనుబంధంగా పనిచేసే తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ కేబుల్స్‌కు నష్టం జరిగితే పర్షియన్ గల్ఫ్ అంతటా తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రయాదం ఉంది. ఇరాన్‌ కంటే యూఏఈ, ఖతార్‌, బహ్రెయిన్‌, కువైట్, సౌదీ అరేబియా పైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. బ్యాకింగ్‌, క్లౌడ్‌ సర్వీస్‌, కమ్యూనికేషన్లకు ప్రధానమైన ఫాల్కన్‌, ఏఏఈ-1, టీజీఎన్‌-గల్ఫ్‌, ఎస్‌ఈఏ-ఎంఈ-డబ్ల్యూఈ వంటి భూగర్భ కేబుల్ వ్యవస్థలు హర్మూజ్‌ నుంచే వెళ్తున్నాయి. 2024, 2025లో ఎర్రసముద్రంలోని కేబుళ్లు దెబ్బ తింటే రిపేర్ చేయడానికి చాలా నెలలు పట్టింది. యుద్ధం తీవ్రరూపం దాలిస్తే హర్మూజ్‌లో ఇరాన్.. ఎర్ర సముద్రం దక్షిణ ముఖద్వారం బాబ్ అల్‌ మందేబ్ జలసంధిలో ఉన్న సముద్రగర్భ కేబుళ్లను హూతీలు టార్గెట్ చేసే అవకాశం ఉంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story