Off The Record: నామినేటెడ్ పదవులకు అడ్డు పడుతుంది ఎవరు?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతోంది? పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధాన కారణమా?
Off The Record: నామినేటెడ్ పదవులకు అడ్డు పడుతుంది ఎవరు?
Off The Record: కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల భర్తీపై ఎంత కసరత్తు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. రేపో మాపో పదవుల భర్తీ ఉంటుందన్న ప్రతిసారీ ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికీ పదిసార్లు డెడ్ లైన్ విధించినా పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. ఆ మధ్య ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ వచ్చి పదవులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించినా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహ నాయకులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు. కష్టపడిన వారికి ప్రభుత్వంలో పదవీ యోగ్యం ఉంటుందని ఆశించిన నేతలకు,,ఇప్పుడు సుదీర్ఘ కాలంగా ఎదురుచూపులు తప్పడం లేదు. సొంత పార్టీ నేతలను, ప్రభుత్వ పెద్దలను ఏం అనలేక అసహనంతో గడపడం తప్ప నేతలు ఏం చేయలేకపోతున్నారు.
త్వరలోనే ప్రభుత్వ పదవులను, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సైతం భావిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం ఆశావాహుల లిస్ట్ తెప్పించుకొని సామాజిక సమీకరణలు, పార్టీకి నేతలు చేసిన సేవ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ పదవికి ఎవరు సరిపోతారో లెక్కలు వేసుకొని మరీ జాబితాను సిద్ధం చేశారు. యువకులకు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వాలని హస్తం నేతలు భావించారు. ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టులు రాని వారికి,, పార్టీ కమిటీల్లో బాధ్యతలు ఇవ్వాలని పార్టీ ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ సైతం సూచించారు. కానీ అది ఎటూ తేలడం లేదు. పదవుల భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూనే వస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు దాదాపు 40 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించింది. మిగతా పోస్టులను భర్తీ చేసేందుకు అనేక సార్లు కసరత్తు పూర్తి చేసి జాబితా కూడా సిద్ధం చేసింది. కార్పోరేషన్ చైర్మన్లు, కుల సంఘాల కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ ప్రభుత్వ సంస్థల డైరెక్టర్లు, మెంబర్లు లాంటి అన్ని పోస్టులను లెక్కిస్తే దాదాపు వెయ్యి మందికి అవకాశం ఇవ్వొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్యాబినెట్ హోదాతో కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అందుకోసం కసరత్తు చేసి తుది జాబితా సైతం సిద్ధం చేశారు.
పదవులు భర్తీ చేసేందుకు ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ నేతలే అని తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి పదవి ఆశించిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామంటే వాళ్లు మంత్రి అయితేనే తీసుకుంటామని తేల్చి చెప్పడంతో కొన్ని పదవులు భర్తీ చేయకుండా ఆపేశారు. ఇక పార్టీలో కీలకంగా ఉన్న పలువురు యువ నేతలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామంటే తమకి ఎమ్మెల్సీ కావాలని పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇక కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. పదవుల కోసం ఎమ్మెల్యే ఒక పేరు ప్రపోజ్ చేస్తే, మంత్రి మరో పేరును ప్రతిపాదిస్తున్నారట. డీసీసీ అధ్యక్షుడు సైతం మరో వ్యక్తిని బలపరచడంతో ఏకాభిప్రాయానికి రావడం లేదని సమాచారం. ఇక మహిళలు, యువకులు, సామాజిక సమీకరణలు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని పదవులను భర్తీ చేయడం కాంగ్రెస్ పెద్దలకు తలకు మించిన భారంగా మారుతున్నట్లు సమాచారం.
ఒకవేళ ప్రభుత్వంలోని వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల ఖాళీలను భర్తీ చేస్తే.. అందులో పదవి దక్కకుండా భంగపడిన వారి నుండి తీవ్ర వ్యతిరేకత తప్పదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు సైతం పదవుల భర్తీ విషయంలో పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. తమ అనుచరులకు, తమ మనుషులకు పదవులు ఇప్పించుకోవాలని రాష్ట్ర పెద్దల వద్ద తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో పదవుల భర్తీ చివరి వరకు వచ్చి ఆగిపోతుందని హస్తం నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి అయిందని,, ఇంకెప్పుడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని, ఇలా అయితే వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలని, ప్రజల్లోకి ఎలా వెళ్లాలని అసహనం వ్యక్తం చేస్తున్నారట.
గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి పని తనం కనబర్చిన వారిని పార్టీ గుర్తిస్తుందని, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ సాగకపోవడం, అదిగో ఇదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో.. ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూపని ఆశావహులు తలలు బాదుకుంటున్నారట. మరి ఈసారైనా ఇచ్చిన డెడ్ లైన్ లోపు పదవులు భర్తీ చేస్తారో లేదో చూడాలి.




