Off The Record: కొత్త నామినేటెడ్ పదవులు సీనియర్లకా.. జూనియర్లకా ?

Off The Record: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేటెడ్, PACS పదవుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఆశావহులు. పీసీసీ చీఫ్ హామీపై సర్వత్ర ఆసక్తి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Oct 2026 10:49 AM IST
Off The Record
X

Off The Record: కొత్త నామినేటెడ్ పదవులు సీనియర్లకా.. జూనియర్లకా ?

Off The Record: ప్రభుత్వ పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పదేళ్ల కాలంపాటు అధికారానికి దూరంగా ఉండి.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా కీలకమైన నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది.

ఇప్పటికే ఎంతో విలువైన కాలాన్ని వృధా చేస్తున్నామన్న భావన పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 141 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల భర్తీ కోసం సుదీర్ఘకాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల దవీకాలం పూర్తయి ఏడాదిన్నర కాలం గడిచింది. 2020 ఫిబ్రవరి 13న PACS చైర్మన్‌లకు ఎన్నికలు నిర్వహించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక PACS చైర్మన్‌ల భర్తీని ఎన్నికలతో కాకుండా నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలని భావించినప్పటి కోర్టు తీర్పుతో ఆ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ఫలితంగా PACS చైర్మన్‌ల పదవుల కోసం నెలల తరబడి కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తామని చెబుతుండడంతో ఆశావహులు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్‌ల పదవీకాలం పూర్తయి రెండు నెలలు గడిచింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్‌గా మానాల మోహన్ రెడ్డి, ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వీరవత్రి అనిల్ కుమార్, విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అన్వేష్ రెడ్డి, వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసిన కాసుల బాలరాజు పదవీకాలం ముగిసింది.

వీరిలో మళ్లీ ఎవరెవరికి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈసారి ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన వారిలో ఒకరిద్దరికీ మళ్లీ అవకాశం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది.

అలాగే కొత్తవారికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవుల్లో అవకాశం దక్కుతుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా పార్టీ కోసమే పని చేస్తున్న సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతను ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరుతున్నారు. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన నాయకుల కన్నా కష్టకాలంలో పార్టీ కోసం సేవలందించిన వారిని గుర్తించాలన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులకు నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పదవులను ఆశిస్తున్న వారిలో ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు మారాజ్ చంద్రమోహన్ రెడ్డి, ICDMS మాజీ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు.

అయితే నామినేటెడ్ పదవులు భర్తీ కోసం పార్టీ నేతలు దీర్ఘకాలంగా వేచి చూస్తున్నారు. ప్రభుత్వ పదవుల భర్తీలో 60 శాతంపైగా పార్టీలోని సీనియర్ నాయకులకే కేటాయించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మండల స్థాయిలో పార్టీ అధ్యక్షులుగా, కార్యదర్శులుగా కీలకంగా పనిచేసిన సీనియర్లకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పిసిసి చీఫ్ భరోసా ఇచ్చారు.

ఇప్పటికే PACSల భారీగా జాబితాను సిద్ధం చేసేందుకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి రసరత్తు చేస్తున్నారట. ఒక్కో పదవికి ఇద్దరు చొప్పున ఆశావహుల జాబితాను పిసిసికి పంపినట్లు సమాచారం. అయితే పదవుల కేటాయింపు ప్రక్రియలో జాప్యంతో ఆశావహుల్లో కొంత నిరాశ ఏర్పడుతోంది.

అయితే ఇప్పటికైనా నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు ఈసారైనా అవకాశం దక్కుతుందా..? ఒక్కసారైనా తమకు రాకపోతుందా..? అంటూ వారు ఎదురుచూస్తున్నారు. మరి. పీసీసీ చీఫ్ హామీ ఇచ్చినట్టు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ లక్కీ నాయకులెవరో.. త్వరలో తేలనుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్