Off The Record: చిత్తూరులో చంద్రబాబుకు షాక్!

Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలపై టీడీపీలో అంతర్గత మధనం. చంద్రగిరి, జీడీ నెల్లూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల ఫలితాలపై ప్రత్యేక చర్చ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 7:53 AM IST
Off The Record
X

Off The Record: చిత్తూరులో చంద్రబాబుకు షాక్!

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోపే జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. కూటమి ప్రభుత్వానికి ఒకరకంగా క్షేత్రస్థాయి పరీక్షగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్తుంటే.. మంత్రి నారా లోకేష్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి మాత్రం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందన్న చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కొన్ని స్థానాల్లో వైసీపీ పుంజుకోవడం.. అధికార పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం టీడీపీ శ్రేణుల్లో కొత్త ఆలోచనలకు తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయాల గురించి చర్చ జరుగుతున్న వేళ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం కొన్ని నియోజకవర్గాల ఫలితాలు భిన్నమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా చంద్రగిరి, గంగాధర నెల్లూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల ఫలితాలు ఇప్పుడు పార్టీ అంతర్గత చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. రోడ్లపై హడావిడి చేయడం వేరు.. పోలింగ్ బూత్ దగ్గర ప్రజల మద్దతు కూడగట్టడం వేరు. ఈ రెండింటి మధ్య తేడాను కొందరు నేతలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ముందుగా చంద్రగిరి నియోజకవర్గం విషయానికొస్తే.. ఒకప్పుడు వైసీపీకి బలమైన రాజకీయ స్థావరంగా ఉన్న చంద్రగిరిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని రాజకీయంగా కట్టడి చేయడంలో ఎమ్మెల్యే పులివర్తి నాని కొంతవరకు సక్సెస్ అయ్యారనే అభిప్రాయం ఉంది. చెవిరెడ్డి రాజకీయ కదలికలపై నిఘా పెట్టడం.. నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను సమన్వయం చేయడం.. ప్రత్యర్థి వర్గానికి రాజకీయంగా చెక్ పెట్టే ప్రయత్నాలు జరిగాయి. ఎమ్మెల్యే నానితోపాటు ఆయన సతీమణి సుధారెడ్డి కూడా ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించారు. అయినప్పటికీ ఫలితాలు మాత్రం పూర్తిస్థాయిలో టీడీపీకి అనుకూలంగా రాలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలకు గాను చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల మండలాల్లో టీడీపీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు ఎర్రావారిపాలెం, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు మండలాల్లో ఫ్యాన్ పార్టీ వైసీపీ విజయాన్ని అందుకుంది. అంటే సగం స్థానాల్లో టీడీపీ.. మిగిలిన సగం స్థానాల్లో వైసీపీ పట్టు నిలుపుకున్నాయి. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 44 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన పులివర్తి నానికి.. ఇప్పుడు ఈ ఫలితాలు ఒక హెచ్చరికగా మారాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాడు వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చిందా..? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకత్వంపై ప్రజల్లో కొత్త అసంతృప్తి మొదలైందా..? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు పార్టీ అభ్యర్థుల విజయానికి ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్న చర్చ ఒకవైపు.. ఎమ్మెల్యే పనితీరుపై కొంతమంది నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం మరోవైపు.. చంద్రగిరి టీడీపీలో అంతర్గత సమీక్షకు కారణమవుతున్నాయట. చెవిరెడ్డిని రాజకీయంగా కట్టడి చేయడంపైనే దృష్టి పెట్టి.. సొంత పార్టీ కేడర్‌ను పూర్తిస్థాయిలో కలుపుకుపోవడంలో ఎక్కడైనా లోపం జరిగిందా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.

ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఆరు మండలాలకు గాను కేవలం రెండు మండలాల్లో మాత్రమే టీడీపీ జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోగా.. మిగిలిన నాలుగు మండలాల్లో వైసీపీ విజయాన్ని అందుకుంది. ఈ ఫలితాలు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.థామస్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు.. స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు.. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులను పక్కనపెట్టి, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసంతృప్తి కేడర్‌లో ఉందనే చర్చ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో గ్రావెల్ క్వారీల వ్యవహారాలు, స్థానిక నాయకుల పెత్తనం వంటి అంశాలు కూడా పార్టీ శ్రేణుల్లో అసహనాన్ని పెంచాయన్న ఆరోపణలు ఉన్నాయి.

పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదన్న భావన బలపడితే.. దాని ప్రభావం ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందో గంగాధర నెల్లూరు ఫలితాలు మరోసారి గుర్తు చేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండాల్సింది పోయి.. స్థానికంగా ఇతర నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న అసంతృప్తి కూడా పార్టీ వర్గాల్లో చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను కేవలం వైసీపీ గెలుపుగా కాకుండా.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ప్రజలు ఇచ్చిన రాజకీయ సంకేతంగా చూడాలన్న అభిప్రాయాలు మొదలయ్యాయి.

ఇక తంబళ్లపల్లె నియోజకవర్గం కూడా ఇదే రాజకీయ చర్చకు మరో కోణాన్ని జోడిస్తోందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడి ఫలితాలు, స్థానిక నాయకుల మధ్య సమన్వయం, పార్టీ కేడర్‌లో ఉన్న అభిప్రాయాలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్లాల్సిన అంశాలుగా మారుతున్నాయన్న చర్చ నడుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలు టీడీపీకి ఒక రాజకీయ హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ఉంటే.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులపై ఉంది. కానీ ఎమ్మెల్యేలకు, కేడర్‌కు మధ్య సమన్వయం లేకపోతే.. ప్రభుత్వంపై సానుకూలత ఉన్నా ఎన్నికల సమయంలో అది ఓట్ల రూపంలోకి మారకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. ఈ ఫలితాలను స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితమైన జయాపజయాలుగా టీడీపీ అధిష్టానం చూస్తోందా..? లేక 2029 ఎన్నికలకు ముందస్తు హెచ్చరికగా తీసుకుని ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి చేపడుతుందా..? ఎందుకంటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉండటం ఎంత ముఖ్యమో.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కలుపుకుపోవడం కూడా అంతే ముఖ్యం. ప్రత్యర్థి పార్టీ నేతలను రాజకీయంగా కట్టడి చేయడం మాత్రమే నాయకత్వం కాదు.. సొంత పార్టీని బలోపేతం చేయడం కూడా అంతే అవసరం.

చంద్రబాబు సొంత జిల్లాలోనే కొన్ని స్థానాల్లో ఎదురైన ఈ రాజకీయ పరిణామాలు.. టీడీపీ అధిష్టానానికి ఒక అలర్ట్ సిగ్నల్‌గా మారాయా..? ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత నివేదికలు సిద్ధమవుతున్నాయా..? రాబోయే రోజుల్లో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు పడతాయా..? అన్నది వేచి చూడాలి. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ రాజకీయాల్లో సమయం ఉందని నిర్లక్ష్యం చేస్తే.. ఆ తర్వాత నష్టాన్ని పూడ్చుకోవడం అంత సులువు కాదు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశాన్ని కూటమి నేతలు ఎంత సీరియస్‌గా తీసుకుంటారన్నదే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో అసలు ప్రశ్న.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్