Burning Topic: కేరళలో చరిత సృష్టించిన కాంగ్రెస్

Burning Topic: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (UDF) కూటమి ఘనవిజయం సాధించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 May 2026 7:14 AM IST
Burning Topic
X

Burning Topic: కేరళలో చరిత సృష్టించిన కాంగ్రెస్

Burning Topic: కేరళలో వరుసగా హ్యాట్రిక్ కొట్టాలనుకున్న వామపక్ష కూటమికి గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రజలు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ను గెలిపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల విజయాలతో ఉత్సహాకంగా ఉన్న యూడీఎఫ్ భారీ అధిక్యతతో విజయం సాధించింది. కేరళలో గతంలో ఐదేళ్లకోసారి అధికార మార్పిడి సాంప్రదాయం ఉండేది. అయితే 2021లో సీఎం పినరయి విజయన్ సారధ్యంలో రెండోసారి ఎల్‌డీఎఫ్ విజయం సాధించింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం మీద ఉన్న సహజ వ్యతిరేకత కూటమికి బాగా కలిసివచ్చింది. అదే సమయంలో ఎల్‌డీఎఫ్ పాలనలో పెరిగిన నిరుద్యోగం, జీవన వ్యయం పెరుగుదల, ఉద్యోగులకు జీతాల ఆలస్యం లాంటివి వ్యవతరేకతను పెంచాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసు, శబరిమల వంటి వివాదాలతో వామపక్ష ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింది.ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో యూడీఎఫ్ కూటమి విజయం సాధించింది.

కేరళలో క్రైస్తవ, ముస్లిం ఓటర్ల వర్గాలే కీలక పాత్ర పోషిస్తాయి. ముస్లింల్లో మంచి పట్టు ఉన్న ముస్లిం లీగ్ యూడీఎఫ్​ కూటమిలో ఉండడంతో బాగా కలిసివచ్చింది. రెండు ప్రధాన పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఓట్లు చీలకుండా జాగ్రత్తపడ్డారు. ఫలితంగా మెజార్టీ స్థానాల్లో యూడీఎఫ్​ విజయాన్ని సాధించిందని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో అధికార వామపక్ష కూటమికి నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తో సంబంధం ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి గ్రూపుల నుంచి వామపక్షాలు మద్దతు తీసుకోవడం కూడా అనేక విమర్శలకు తావిచ్చింది.

ఈసారి ఎన్నికల్లో బీజేపీ సైతం గట్టి ప్రభావాన్ని చూపెట్టింది. 2021 ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేకపోయిన బీజేపీ, ఈసారి ఎలాగైనా కొన్ని సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేసింది. ముఖ్యంగా 20శాతం ఓటు బ్యాంకును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడంలో బీజేపీ విజయం సాధించడం ఎల్‌డీఎఫ్‌కు కష్టం కలిగించింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుపులో మేనిఫెస్టో కీలక పాత్ర పోషించింది. సంక్షేమ హామీలతో పాటు పరిపాలన సంస్కరణలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళాశాలకు వెళ్లే బాలికలకు నెలకు రూ. 1,000 సహాయం, రూ. 3,000 సంక్షేమ పింఛను, కుటుంబానికి రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, యువ పారిశ్రామికవేత్తలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీలు ప్రజలను ఆకర్షించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రచారం కూడా కలిసివచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ అనేక పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెల్చుకోవడం అసెంబ్లీ ఎన్నికలకు ఊపిచ్చింది. అంతకుముందు జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా యూడీఎఫ్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అంతర్గత విబేధాలను పక్కకుపెట్టి అన్ని పార్టీలు సమన్వయంతో పనిచేశాయి.

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఓటమితో అర్ధ శతాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల పాలన ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయింది. ఒకప్పుడు దేశంలో బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వామపక్షాలకు కేరళ చివరి కంచుకోటగా మిగిలింది. 1977 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌ను, 1993 నుండి 2018 వరకు త్రిపురను పాలించిన కమ్యూనిస్టులు.. అక్కడ వరసగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు కేరళ చేజారడంతో 1977 తర్వాత తొలిసారిగా దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దేశ గతిని శాసించిన వామపక్షాలు ఇప్పుడ ఉనికిని కాపాడుకోవాల్సిన దయనీయ స్థితికి చేరాయి. చేరుకున్నాయి. ప్రస్తుతం బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల నుండి వామపక్షాలకు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే ఉండటం వారి రాజకీయ పతనానికి అద్దం పడుతోంది.

కేరళలో యూడీఎఫ్ కూటమి విజయంతో కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడైన కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. 2001 నుండి పరవూర్ నియోజకవర్గం నుండి వరుసగా గెలుస్తున్న ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. కేరళ కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడైన రమేష్ చెన్నితల పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారన్న ప్రశ్నకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చాలా ఆసక్తికరమైన రీతిలో బదులిచ్చారు. ‘నిజం చెప్పాలంటే ఆ విషయంపై నాకు ఎలాంటి క్లూ లేదు. మా పార్టీలో సీఎం ఎంపికకు ఒక పద్ధతి ఉంది. ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. మా వద్ద సమర్థులైన నేతలు చాలా మంది ఉండటం పార్టీకి శుభపరిణామం’అని థరూర్‌ అన్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story