Off The Record: బాబు దెబ్బకు వైసీపీ సీన్ రివర్స్ ..! ఇది నా అడ్డా


Off The Record: బాబు దెబ్బకు వైసీపీ సీన్ రివర్స్ ..! ఇది నా అడ్డా
Off The Record: కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన భారీ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
Off The Record: కుప్పం.. ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పాలిటిక్స్‌కు వెన్నెముక. గత ఎన్నికల సమయంలో కుప్పంను కొడతాం అన్న వైసీపీ సవాళ్లకు చంద్రబాబు సమాధానం ఎలా ఉంటుందో ఇప్పుడు కనిపిస్తోంది. అది మాటలతో కాదు.. వేల కోట్ల పెట్టుబడుల మూటలతో కేవలం రాజకీయం మాత్రమే కాదు, కుప్పం గడ్డపై పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు. కుప్పంలో ఏం జరిగింది అని ప్రశ్నించే వారికి.. చంద్రబాబు విసిరిన పారిశ్రామిక సవాల్ ఏంటో ఓసారి చూద్దాం..
ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం మాది.. ఈ కోటను బద్దలు కొడతాం అంటూ గతంలో వైసీపీ చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రతిపక్షాల విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు వేసిన కౌంటర్ ఒకే ఒక్కటి.. అదే డెవలప్మెంట్. కుప్పం కేవలం వీఐపీల ఇలాకానే కాదు, ఐఫోన్ విడిభాగాలు తయారయ్యే టెక్ హబ్ అని చంద్రబాబు నిరూపిస్తున్నారు. 8 పరిశ్రమలకు 2,203 కోట్ల రూపాయల పెట్టుబడులతో శంకుస్థాపన చేయడంతో.. డెవలప్మెంట్ లేదన్న నోళ్లకే తాళం పడింది. ఆనాడు.. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం అంటూ వైసీపీ నేతలు కాన్ఫిడెన్స్ చూపించారు. నేడు.. 70 వేల ఉద్యోగాలతో కుప్పాన్ని చంద్రబాబు కంచుకోటగా మార్చారు. నాడు.. నీళ్లు లేని బీడు భూములు దర్శనం ఇచ్చేవి. నేడు.. కృష్ణా జలాలతో కుప్పంలో పారిశ్రామిక గలగలలతో కుప్పం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంపై విమర్శలు గుప్పించినవారు గమనించాల్సింది ఏంటంటే.. కుప్పానికి వస్తున్నది చిన్నచిన్న యూనిట్లు కాదు. ఏకంగా ఐఫోన్ ఛాసిస్ తయారీ కోసం వస్తున్న హిందాల్కో లాంటి దిగ్గజ సంస్థ. మా వాళ్లకు ఉద్యోగాల్లేవు అన్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఆదిత్య బిర్లా మల్టీ-స్కిల్ సెంటర్ ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. ట్రైనింగ్ అక్కడే.. ఉద్యోగం అక్కడే.
ఇది స్థానిక యువతకు చంద్రబాబు ఇచ్చిన గ్యారంటీ. రాజకీయ వర్గాల్లో ఆఫ్ ది రికార్డ్‌గా వినిపిస్తున్న మరో పాయింట్ ఏంటంటే.. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పరిశ్రమలను చంద్రబాబు పంపిణీ చేశారు. దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. పలార్లపల్లె నుంచి విజలాపురం దాకా.. ఏ ఊరి ఓటరు కూడా మా ఊరికి ఏం చేయలేదు అని అనే ఛాన్స్ లేకుండా ప్లాన్ చేశారు సీఎం నారా చంద్రబాబునాయుడు. కుప్పం నియోజకవర్గం వ్యాప్తంగా కొత్తగా నెలకొలిపే 16 పరిశ్రమలకు 7 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే.. అది విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే వార్తే కదా. మరోవైపు నీళ్ల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆలస్యాన్ని ఎత్తిచూపుతూనే... హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తెచ్చి అభినవ చాణక్యుడు అని మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు. వైద్యం అందడం లేదు అన్న విమర్శలకు సంజీవని వాహనాలతో చెక్ పెట్టారు.
ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం 'కో-వర్కింగ్ స్పేస్', అటు రైతు బిడ్డల కోసం పారిశ్రామికీకరణ. ఈ కాంబినేషన్ చూస్తుంటే... కుప్పంలో చంద్రబాబును ఢీకొట్టడం ప్రతిపక్షాలకు ఇక కలలోని మాటేనని విశ్లేషకుల మాట. ఇదంతా ఓ ఎత్తయితే.. అసలు మాస్టర్ ప్లాన్ ఇక్కడ ఉందని రాజకీయ విశ్లేషకుల వాదన. కుప్పంలో అనునిత్యం నారా కుటుంబం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా నెలకో పర్యటన ఉండేలా నారా భువనేశ్వరి ప్రణాళికలు సిద్దం చేసుకొని పర్యటన సాగిస్తున్నారు. సొంత ఊరికంటే, మెట్టిన ఊరికి సేవ చేసే విధంగా నెలలో మూడు, నాలుగు రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటిస్తూ వస్తున్నారు. ప్రజలతో మమేకమై.. వారికి కావాల్సిన ప్రభుత్వ సేవలు, పథకాలు అందేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక వచ్చిన ప్రతిసారి మహిళామణులతో ప్రత్యేకంగా ముచ్చటించి అంతా నా కుటుంబ సభ్యులే అనే రీతిలో అందరితోనూ కలసిమెలసి మాట్లాడుతున్నారు. భువనేశ్వరికి పర్యటనతో పాటు.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నిత్యం కుప్పంలోనే మకాం వేస్తున్నారు. మన నేత పోర్టల్ ద్వారా వచ్చిన పిర్యాదులు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ వస్తున్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలకు సీఎం ప్రతినిధిగా అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన పథకాలు సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు నారా భువనేశ్వరి. తెలుగు తమ్ముళ్లకు భరోసా కల్పించేలా అనునిత్యం వారిని అంటిపెట్టుకు ఉంటున్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. సో... విమర్శకులకు చంద్రబాబు మాత్రం తన పని తాను చేసుకుపోతూ మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతున్నారన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. కుప్పాన్ని ఏపీకి రెండో రాజధాని స్థాయిలో అభివృద్ధి చేస్తూ, తన రాజకీయ కోటకు డెవలప్మెంట్ అనే రక్షణ కవచాన్ని తొడిగారట చంద్రబాబు. ఇప్పుడు చెప్పండి... కుప్పం ఎవరిది? చంద్రబాబుదే అని సమాధానం చెప్పేలా ఈ అభివృద్ధి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పారిశ్రామిక గర్జన ముందు ప్రతిపక్షాలు నిలవగలవా? లెట్స్ వెయిట్ అండ్ సీ..

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

