Off The Record: ధాన్యం కొనకపోతే.. నీ ఇంటికి వస్తా?
Off The Record: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు.
Off The Record: ధాన్యం కొనకపోతే.. నీ ఇంటికి వస్తా?
Off The Record: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ యుద్ధానికి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్లు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, తెలంగాణ హక్కుల అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని, అవసరమైతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రైతుల తరఫున నిలవాలని, లేకుంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొమురంభీం సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కొమురంభీం సభను రాజకీయ వేదికగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎండగట్టారు. రైతుల కష్టానికి న్యాయం జరగకపోతే ఉద్యమాలు తప్పవని, తెలంగాణ రైతుల కోసం ఎంతదూరమైనా వెళ్తామని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక రాజీ పడబోనని, "ఐ డోంట్ కేర్" అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నేరుగా లక్ష్యంగా చేసుకున్న సీఎం.. తెలంగాణ రైతుల తరఫున ఢిల్లీలో పోరాడాలని సూచించారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఆయనదేనని అన్నారు. జూన్ 15లోపు రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే కిషన్ రెడ్డి ఇంటి ముందే ఆందోళన చేపడతానని హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందనే వాదనలు ఉన్నాయి. అదే సమయంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి సైతం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు. దీంతో, ఆ విషయంలో తమ ప్రభుత్వం తప్పేమీ లేదని బాల్‌ను కేంద్రం పరిధిలో నెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.
అటు ధాన్యం కొనుగోళ్ల విషయంతోపాటు, తుమ్మిడిహెట్టి విషయంలో కేంద్రం వైఖరిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు సమాధానం చెప్పడంతోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎండగట్టడం ఆయన లక్ష్యం. ఇలా రెండు రకాల లక్ష్యాలను నెరవేర్చేందుకే కేంద్రంపై సీఎం రేవంత్.. బాణాలు వేశారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.




