Off The Record: కూటమి సర్కార్‌ను భయపెడుతున్న లీక్స్.. ఎవరి అస్త్రం ఉంది
Off The Record: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు లీక్ కావడంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Off The Record: కూటమి సర్కార్‌ను భయపెడుతున్న లీక్స్.. ఎవరి అస్త్రం ఉంది
Off The Record: లీకులు. ఏపీలోని కూటమి సర్కార్‌కు పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేయాలి అనుకుంటున్న విధానాలు, చివరికి మంత్రి వర్గంలో చర్చించే ఎజెండా అంశాలు సైతం.. ఇట్టే లీకు అవుతున్నాయి. మొదట్లో ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు పెద్దగా పట్టించుకోకపోవటంతో లీకు వీరులు ఇంకాస్త అడ్వాంటేజ్ తీసుకుంటున్నారట. ఇప్పుడు ఏకంగా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలను కూడా మార్కెట్ లో పెట్టేస్తున్నారు. దీంతో పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన సీఎం చంద్రబాబు.. అ లీకులపైన కాస్త ఘాటుగానే కేబినెట్ భేటీలో మందలించారట. కేవలం మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే తెలిసే అంశాలు, విధానాలు ఇట్టే మీడియా వరకు వెళ్లిపోవటం, సోషల్ మీడియాలో ముందే వైరల్ కావటంపైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఎవరు, ఏం ప్రయోజనం ఆశించి ఈ లీకులు ఇస్తున్నారు అన్నదే ఇప్పుడు పెద్ద టాపిక్ అయింది. చివరికి మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అంశాల ఎజెండా కూడా లీకు అవటంపై అనేక అనుమానాలు మొదలు అయ్యాయి. విషయం చిన్నది కాదు.. అత్యంత గోప్యంగా వుండాల్సిన అంశాలు సోషల్ మీడియా వరకు ఇట్టే వెళ్లిపోతుండటం వెనుక ఎవరు వున్నారు? ఇదే ఇప్పుడు తేలాల్సి వుంది. ఇక ఈ లీకులపై సీఎం చంద్రబాబు మంత్రులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.. ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ కు సంబందించిన సమాచారం లీకు నేపథ్యంలో ఏకంగా మంత్రి వర్గాన్ని ఎన్టీఆర్ రద్దు చేసిన విషయం ఇక్కడ సీఎం చంద్రబాబు తన మంత్రులకు గుర్తు చేశారంటే లీకులను ఆయన ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధం అవుతోందని పలువురు అంటున్నారు. మంత్రివర్గ గోప్యతను కాపాడటంలో విఫలమైతే ఇక కేబినెట్ ఉండి ప్రయోజనం ఏమిటి అని ఆయన మంత్రులను నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాలు అధికారికంగా వెల్లడించే లోపే బయటకు పొక్కడం పాలనా పటిమకు సవాల్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు ఎంతో కసరత్తు, లోతైన ఆలోచనలు చేస్తుంది. వాటిని ప్రజల ముందు పెట్టే వరకు కాన్ఫిడెన్స్‌గా ఉంచుతుంది. కానీ ఇలాంటివి ముందే లీకు అయితే సమస్యలు వచ్చి పడతాయి. శాఖాపరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆ శాఖకు చెందిన కార్యదర్శికి మాత్రమే తెలుస్తాయి. ఇలాంటి అంశాలు వీరు లీకు చేసే అవకాశం ఉండదని, ఇక విషయం పసిగట్టి లీకు చేసే వారు కింది స్థాయి ఉద్యోగులు అయి ఉండవచ్చునని మేధావులు అంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది..? అనే విషయాలు తెలుసుకుని బయటకు లీకు చేసే బ్యాచ్ లు కొన్ని ఉంటాయని, ఇలాంటి వారిని అధికారులు గమనించకపోవటం వల్ల సమాచారం లీకై ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చి పెట్టే పరిస్థితి వచ్చిందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలే సోషల్ మీడియా యుగం. కీలకమైన సమాచారం లీకైతే నిమిషాల్లో నెట్‌లో చక్కర్లు కొడుతుండటం సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
మంత్రులు చెప్పకుండా, ఉన్నతాధికారులు నోరు విప్పకుండా ప్రభుత్వ సమాచారం ఎలా బయటకు వస్తోందనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. కొందరికి మాత్రమే తెలియాల్సిన ముఖ్య విషయాలు ఇప్పుడు పబ్లిక్ వరకు వెళ్లిపోవటం చిన్న విషయం ఏమాత్రం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనిపై లోతుగా విచారణ కూడా జరిపించాలని వారు ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. ఇక కూటమిలోని కొందరికి.. ఏ విషయం గోప్యంగా ఉంచాలో తెలియక చేస్తున్న కామెంట్స్ వల్ల కూడా లీకులు జరుగుతున్నట్లు అనుమానం వుందనే వాదనలు వున్నాయి. నిజానికి కింది స్థాయిలో వుండే ప్రభుత్వ సిబ్బంది నుంచి ఎక్కువగా సమాచారం లీకులు ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు... ఇక ముందు కూడా ఇలాంటి లీకులు ఎన్నో వుంటాయని వారు చెప్పేస్తున్నారు. పాలనలో సీఎం చంద్రబాబుకు ఓ ప్రత్యేక గుర్తింపు వుంది. ఆయన తొందర పడి ఏ మాట అనరు... ముఖ్యంగా మంత్రుల విషయంలో ఎప్పుడు నోరు జారరు. అలాంటి నేత లీకులపైన మంత్రులను నేరుగా హెచ్చరించారు అంటే సమాచారం ఇక్కడి నుంచే బయటకు పాస్ ఆన్ అవుతున్నట్లు ఆయనకు ఖచ్చితంగా సమాచారం ఉండి ఉంటుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రులు అత్యంత జాగ్రత్తగా ఉండక తప్పదు. కావాలని విషయాన్ని బయటకు పొక్కేలా చేసినా లేక అనుకోకుండా జరిగినా ఇకపై మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండాల్సిందే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇప్పటి వరకు ఒకెత్తు, ఇప్పుడు మరో ఎత్తు. సీఎం చంద్రబాబు ఏ విషయాన్ని అంత తేలికగా వదిలి వేయరు. సదరు లీకు వీరులకు చంద్రబాబు ఓ అవకాశం ఇచ్చారని, నెక్స్ట్ కఠిన చర్యలు తప్పవనే సాంకేతాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. లీకులపై చంద్రబాబు ప్రస్తావన తెచ్చినప్పుడే కొందరిలో వణుకు మొదలైందని, ఇది అమాత్యుల స్థాయిలో జరిగినా లేక అధికారుల స్థాయిలో బహిర్గతమైనా ఇకపై జాగ్రత్తగా ఉండక తప్పదని అంటున్నారు. వేటికైన ఆశ పడి.. ప్రతిపక్షాల వలలో పడితే.. ఏరికోరి సమస్య కొనితెచ్చుకున్నవాళ్లు అవుతారని చెబుతున్నారు.




