BIG STORY: కాంగ్రెస్-ఎస్పీ సీట్ల పంచాయితీ..కొలిక్కిరాని చర్చలు!
BIG STORY: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
BIG STORY: కాంగ్రెస్-ఎస్పీ సీట్ల పంచాయితీ..కొలిక్కిరాని చర్చలు!
BIG STORY: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు బిజీ అయ్యాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి రెండు రోజుల పాటు ఈ చర్చలు జరిగాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో అట్టహాసంగా ఈ చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. దీంతో మరో రెండు మూడు దఫాలు చర్చలు జరపాలని రెండు పార్టీల అధినేతలు డిసైడ్ అయ్యారు.
కాగా రెండు పార్టీల నుంచి నలుగురు చొప్పున కీలక నాయకులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి యూపీ ఇంఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, పీసీసీ చీఫ్ ఆరాధనా మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్, శాసనసభా పక్షనేత వీరేంద్ర చౌదరి పాల్గొన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్, యూపీ అధ్యక్షుడు శ్యామ్లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్ర హాసన్లు పాల్గొన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే తమకు 130 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్ కు అంత సీన్ లేదంటున్నారు సమాజ్ వాదీ పార్టీ నేతలు.కాగా 2022 అసెంబ్లీ ఎన్ని్కల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లలోనే విజయం సాధించింది. దీంతో సదరు రెండు సీట్లకు మరో 24 సీట్లు కలుపుకుని మొత్తం 26 సీట్లు ఇస్తామని సమాజ్ వాదీ పార్టీ కుండబద్దలు కొట్టింది.
ఇదే విషయాన్ని తాము ఇటీవలి చర్చల్లో కాంగ్రెస్ నేతలకు వెల్లడించినట్లు సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ తెలియచేశారు. అయితే 26 సీట్లు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. దీంతో సీట్ల సర్దుబాటు పై జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
వాస్తవానికి ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు బలం లేదు. సమాజ్ వాదీ పార్టీకి జూనియర్ పార్టనర్ గానే కాంగ్రెస్ వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పొలిటికల్ గ్రాఫ్ పెరిగిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కోసం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఆ తరువాత సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు ఆయన నాయకత్వం వహించారు. ఇందులో భాగంగా నవంబరు ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. కాగా ఇందులో రాహుల్ గాంధీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ నేపథ్యంలో రాహుల్ పరపతి పెరిగిందనీ, ఫలితంగా తమకు 130 సీట్లు కేటాయించాలన్నది కాంగ్రెస్ వర్గాల వాదనగా ఉంది.
అయితే గెలుపు అవకాశాల ఆధారంగానే కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ఉంటుందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుండబద్దలు కొట్టారు.2022 ఎన్ని్కల్లో రెండు సీట్లకే పరిమితమైన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరచిపోకూడదన్నారు.
అలాగే 26 సీట్లతో పాటు గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించి సదరు సమాచారం తమకు తెలియచేయాలని కాంగ్రెస్ నాయకులకు అఖిలేష్ యాదవ్ సూచించారు.ఇదిలా ఉంటే రెండో దఫా చర్చలు ముగిసిన వెంటనే ఐదు అసెంబ్లీ సీట్లకు సమాజ్ వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది.
కాగా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు తమకు చావో రేవో లాంటివన్నారు సమాజ్ వాదీ పార్టీ నాయకులు. యూపీలో కాంగ్రెస్కు స్థిరమైన ఓటు బ్యాంకు లేదన్నారు. సీట్ల విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకులకు ఎస్పీ నేతలు సూచించారు. అంతేకాదు ఎక్కువ సీట్ల కోసం కాంగ్రెస్ పట్టుబట్టరాదని సమాజ్వాదీ పార్టీ నేతలు కుండబద్దలు కొట్టారు.




