Off The Record: ఎమ్మెల్సీ టిక్కెట్లు దక్కేది ఎవరికి ?
Off The Record: తెలంగాణలో త్వరలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ. పట్టభద్రులు, గవర్నర్ కోటా పోరుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన ఆశావహుల సందడి.
Off The Record: ఎమ్మెల్సీ టిక్కెట్లు దక్కేది ఎవరికి ?
Off The Record: రాజకీయ నేతలకు చట్టసభల్లో అడుగుపెట్టడం ఓ కీలక మైలురాయి. ఇప్పుడు అదే అవకాశం తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతల ముందుకు వచ్చింది. త్వరలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో.. అధికార పార్టీలో ఆశావహుల సందడి మొదలైంది.
ఇందులో రెండు పట్టభద్రుల స్థానాలు కాగా.. మరో మూడు గవర్నర్ కోటా స్థానాలు. పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో టికెట్ కోసం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
ఇక గవర్నర్ కోటా స్థానాలకు ఎలాంటి ప్రత్యక్ష ఎన్నిక ఉండకపోవడంతో.. ప్రభుత్వం సిఫార్సు చేసే పేర్లపైనే అందరి దృష్టి నెలకొంది. దీంతో.. ఐదు స్థానాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో పదుల సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు.
ఫలితంగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంపై కాంగ్రెస్‌లో గట్టి పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గౌరీ సతీష్, హర్షవర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తదితరుల పేర్లు ఆశావహుల జాబితాలో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి ప్రభావం చూపిన నేతలు కూడా ఈసారి కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గౌరీ సతీష్ పేరు గత ఎన్నికల అధికారిక అభ్యర్థుల జాబితాలోనూ కనిపిస్తుంది. బీసీ సామాజిక సమీకరణాలు.. గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలు.. పార్టీతో ఉన్న అనుబంధం.. గెలుపు అవకాశాలు..
ఇలా అనేక అంశాలను కాంగ్రెస్ అధిష్టానం బేరీజు వేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇక నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ పోటీ రసవత్తరంగా మారింది.
గుత్తా అమిత్ రెడ్డి, పున్న కైలాష్ నేత, చనగాని దయాకర్, పీవీ శ్రీనివాస్‌తోపాటు పలువురు నేతల పేర్లు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్డి, బీసీ సామాజిక సమీకరణాలపైనా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.
ఒక స్థానాన్ని ఓసీకి.. మరో స్థానాన్ని బీసీకి ఇవ్వాలనే సమీకరణం తెరపైకి వస్తే.. ఎవరికి లాభం చేకూరుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి.
జనసేన ఇప్పటికే డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కూడా ఇప్పుడు మరింత ఉత్కంఠ నెలకొంది.
ఇక గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న మూడు స్థానాలు అసలు హాట్ టాపిక్‌గా మారాయి. నవంబర్‌లో గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ మూడు స్థానాల భర్తీపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది.
గవర్నర్ కోటా కావడంతో.. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు.. గతంలో అవకాశం దక్కని ఆశావహులు.. అందరూ ఈ పదవులపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయోధ్యరెడ్డి.. సత్తు మల్లేశ్.. బస్వరాజు సారయ్య పేర్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు.. పార్టీ సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వాలా.. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలా.. లేక సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ముఖాలను ఎంపిక చేయాలా.. అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి మరో కీలక పరీక్షగా మారింది.
మొత్తమ్మీదా.. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు. కానీ ఆశావహుల జాబితా మాత్రం భారీగానే ఉంది. పట్టభద్రుల స్థానాల్లో గెలుపు కోసం పార్టీ బలాన్ని నమ్ముకుంటున్న నేతలు, గవర్నర్ కోటాలో నామినేషన్ కోసం అధిష్టానం దయ కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు,
ఇక సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీకి చేసిన సేవలు, గెలుపు అవకాశాలు, ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
అందుకే.. ఐదు స్థానాల్లో ఎవరికి బెర్త్ దక్కుతుంది..? ఎవరికి నిరాశ ఎదురుకానుంది..? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.




