Off The Record: మహానాడు పై చంద్రబాబు సంచలన నిర్ణయం

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న వేళ, సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 May 2026 6:34 AM IST
Off The Record
X

Off The Record: మహానాడు పై చంద్రబాబు సంచలన నిర్ణయం

Off The Record: ఈ నెల 18, 19, 20 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో.. 23, 24 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, స్థానిక రాజకీయ సమీకరణాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, కూటమి సమన్వయం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోందట. అంతేకాదు.. ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు ప్రజల్లోకి ఏ స్థాయిలో వెళ్తున్నాయి..? క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల స్పందన ఎలా ఉంది..? ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తోంది..? వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహానాడు ముందుగానే మినీ మహానాడు నిర్వహించడం ద్వారా కేడర్‌లో నాయకత్వ లక్షణాలు పెరగడమే కాకుండా.. ప్రభుత్వ పనితీరును గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో కూడా మంచి ఫలితాలు రావొచ్చనే ఆలోచన అధిష్టానం దృష్టిలో ఉందట.

మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాలను నిర్ణీత గడువులోగా కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపాలని స్పష్టమైన ఆదేశాలు జిల్లా ఇంచార్జ్‌లకు వెళ్లినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను 21వ తేదీ నాటికి సిద్ధం చేసి.. 24వ తేదీ నాటికి కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి మహానాడును పూర్తిగా వ్యవస్థీకృత పద్ధతిలో నిర్వహించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కంటే ఈసారి తీర్మానాల సేకరణ, స్థానిక అభిప్రాయాల సమీకరణ, కేడర్ సూచనల నమోదు వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. కేవలం సభలు నిర్వహించడం కాకుండా.. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన సూచనలను భవిష్యత్ కార్యాచరణలో భాగం చేయాలనే దిశగా కూడా పార్టీ అడుగులు వేస్తోందట.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంపై కూడా పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్‌తోపాటు అంతకంటే ఎక్కువ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోందట. ఇదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేలా.. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర అభివృద్ధి దిశగా జరుగుతున్న కార్యక్రమాలపై కేడర్‌కు స్పష్టమైన అవగాహన కల్పించే ప్రయత్నం కూడా జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మినీ మహానాడు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట.

ఇక ఈ మినీ మహానాడుల్లో పార్టీ కార్యక్రమాలపై మాత్రమే కాకుండా.. కేడర్ అభిప్రాయాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గ స్థాయి నేతల పనితీరు, ప్రజా ప్రతిస్పందన, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ స్థాయి రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి కమిటీల పనితీరు, కూటమి సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టమైన వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ సమావేశాల వెనుక అసలు ఉద్దేశమన్న చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నాయకుల వరుస సమావేశాలు, సమన్వయ కార్యక్రమాలు, కేడర్‌తో మమేకమయ్యే కార్యక్రమాలు కొనసాగుతున్న వేళ మినీ మహానాడు.. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే ముందు.. మినీ మహానాడు ద్వారా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అధిష్టానం భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి.. మహానాడు ముందు నిర్వహిస్తున్న ఈ మినీ మహానాడులు కేవలం పార్టీ సమావేశాలుగానే కాకుండా.. టీడీపీకి క్షేత్రస్థాయి రాజకీయ పల్స్ తెలుసుకునే వేదికగా మారనున్నాయా..? కేడర్‌ను మరింత బలోపేతం చేసే రాజకీయ వ్యూహంగా నిలవనున్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story