Off The Record: అవును నాకు మీ కంటే పవన్ కళ్యాణ్ ముఖ్యం?

Off The Record: పిఠాపురం టీడీపీలో కలకలం! ఎస్.వి.ఎస్.ఎన్. వర్మను ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన చంద్రబాబు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 May 2026 6:39 AM IST
Off The Record
X

Off The Record: అవును నాకు మీ కంటే పవన్ కళ్యాణ్ ముఖ్యం?

Off The Record: గత కొన్ని నెలలుగా ఏపీ వ్యాప్తంగా..టీడీపీ – జనసేన మధ్య క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు పిఠాపురం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గం కూటమి రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారింది. పొత్తు లేకపోయి ఉంటే ఇక్కడ టీడీపీ తరఫున వర్మనే బరిలోకి దిగేవారు. కానీ పొత్తులో భాగంగా సీటు జనసేనకు వెళ్లడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి నుంచి స్థానికంగా ఇరుపార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నెమ్మదిగా బయటపడుతున్న పరిస్థితి కనిపించింది.

కొద్ది రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమం ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫొటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. ఆ తర్వాత టీడీపీ– జనసేన వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి..ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారం కూటమి అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది.

పిఠాపురం పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఫొటోలు, ఫ్లెక్సీల కోసం ఇంత పెద్ద స్థాయిలో వివాదాలు అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న అంశాలపై గొడవలు బయటపడటం మంచిది కాదని ఆయన భావించినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం లాంటి సెన్సిటివ్ నియోజకవర్గంలో విభేదాలు పెరిగితే.. అది కూటమి మొత్తం ఇమేజ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేసినట్టు తెలుస్తోంది..

పిఠాపురంలో వివాదం మరింత ముదరకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టిన అధిష్టానం.. వర్మను టీడీపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించే నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ నిర్ణయం ద్వారా జనసేనకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామనే స్పష్టమైన సంకేతం కూడా పంపించారని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో పిఠాపురం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న హాట్ సీట్ కావడంతో.. ఇక్కడ చిన్న వివాదం కూడా పెద్ద రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం ముందుగానే గ్రహించినట్టు కనిపిస్తోంది.

కూటమిలో క్షేత్రస్థాయిలో విభేదాలు కొనసాగితే.. భవిష్యత్తులో అది ప్రభుత్వంపై, రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు గత కొన్ని రోజులుగా పదే పదే చెబుతున్నారు. పైస్థాయిలో పవన్ కళ్యాణ్‌తో తాను చాలా సఖ్యతగా ఉన్నానని.. ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలూ లేవని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. అలాంటప్పుడు కింది స్థాయిలో అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తున్నారనే సందేశాన్ని కూడా ఆయన పార్టీ నేతలకు ఇస్తున్నారు. పిఠాపురంలోనే ఇలాంటి పరిస్థితులు కొనసాగితే.. జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కూడా అధిష్టానం అంచనా వేసినట్టు తెలుస్తోంది. అందుకే పరిస్థితి మరింత ముదరకముందే చర్యలు తీసుకుని.. పవన్ కళ్యాణ్‌కు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామనే భావన కలిగేలా నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది..

మరోవైపు వర్మ మాత్రం పార్టీ తనతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆయన స్పష్టం చేశారు. ఐతే వర్మపై అధిష్టానం చర్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. టీడీపీకి కట్టప్పలా, నమ్మకంగా పని చేసే లీడర్‌పై ఇలాంటి చర్యలు కేడర్‌ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య విభేదాలను సృష్టించే చర్యల పట్ల అధిష్టానం యాక్షన్ తీసుకోవడం మంచి పరిణామమే ఐనా.. కాస్త వేరేలా డీల్ చేస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐతే ఇంచార్జీ బాధ్యతల నుంచి తొలగించినా వర్మ మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించారు. ఎక్కడా పార్టీని తప్పు బట్టేలా మాట్లాడకుండా.. సింపతి కార్డు ప్లే చేశారనే చర్చ జరుగుతోంది. మరి భవిష్యత్తులో వర్మ పొలిటికల్ అడుగులు ఎలా ఉంటాయి. టీడీపీలోనే ఉండి.. పిఠాపురంలో కూటమి బలోపేతానికి కృషి చేస్తారా..? ఇంకేమైన నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పిఠాపురానికి కొత్త ఇన్‌ఛార్జ్ ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. మరి కొత్త ఇన్‌ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఠాపురం రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయి...? టీడీపీ – జనసేన మధ్య సమన్వయం ఎలా ఉండబోతోంది..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story