OFF The Record: సుష్మిత తిరుగుబాటుతో రేవంత్‌కు కొత్త తలనొప్పి..
OFF The Record: జగ్గారెడ్డి భవిష్యత్తుపై రేవంత్ క్లారిటీ ఇవ్వగా, పరకాల సీటుపై కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపాయి.
OFF The Record: సుష్మిత తిరుగుబాటుతో రేవంత్‌కు కొత్త తలనొప్పి..
OFF The Record: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. మరో రెండున్నరేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.
ఎన్నికల హామీలు అమలు చేస్తూ.. జనాలను మెప్పిస్తే మరోమారు అవకాశం ఇస్తారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన ఆరు గ్యారంటీలు 100 రోజుల్లోపు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ప్రతీ సందర్భంలోనూ విరుచుకుపడుతున్నాయి.
విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టయిల్‌లో కౌంటర్ ఎటాక్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలా మార్చుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
ఈ మధ్య పంద్రాగస్ట్ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సస్పెన్స్‌కు తెర దించడం సంచలనంగా మారింది.
జగ్గారెడ్డి పోటీ చేయాలనుకున్నా.. వద్దనుకున్నా.. అది ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాల్లో కీలక పరిణామాలకు, సరికొత్త చర్చకు దారితీశాయట.
జగ్గారెడ్డిని రాజకీయ సన్యాసం వైపు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా, భవిష్యత్తులో ఆయనకు ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి దక్కేలా అధిష్ఠానం వద్ద లైన్ క్లియర్ చేశారన్న వాదన కూడా బలంగానే వినిపించింది. ఆ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య 30 ఏళ్ల స్నేహ బంధం బలంగా ఉందనే సందేశాన్ని కేడర్‌కు పంపించినట్టు అయ్యిందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వినిపించింది.
ఇటీవల పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించండి అంటూ సీఎం రేవంత్ కోరడం.. అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోందట. వాస్తవానికి రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి మంత్రి కొండ సురేఖ, కొండ మురళి దంపతుల కూతురు సుష్మితా పటేల్ పోటీ చేయాలనుకున్నారట.
ఇందులో భాగంగా పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ ప్రచారం కూడా బలంగానే వినిపిస్తోంది. అవకాశం చిక్కినప్పుడల్లా పరకాలలోనే మకాం వేస్తూ కేడర్‌ను బలోపేతం చేసుకుంటున్నారట సుష్మిత. గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించినప్పటికీ.. భవిష్యత్‌లో చూద్దాం లే అని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భరోసా ఇచ్చారట.
దీంతో సుష్మితా పటేల్ పరకాల సీటుపై ఆశలు పెట్టుకున్నారట. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే రేవూరి పేరు ప్రస్తావించడాన్ని సుష్మిత జీర్ణించుకోలేకపోయారట. తనకు ఛాన్స్ ఇస్తానని చెప్పి.. మళ్లీ రేవూరి పేరు ఎలా ప్రకటిస్తారంటూ ఆమె శివాలెత్తారట.
వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా సుష్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు..? హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఆమె తెలిపారు.
దమ్ముంటే రేవూరి ప్రకాశ్ రెడ్డితో ఇప్పుడే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని, కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తానని సవాల్ విసిరారు.
సుష్మితా పటేల్ నేరుగా ముఖ్యమంత్రిపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద కలకలం రేపింది. దీనిపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
అయితే, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. చివరకు ఈ వివాదం ఏఐసీసీ పెద్దల దగ్గరకు వెళ్లింది. అయితే జగ్గారెడ్డి టికెట్‌ను ఏఐసీసీ నిర్ణయింస్తుందని తేల్చిచెప్పిన రేవంత్ రెడ్డి.. సుష్మితా పటేల్ విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలకు కారణమైందట.
ఇలా సీఎం హోదాలో రేవంత్.. ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో రేగుతున్న అలజడికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే సీఎం దూకుడు వెనుక అసలు మతలబేంటన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జోరందుకుంది.
ఆ వేగం వెనుక ప్రధానంగా రాజకీయ ఆధిపత్యం, పార్టీపై పట్టు సాధించడం, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు దాగి ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. సొంత పార్టీలోనే సీఎంకు వ్యతిరేకంగా అసమ్మతి గళాలు వినబడుతున్న తరుణంలో.. విపక్షాలపై మరింత దూకుడుగా దాడి చేయడం ద్వారా కేడర్ దృష్టిని మళ్లించడం రేవంత్ వ్యూహంగా భావిస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు, మెట్రో విస్తరణ, స్పోర్ట్స్ సిటీపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైలేజ్ సాధించడమే రేవంత్ టార్గెట్ అన్న వాదన కూడా బలంగా వినపడుతోంది.




