Off The Record: చిత్తూరులో టీడీపీ క్యాడర్ అసంతృప్తి!

Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చినా కీలక శాఖలు, టీటీడీ, పోలీస్ వర్గాల్లో వైకాపా సానుభూతిపరుల హవా కొనసాగుతుందంటూ టిడిపి కేడర్ ఆగ్రహం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 11:51 AM IST
Off The Record
X

Off The Record: చిత్తూరులో టీడీపీ క్యాడర్ అసంతృప్తి!

Off The Record: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి రెండేళ్లు దాటింది. అయినా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విచిత్రమైన పాలిట్రిక్స్ నడుస్తున్నాయట. జిల్లాలో అతి ముఖ్యమైన టిటిడి నుంచి పోలీస్ శాఖలో సైతం వైసీపీ సానుభూతిపరులు కీలక పాత్ర పోషిస్తున్నారని టిడిపి కేడర్ అగ్గిమీద గుగ్గిలం అవుతోందట.

వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులకు పీఏలుగా పనిచేసినవారే.. కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతూ చక్రం తిప్పుతున్నారట. పీఆర్వోగా కూడా పాతవారే కొనసాగుతున్న పరిస్థితి నెలకొందట. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో చీమ చిటుక్కుమన్నా వైసీపీ నేతలకు క్షణాల్లో తెలిసిపోతోందట.

టిటిడిలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందట. టీటీడీ చైర్మన్ వర్సెస్ ఉన్నతాధికారుల మద్య జరుగుతున్న కోల్డ్ వార్‌తో వైసీపీ నాయకులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారట. టీటీడీ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఉన్న ఒకరు తన అనుచరులు, స్నేహితులు, సొంత కమ్యూనిటీని మొత్తం టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరటీలో నియమించారట. దీనికితోడు నిరంతరం ఉన్నతాధికారులకు పితూరీలు చెబుతూ పబ్బం గడుపుతున్నాడట.

పైగా బదిలీలు జరగకపోవడంతో తిరుమల ప్రధానాలయంతోపాటు వివిధ కీలక విభాగాలలో వైసీపీ సానుభూతిపరులు యధావిధిగా కొనసాగుతున్నారట. అంతేకాక అసలు అధికార టిడిపి శ్రేణులను పురుగుల్లా చూస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. దీంతోపాటు టిటిడిలో జరిగే ప్రతి వ్యవహారాన్నీ వైసీపీ నేతలకు ముందుగా లీకులు ఇస్తున్నారని టాక్.

తిరుపతి పోలీస్ శాఖలో సైతం ఇదే పరిస్థితి ఉందట. స్టేషన్ రైటర్లుగా గతంలో పనిచేసినవారే ఆరేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా కీలక సమాచారాన్ని ముందుగా వైసీపీ నేతలకు చేరవేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్ఐల కంటే రైటర్ల దందా ఎక్కువుగా ఉందని సమాచారం. అయినా కొత్తగా వచ్చిన ఎస్ఐలు ఏమీ చెప్పలేక పోతున్నారట.

కేసు రిజిస్టరైన వెంటనే సమాచారం తెలిసిపోవడంతో వైసీపీ నేతలు కూడా ముందస్తుగా బెయిల్ దరఖాస్తు చేయడంతోపాటు అజ్ణాతంలోకి వెళ్తున్నారట. బెయిల్ వచ్చిన తర్వాతే బయటకు వస్తున్నారట. ఈలోగా తమ దందాలకు ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నారట. సీఐ స్థాయి అధికారులు కూడా గోడ మీదా పిల్లి వాటంలా వ్యవహారిస్తున్నారని క్షేత్రస్థాయి కూటమి నేతల్లో ప్రచారం జరుగుతోంది.

మరో కీలకమైన డ్వామాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పనిచేస్తున్న వారంతా పెద్ద ఎత్తున ప్రజా ధనం లూటీ చేస్తున్నప్పటికి కనీసం వారిపై చర్యలు తీసుకునేవారు లేరన్న విమర్శలు ఉన్నాయి. పైగా కనీసం డ్వామా అనే ఓ శాఖ ఉంది అని కూడా సమాచారం లేదట. అదే విధంగా రెవెన్యూలోనూ అధికారుల దందా యథేచ్ఛగా నడుస్తోందంటున్నారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలోకి నేరుగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలు వెళ్ళి దందాలు చేస్తున్నారట.

ఇక ఎమ్మెల్యే పీఏలుగా ఉన్నవారంతా గతంలో వైసీపీ నేతల వద్ద పనిచేసిన వారే కావడం విశేషం. తిరుపతి ఎమ్మెల్యే పీఏ గతంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష‌ వైసీపీలో ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేసారు. ఆదిమూలం ప్రస్తుత పీఏ.. గతంలో మాజీ మంత్రి రోజా దగ్గర పీఏగా పనిచేసారు. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పీఏ.. గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు ఉన్నప్పుడు ఆయనకు పీఏగా పనిచేసి వైసీపీ నేత విజయానందరెడ్డికి కోవర్టుగా పనిచేసారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక పూతలపట్టు ఎమ్మెల్యే పీఏ కూడా గతంలో వైసీపీ ముఖ్య ప్రజా ప్రతినిధి దగ్గర పనిచేసారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పీఏగా పనిచేసిన వ్యక్తి జిల్లాలో ఓ కీలక నేత వద్ద పీఏగా ఉన్నారు. తిరుపతి నగర పాలక సంస్థలో గత వైసీపీ హాయంలో పీఏలుగా నియమితులైన వ్యక్తులు ఇప్పటికీ తమ హవాను నడిపిస్తున్నారట. తిరుమలలో ధర్మారెడ్డికి ఆంతరంగికులుగా కొనసాగిన వారికి ఇప్పుడు పెద్దపీట వేశారని అంటున్నారు. మొత్తం మీదా అసలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నడుస్తోంది కూటమి ప్రభుత్వమా లేక వైసీపీ ప్రభుత్వమా అన్న సందేహం టీడీపీ కేడర్‌లో జోరుగా వినిపిస్తోందట. ప్రభుత్వం మారినా.. పాత నాయకుల అనుయాయులను కొనసాగించటమేంటన్న ప్రశ్న రీసౌండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం భవిష్యత్‌లో ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story