Off The Record: ఇంకో పదేళ్లు అధికారంలో కూటమి ప్రభుత్వం?
Off The Record: ఏపీ రాజకీయాల్లో సంచలనం! కూటమి ఐక్యతపై చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయం.
Off The Record: ఇంకో పదేళ్లు అధికారంలో కూటమి ప్రభుత్వం?
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. వచ్చే జూన్ నాటికి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రెండేళ్లు పూర్తవుతాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నప్పటికీ.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ, జనసేన మధ్య అంతర్గత విభేదాల చర్చ అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంది. ప్రత్యేకంగా స్థానిక స్థాయిలో కేడర్ మధ్య సమన్వయం లోపించడం.. కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యల యుద్ధానికి దారి తీసింది.. అయితే వీటన్నింటిలో కూడా ఎక్కువగా చర్చకు వచ్చిన నియోజకవర్గం మాత్రం పిఠాపురమే. ఎందుకంటే ఇదే నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో పిఠాపురం రాజకీయాలకు సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. అయితే గత కొంతకాలంగా అక్కడి రాజకీయ పరిస్థితులు కూటమికి చికాకుగా మారుతున్నాయనే చర్చ నడుస్తోంది. టీడీపీ నేత వర్మ వ్యవహార శైలి స్థానికంగా వివాదాలకు కారణమవుతోందనే అభిప్రాయాలు కూడా వినిపించాయి.
కొన్ని కార్యక్రమాలు, వ్యాఖ్యలు, స్థానిక రాజకీయ చర్యలు.. పొత్తు ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయనే ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ అధిష్టానం.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది.
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. వర్మ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసంతృప్తిగా ఉన్నారనే సంకేతాలు బయటకు వచ్చాయి. పొత్తుల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, కూటమి ఐక్యతకు భంగం కలిగించే చర్యలు ఎవరి నుంచైనా వచ్చినా ఉపేక్షించబోమనే సందేశాన్ని చంద్రబాబు స్పష్టంగా ఇచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా పేర్లు ప్రస్తావించకపోయినా.. తన నిర్ణయాల ద్వారానే చంద్రబాబు బలమైన సంకేతాలు ఇచ్చారనే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్లడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యమని, వ్యక్తిగత రాజకీయాలకంటే పొత్తు ధర్మానికే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టతకు టీడీపీ అధిష్టానం వచ్చినట్టు చెబుతున్నారు.
తాజాగా వర్మను పిఠాపురం ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం కూడా ఇదే రాజకీయ సందేశానికి కొనసాగింపుగా భావిస్తున్నారు. పొత్తు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే.. వారి స్థాయి ఎంత ఉన్నా చర్యలు తప్పవనే హెచ్చరిక ఇది అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగాలనే నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదనీ, ఇకపై కూడా “ఒకే మాట – ఒకే బాట” విధానంతో కూటమి కొనసాగుతుందనే క్లారిటీ ఈ పరిణామాలతో వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ వ్యవహార శైలిపై కూడా అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అనవసర వ్యాఖ్యలు, ఆధిపత్య రాజకీయాలు, బహిరంగ విభేదాలు.. ఇకపై సహించబోమనే సంకేతాలు కూడా స్పష్టంగా వెళ్తున్నాయి.
అవసరమైతే క్రమశిక్షణ చర్యలకు కూడా వెనుకాడబోమనే భావన కూటమి పార్టీల నాయకుల్లో కనిపిస్తోంది.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పొత్తుల విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నారని టాక్. టీడీపీ, జనసేన బంధం తాత్కాలికం కాదని, ఇది దీర్ఘకాల రాజకీయ ప్రయాణమని పవన్ పదేపదే చెబుతున్నారు. కనీసం పదిహేనేళ్లు ఈ పొత్తు కొనసాగాలని కూడా ఆయన ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని పవన్ స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూడా పవన్‌తో కలిసి పనిచేస్తున్నామని, కూటమి బలంగా ఉందనీ చెబుతున్నారు. ఇలా కూటమిలోని ఇద్దరు అగ్రనేతల మాటలు చూస్తే.. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తోందనే విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే క్రమంలో.. అంతర్గత విభేదాలకు అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో కూటమి అధిష్టానం వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న వివాదాలు కూడా పెద్ద చర్చలకు దారి తీసే అవకాశం ఉండటంతో.. ఇకపై అలాంటి అంశాలపై వెంటనే స్పందించే విధంగా నాయకత్వం వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కూటమి ఐక్యతకు భంగం కలిగించే చర్యలు, వ్యాఖ్యలు, రాజకీయ కార్యక్రమాలు ఎవరి నుంచైనా వచ్చినా.. చర్యలు మాత్రం తప్పవనే సంకేతాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇలా... చంద్రబాబు ఇస్తున్న పరోక్ష హెచ్చరికలతోనైనా ద్వితీయ శ్రేణి నాయకులు కాని, కేడర్ కానీ కూటమి ధర్మానికి.. టీడీపీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటారా..? చూడాలి.




