Off The Record: మోడీని ఫాలో అవుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Off The Record:
Off The Record: మోడీని ఫాలో అవుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Off The Record: దేశవ్యాప్తంగా "నో వెహికల్ డే", ఇంధన సంరక్షణ, గ్రీన్ ఎనర్జీపై చర్చ జరుగుతున్న వేళ ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా పొదుపు చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వాల నిర్ణయాలు పాలసీల రూపంలో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్వయంగా తమ జీవనశైలిలో మార్పులు చేస్తూ ప్రజలకు కొత్త సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రులు కూడా అదే దారిలో నడవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా పలువురు మంత్రులు సైకిళ్లపై పార్టీ కార్యాలయాలకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఒక రోజు కార్యక్రమమా..? లేక ప్రజల్లోకి ఒక కొత్త జీవన విధానాన్ని తీసుకెళ్లే రాజకీయ, సామాజిక సందేశమా..? అనే చర్చ ఆసక్తికరంగా మారిందట...
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు వాహన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇంధన వాడకాన్ని తగ్గించి.. విదేశీ మారక నిల్వల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు కేవలం పొదుపు గురించి చెప్పడమే కాదు... ప్రభుత్వ పెద్దలు స్వయంగా ఆచరించి చూపాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారన్నాట. ప్రజలకు చెప్పే విషయాన్ని ముందు నేతలే పాటిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉందట. అందుకే చిన్న చిన్న మార్పుల నుంచే పెద్ద సందేశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్య నేతల కాన్వాయ్‌ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో భారీ వాహనాలతో కాన్వాయ్‌లు కనిపించేవి. కానీ ఇప్పుడు అవసరమైన వాహనాలకే పరిమితం కావాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండానే అనవసర ఖర్చులు తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పర్యటనల విధానంలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తక్కువ వాహనాలు, తక్కువ ఇంధన వినియోగం, ఎక్కువ ప్రయోజనం అనే ఫార్ములాను ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతర్జాతీయ పరిణామాలపై కూడా ప్రభుత్వ వర్గాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో పరిస్థితులు మారితే ప్రపంచ మార్కెట్లపై దాని ప్రభావం వెంటనే కనిపించే అవకాశముందని భావిస్తున్నారు. ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురుకాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
ప్రతి పౌరుడు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అవసరం లేని ప్రయాణాలను తగ్గించడం, చిన్న దూరాలకు సైకిల్ వినియోగించడం, సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించడం వంటి అంశాలపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రజలు కూడా దీనిని అలవాటు చేసుకుంటే ఇంధన వినియోగం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా కొంతవరకు తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారట. పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగపడే అవకాశముందని భావిస్తున్నారు.
ప్రభుత్వం కేవలం ఆదేశాలు జారీ చేయడం వరకే పరిమితం కాకుండా... దీన్నొక సామాజిక ఉద్యమంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములు అయ్యేలా కార్యక్రమాలు రూపొందించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. "ఒక రోజు సైకిల్ – ఒక రోజు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్" వంటి ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రజల్లో జీవనశైలి మార్పు తీసుకురావడమే దీని అసలు ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంధన పొదుపుతో పాటు ప్రత్యామ్నాయ శక్తి వనరుల వినియోగంపైనా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి ఇంటికీ సోలార్ కనెక్షన్ ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణ సిద్ధమవుతోందన్న చర్చ జరుగుతోంది. అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండే రాజకీయ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వారానికి ఒకరోజు పెట్టిన నో వెహికల్ డే ను మంత్రులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ వీరితో పాటు మరికొందరు మంత్రులు ఎలక్ట్రికల్ వెహికల్స్ అలాగే ఎలక్ట్రికల్ బైస్కిల్ బాట పడుతున్నారు.. ఒక అడుగు ముందుకు వేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు మాత్రం తన కాన్వయని పూర్తిగా పక్కనపెట్టి ఏకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇది కేవలం కొన్ని రోజులకే పరిమితమా.. ఇలానే కంటీన్య అవుతుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. పాలకులు తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇవి నిజాయితీ నిర్ణయాలే అయితే కచ్చితంగా ఫాలో చేయడానికి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ కేవలం ఫోటోషూట్లకు తాత్కాలిక ప్రయోజనాలకు మాత్రమే అయితే లైట్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అన్న మాటలు బాగానే వినిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో పొదుపు, పర్యావరణం, గ్రీన్ ఎనర్జీ అనే మూడు అంశాలనే ప్రధాన నినాదంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం పరిపాలన నిర్ణయాలుగా మిగిలిపోతాయా..? లేక ప్రజల్లో జీవనశైలి మార్పుకు దారి తీసే ఉద్యమంగా మారతాయా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




