Off The Record: కొత్త లీడర్లను తయారు చేస్తున్న తెలుగు దేశం పార్టీ!
Off The Record: అమరావతిలో జరిగిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు పక్కా సందేశం. డబ్బుల కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యమని స్పష్టీకరణ.
Off The Record: కొత్త లీడర్లను తయారు చేస్తున్న తెలుగు దేశం పార్టీ!
Off The Record: టీడీపీ లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి. సాధారణంగా నాయకత్వ శిక్షణలో భాగంగా చెప్పే మాటలుగానే కనిపించినా.. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం పెట్టిన ఫోకస్‌ను చూస్తే ఇందులో స్పష్టమైన రాజకీయ సందేశం కనిపిస్తోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటున్నారు..? కేడర్‌ను ఎంతవరకు కలుపుకొని వెళ్తున్నారు..? కొత్త తరానికి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారు..? అనే అంశాలపైనే చంద్రబాబు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను పడిన శ్రమను చంద్రబాబు స్వయంగా వివరించడం వెనుక కూడా బలమైన సందేశం ఉంది. మంత్రులు, అధికారుల చుట్టూ ఉదయం నుంచి రాత్రి వరకు తిరగడం.. అపాయింట్‌మెంట్లు తీసుకుని గంటల తరబడి వేచి ఉండటం.. ఉద్యోగులు, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం.. సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలిపెట్టకుండా ప్రయత్నించడం ద్వారా తాను ఈ స్థాయికి వచ్చానని సీఎం చెప్పడం.. ప్రస్తుత ప్రజాప్రతినిధులు కూడా అదే కమిట్‌మెంట్‌తో ప్రజాసేవ చేస్తే అనుకున్న ఫలితాలు రావటానికి ఆలస్యం అవ్వదు అన్న సందేశాన్ని పక్కగా ఇచ్చారు.
మరోవైపు ప్రతి పదేళ్లకోసారి జనరేషన్ మారుతుందని, మారుతున్న తరానికి అనుగుణంగా నాయకులు తమ పనితీరును మార్చుకోవాలని చంద్రబాబు చెప్పడం ఆసక్తికరంగా మారింది. పాత తరహా రాజకీయాలు, పాత ప్రచార పద్ధతులు, కేవలం పార్టీ గుర్తుపైనే ఆధారపడే రాజకీయాలు భవిష్యత్తులో పనిచేయవన్న సంకేతాన్ని సీఎం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, కొత్త ఓటర్లు, సోషల్ మీడియా ప్రభావిత వర్గాలతో నేరుగా అనుసంధానం కావాల్సిన అవసరాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేసినట్టుగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం ఒక్కటే గెలుపు సూత్రం కాదని చంద్రబాబు చెప్పడం కూడా ఎమ్మెల్యేలకు కీలక సందేశంగానే కనిపిస్తోంది. డబ్బులు ఖర్చు పెట్టకుండానే గెలుస్తూ వస్తున్న గద్దె రామ్మోహన్‌ను, నిరంతరం ప్రజల్లో ఉంటూ సిన్సియర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వరదరాజులు రెడ్డి వంటి నేతలను ఉదాహరణలుగా ప్రస్తావించడం ద్వారా.. ప్రజల్లో నిరంతరం ఉండే నాయకత్వానికే భవిష్యత్తు ఉంటుందని సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్య కనిపించడం కాకుండా.. ఐదేళ్లూ ప్రజలతో సంబంధాలు కొనసాగించాల్సిందే అన్నది ఇందులోని అసలు మెసేజ్‌గా కనిపిస్తోంది.
కేడర్‌ను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని చంద్రబాబు స్పష్టంగా చెప్పడం మరో కీలక అంశం. ప్రజాప్రతినిధులు సోలోగా పనిచేస్తే పెద్దగా ఫలితం ఉండదని, కేడర్‌ను కన్విన్స్ చేసి వారితో కలిసి పనిచేస్తే నాయకుడి బలం వందరెట్లు పెరుగుతుందని సీఎం చెప్పడం.. పార్టీ సంస్థాగత వ్యవస్థపై ఆయన ఎంత సీరియస్‌గా ఉన్నారో స్పష్టం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలకు దూరమవుతున్నారన్న అభిప్రాయాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గుడివాడ నియోజకవర్గంలో బూత్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న పరంధామయ్యను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా కేడర్‌కు ఇచ్చిన స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో యాక్టివ్‌గా ఉండే నాయకుల కంటే.. నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహించే విధానానికి ఇకపై మరింత ప్రాధాన్యం ఉండొచ్చన్న చర్చ మొదలైంది.
ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంక్లేవ్‌లోని అసలు రాజకీయ దిశను స్పష్టం చేశాయి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారే సక్సెస్ అవుతారని లోకేష్ చెప్పడం.. పార్టీ నాయకులు గడప గడపకూ వెళ్లి ప్రజలను కలవాలన్న వ్యూహాన్ని మరింత బలపరుస్తోంది. నిరంతరం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే యువతతోపాటు అన్ని వర్గాలతో అనుబంధం పెరుగుతుందని ఆయన చెప్పడం ద్వారా.. భవిష్యత్ రాజకీయాల్లో ప్రజలతో వ్యక్తిగత అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తమ నడవడికను ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉంటారన్న స్పృహ ప్రతి ప్రజాప్రతినిధిలో ఉండాలని చంద్రబాబు చెప్పడం.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇచ్చిన మరో కీలక హెచ్చరికగా కనిపిస్తోంది. పదవి వచ్చిందనే ధీమాతో వ్యవహరించడం కాకుండా.. ప్రజల మధ్య తమ ప్రవర్తన, అందుబాటులో ఉండే విధానం, సమస్యల పరిష్కారంపై చూపే శ్రద్ధ వంటి ప్రతి అంశం రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది.
యాంటీ వేవ్‌లో గెలిచిన నాయకుల అనుభవాలను, వారి పని విధానాన్ని మిగిలిన నేతలు గమనించాలని చంద్రబాబు సూచించడం కూడా పార్టీకి ఒక రకమైన అంతర్గత పాఠమే. ఒకే ఫార్ములాతో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయాలు చేయలేమని, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలను మార్చుకోవాలని సీఎం సూచించినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజల మూడ్‌ను అర్థం చేసుకోవడం, జనరేషన్‌లో వస్తున్న మార్పులను గుర్తించడం, దానికి తగ్గట్టుగా రాజకీయ శైలిని మార్చుకోవడం తప్పనిసరి అన్నది ఆయన చెప్పిన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రధాని మోదీ చిన్నపాటి తప్పులు జరిగినా వెంటనే సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారని చంద్రబాబు ప్రస్తావించడం కూడా నేతలకు ఒక ఉదాహరణగా చెప్పినట్టుగా కనిపిస్తోంది. ప్రజలు గెలిపించేలా నాయకత్వాన్ని పెంచుకోవాలని, కేడర్ తమ కోసం పనిచేసేలా సంబంధాలను నిర్మించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అంటే పదవి ఉన్నంత మాత్రాన నాయకత్వం వచ్చేసినట్లు కాదని.. ప్రజల నమ్మకం, కార్యకర్తల మద్దతు, నిరంతర ప్రజా సంబంధాల ద్వారానే అసలైన నాయకత్వం ఏర్పడుతుందన్నది చంద్రబాబు చెప్పిన ప్రధాన సందేశంగా కనిపిస్తోంది.
ఈ లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్‌ను కేవలం శిక్షణా కార్యక్రమంగా చూడటం కంటే.. టీడీపీ ప్రజాప్రతినిధుల పనితీరును కొత్త తరహా రాజకీయాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది. డబ్బుతో ఎన్నిక గెలవొచ్చు కానీ.. ప్రజల నమ్మకాన్ని కొనలేం. పదవితో నాయకుడిగా ఉండొచ్చు కానీ.. కేడర్, ప్రజలతో అనుబంధం లేకుండా బలమైన నాయకుడిగా నిలవలేం అన్న సందేశాన్ని చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలకు బలంగా పంపినట్టుగా కనిపిస్తోంది.




