Burning Topic: చైనాతో అమెరికా యు*ద్ధం? ట్రంప్ కు చైనా వార్నింగ్!

Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ఓడరేవులపై ట్రంప్ ఆంక్షలను చైనా తీవ్రంగా తప్పుబట్టింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 April 2026 7:28 AM IST
Burning Topic
X

Burning Topic: చైనాతో అమెరికా యు*ద్ధం? ట్రంప్ కు చైనా వార్నింగ్!

Burning Topic: అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరగండం తెలిసిందే. ఇరు దేశాల నాయకులు హెచ్చరికలతో యుద్ధం మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిసినా, చర్చలు పూర్తిగా నిలిచిపోలేదని సంకేతాలు వస్తున్నాయి. మధ్యవర్తిత్వం వహించే దేశాల సహకారంతో అమెరికా- ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలకు అవకాశాలు సజీవంగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సమయం, స్థలం ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ లేదా స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఈ నెల 16న చర్చలు జరగొచ్చని తెలుస్తోంది. శాంతి చర్చలు కొనసాగించే విషయంలో ఇరు దేశాల అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తు్న్నాయి.

కాగా చర్చలకు సంబంధించి బాల్‌ ఇంకా ఇరాన్‌ కోర్టులోనే ఉందన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. తర్వాత ఏం జరగాలనేది వారే నిర్ణయిస్తారని నేను నమ్ముతున్నానని, తదుపరి చర్చలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన చర్చలు హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడంతో సహా యూఎస్‌ ప్రాధాన్యతల గురించి స్పష్టం చేసేందుకు సహాయపడ్డాయన్నారు. ఇరాన్‌ ప్రతినిధులు ఒక ఒప్పందాన్ని ఖరారు చేయలేకపోవడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయన్నారు. చర్చల నేపథ్యంలో ఇరాన్‌లో ఎవరు పెత్తనం చెలాయిస్తున్నారనే దానిపై తమకు ఓ అవగాహన వచ్చిందన్నారు. భవిష్యత్తు చర్చలు ఇరాన్‌ చేతిలోనే ఉన్నప్పటికీ.. సైనికపరంగా అమెరికానే పైచేయి సాధించిందన్నారు. హర్మూజ్‌ మీదుగా ఇరాన్‌ చమురు ఎగుమతులను దిగ్భంధించి.. వారిపై ఆర్థిక ఒత్తిడి పెంచామన్నారు. ఈ సందర్భంగా ఆ దేశం అణ్వాయుధం తయారుచేయకూడదనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు వాన్స్.

ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చర్చలు ప్రారంభంలో సానుకూలంగా సాగినప్పటికీ, చివరి దశలో విఫలమయ్యాయి. దాదాపు 80 శాతం ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. కాగా యురేనియం శుద్ధి విషయంలో ఇరు దేశాల మధ్య తేడాలు తీవ్రంగా కనిపించాయి. అమెరికా ప్రతిపాదన ప్రకారం, ఇరాన్ కనీసం 20 సంవత్సరాల పాటు యురేనియం శుద్ధి నిలిపివేయాలని కోరింది.ఇరాన్ మాత్రం ఐదేళ్లపాటు మాత్రమే ఆంక్షలను అంగీకరించగలమని తెలిపింది. దీనిపై ఎలాంటి రాజీ కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. అంతేకాకుండా, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాకు అప్పగించాలన్న ప్రతిపాదన కూడా చర్చల్లో కీలకంగా మారింది. మరోవైపు రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం వచ్చే వారం ముగియనుంది. అప్పటికల్లా ఒప్పందం కుదరకపోతే మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది.

ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇరాన్‌ ఓడరేవులు, తీర ప్రాంతాలను అమెరికా నౌకాదళంతో దిగ్బంధించింది. దీంతో ఇప్పటికే భగ్గుమంటున్న చమురు ధరలు మరింత పెరిగే ముప్పూ పెరిగింది. తమ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంపై ఇరాన్ మండిపడింది. ఈ చర్య ఇరాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. తమ రేవుల దిగ్బంధనానికి ప్రతిగా పర్షియన్‌ గల్ఫ్, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ల చుట్టూ ఉన్న పోర్టులన్నింటికీ రాకపోకల్ని అడ్డుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఏ ఓడరేవూ సురక్షితం కాదంటూ తీవ్ర వ్యాఖ్య చేసింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలి అధ్యక్షుడికి ఇరాన్ లేఖ రాసింది.

తొలి దశ చర్చలు విఫలమైనప్పటికీ, మరోసారి చర్చలకు సిద్ధమవుతున్న అమెరికా– ఇరాన్ మధ్య పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపు శాశ్వత ఒప్పందం కుదరుతుందా లేదా అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు శాంతి చర్చలను కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తప్పనిసరిగా కొనసాగించాలని, ఎటువంటి ఉల్లంఘనలు జరగకూడదని హెచ్చరించారు. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదని, చర్చల ద్వారానే స్థిరమైన ఒప్పందం సాధ్యమని తెలిపారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి కోరింది. అటు మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు కూడా చర్చలను కొనసాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పాకిస్థాన్‌తో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ దేశాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మరోవైపు అమెరికా- ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకొచ్చింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని లావ్రోవ్‌ పిలుపునిచ్చారు. ఇరాన్‌, దాని పొరుగుదేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను తాము గౌరవిస్తామన్నారు. ఈ సంఘర్షణను ముగించేందుకు, పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతి కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను మాస్కో స్వాగతిస్తుందన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించడంలో చేతనైనంత సాయం చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈక్రమంలో ఇరాన్‌ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా పునరుద్ఘాటించింది. అమెరికాతో భవిష్యత్తులో కుదిరే శాంతి ఒప్పందంలో భాగంగా ఈ చర్యకు సిద్ధమైనట్లు తెలిపింది. ఈ సందర్భంగా హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధిస్తామంటూ ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడటాన్ని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తప్పుబట్టారు.

ఇదిలా ఉంటే పశ్చిమాసియాలె యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు పోప్ లియో -14 ను కూడా టార్గెట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్‌ వద్ద అణ్వాయుధమున్నా పర్లేదనుకునే, వెనెజువెలాపై అమెరికా దాడి చేయొద్దనుకునే పోప్‌ తమకు వద్దన్నారు. పోప్ నేరాలను ఇష్టపడే వ్యక్తిలా కూడా కన్పిస్తున్నారు. కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి. వామపక్షవాదానికి దన్నుగా నిలవడం మానుకోవాలి. అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు తన కారణంగానే లియో -14కు పోప్ వదవి వచ్చిందన్నారు. ఈ సందర్భంగా తాను దేవదూతగా రోగిపై తన చేతిని ఉంచినట్లు ఓ చిత్రాన్ని పోస్టు చేశారు ట్రంప్. అయితే దీనిపై విమర్శలు రావడంతో తొలగించేశారు. ఈ విమర్శలపై పోప్‌ కూడా దీటుగా స్పందించారు. శాంతి సందేశాన్ని విన్పించే విషయంలో ట్రంప్‌ యంత్రాంగానికి తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.. కానీ వాస్తవాలు చెప్పేందుకు మాత్రం వెనకాడబోనన్నారు. దైవ సందేశాన్ని ట్రంప్‌ అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయనతో వాదనకూ దిగదలచుకోలేదు అని స్పష్టం చేశారు పోప్.

మరోవైపు ఇరాన్‌తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను హెచ్చరించింది చైనా. ఇరాన్‌కు సైనిక మద్దతు అందిస్తే, చైనా కఠినమైన వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే. ఎవరైనా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు మేం గుర్తిస్తే 50 శాతం టారిఫ్ విధిస్తామని తెలిపారు. దీన్ని చైనా తప్పుపట్టింది. హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించాలన్న అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇక్కడతమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.ఇరాన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య, ఇంధన ఒప్పందాల విషయంలో తరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా హెచ్చరించింది చైనా. హర్మూజ్ జలసంధి ఇరాన్‌ నియంత్రణలోనే ఉందని.. చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. .ఈ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని పిలుపునిచ్చింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story