Burning Topic: కులాల లెక్కలు తీయనున్న కేంద్ర ప్రభుత్వం!
Burning Topic: కేంద్ర హోంశాఖ జనగణన-2027 నోటిఫికేషన్ విడుదల చేసింది. 40 ప్రశ్నలతో డిజిటల్ పద్ధతిలో తొలిసారి సమగ్ర కుల గణన. వివరాలు మరియు మైలురాళ్లు.
Burning Topic: కులాల లెక్కలు తీయనున్న కేంద్ర ప్రభుత్వం!
Burning Topic: దేశవ్యాప్తంగా చేపట్టనున్న ‘జనగణన-2027’పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం దేశంలో తొలిసారిగా జనాభా లెక్కలతోపాటే సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. జనగణన ప్రశ్నావళిలోని 10వ ప్రశ్నగా ఎస్సీ, ఎస్టీ, కులానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించారు.
ప్రజల వద్దకు వెళ్లే గణన అధికారులు వారు తెలియజేసే కులాన్ని నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ తొలుత మంచు కురిసే ప్రాంతాలలో ప్రారంభం కానున్నదని రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, లద్దాఖ్‌లతో పాటు కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి జనాభా లెక్కింపు జరగనుంది.
దేశంలోనే తొలిసారిగా యాప్‌లు, డిజిటల్ సాధనాల ద్వారా జనాభా లెక్కల సేకరణ చేపట్టనున్నారు. జనాభా గణన సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరుగుతున్నా.. అంతకుముందే, ఆగస్టు 17 నుంచి 31 వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా సమర్పించేందుకు ఉపయోగపడే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ పోర్టల్‌ను, జనగణనకు సంబంధించి పరిపాలనా పరమైన పర్యవేక్షణకు సాయపడే సెన్సస్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో జరుగుతోన్న జనగణనలో యువత చురుగ్గా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జనగణన విషయంలో ఒక గంటా, రెండు గంటల సమయం కేటాయించండి. అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటూ సూచించారు.
జనగణన క్రమంలోనే జనగణనలో అడగాల్సిన 40 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిలో కులం, కోవిడ్ టీకా వేయించుకున్న ప్రదేశం వంటి అంశాలు ఉన్నాయి. మహిళలు, పురుషుల లెక్కింపుతో పాటు కులం, ఉపకులాలను లెక్కించి జాబితా రూపొందించనున్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రశ్నలలో కొన్ని..
జన్మస్థలం, ప్రస్తుత నివాస స్థలం, వలసకు కారణం
ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ఎంత కాలం నుంచి ఉంటున్నారు?
వ్యక్తి వైవాహిక స్థితి.. షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ, మాతృభాష
అక్షరాస్యతతో పాటు... డిజిటల్ అక్షరాస్యత స్థితి
ఉద్యోగం కోసం వెతుకుతుంటే... ఎలాంటి పనికోసం వెతుకుతున్నారు
వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న మహిళలకు సంబంధించి
బ్యాంకు ఖాతాలు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు
మొత్తం రూ.11,718.24 కోట్ల అంచనా వ్యయంతో జనగణన-2027ను రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల నమోదు, వసతులకు సంబంధించిన వివరాల సేకరణ చేపట్టారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జనాభా, విద్య, ఉపాధి, కులానికి సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జనగణనలో పౌరులు అందించే వ్యక్తిగత వివరాలకు చట్టపరమైన రక్షణ కల్పించారు.
సెన్సస్ యాక్ట్, 1948లోని సెక్షన్ 15 ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారానికి పూర్తి చట్టబద్ధ రహస్య రక్షణ ఉంటుంది. తాజా జనాభా లెక్కల్లో భాగంగా తొలిసారి కులం వివరాలు సేకరిస్తున్నప్పటికీ అడిగే ప్రశ్నల్లో కులాల జాబితా ఏదీ ఉండే అవకాశం లేదు. ప్రజలు ఇచ్చే సమాధానాన్ని నేరుగా నమోదు చేస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడాది ఏప్రిల్ 30న కులాల వారీ జనాభా వివరాలు సేకరించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశం తీర్మానించిన సంగతి తెలిసిందే.
కాగా పదేళ్లకు ఒకసారి జరిపే జనాభా లెక్కలు వాస్తవానికి 2021లోనే మొదలు కావాల్సి ఉన్నా అప్పట్లో కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కాగా జనాభా లెక్కల్లో భాగంగా కులాల వివరాలు కూడా సేకరించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆక్షేపణ తెలిపింది.
కులాల జాబితా ఆధారంగా కాకుండా స్పందనలను మాత్రమే నమోదు చేయడం అనుమానాలు రేకెత్తిస్తోందని విమర్శించారు. ఈ అంశంపై అధికార పక్షం ఏ రాజకీయ పార్టీతోనూ చర్చించలేదని ఆరోపించింది. బిహార్, తెలంగాణల్లో మాదిరిగానే సిద్ధంగా ఉన్న కులాల జాబితా సాయంతో జనాభా లెక్కలు నిర్వహిస్తారని ఆశించామని అందుకు భిన్నంగా జరుగుతూండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గత ఏడాది ప్రధాని మోదీకి రాసిన లేఖలో తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని, అన్ని రాజకీయ పార్టీటలతో చర్చించాలని కోరారని, ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని విమర్శించారు.




