Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దల మధ్య ఎమ్మెల్సీ ఫైట్!

Off The Record: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా నేతల ఎంపికపై ఉత్కంఠ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Oct 2026 8:03 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దల మధ్య ఎమ్మెల్సీ ఫైట్!

Off The Record: ఈసారి అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రకటించిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంతో.. సహజంగానే ఇతర వర్గాల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైంది. దీనిని బ్యాలెన్స్ చేసేందుకు పీసీసీ చీఫ్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి గవర్నర్ కోటాలోని 3 స్థానాలను స్పష్టంగా మూడు విభిన్న సామాజిక వర్గాలకు కేటాయించాలని ఫైనల్ అయ్యారట. ఒకటి మాదిగ సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజిక వర్గానికి, ఇంకొకటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించనున్నారట. శాసనమండలిలో ఇప్పటివరకు మాదిగ సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లభించలేదనే విమర్శలు ఉన్నాయి. దాంతో ఈసారి మాదిగ సామాజిక వర్గంపై కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేటగిరీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, దొమ్మటి సాంబయ్యల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన సంపత్‌ కుమార్‌కు గట్టి అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక అత్యంత కీలకమైన బీసీ కోటా విషయానికి వస్తే.. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పోటీ పడుతున్నారు. వీరితోపాటు ఇటీవల ఖమ్మం గ్రాడ్యుయేట్ సీటు ఆశించి భంగపడ్డ లోకేష్ యాదవ్ కూడా రేసులో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది! ఇటీవల సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలికి ఒక ‘పద్మశాలి బిడ్డను’పంపిస్తామని బహిరంగంగా ప్రకటించారు. సీఎం ఇచ్చిన ఈ హామీతో పద్మశాలి సామాజిక వర్గ నేతలలో ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. రేసులో ఉన్న బీసీ నేతలలో ఈరవత్రి అనిల్ కుమార్, పున్న కైలాష్ నేత ఇద్దరూ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారే. సీఎం హామీ అమలు జరిగితే.. వీరిద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ బెర్త్ ఖాయమని టాక్ నడుస్తోంది.

ఇక మిగిలిన స్థానం కోసం, అలాగే పదవుల కోసం ఇతర సీనియర్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు వేగవంతం చేశారు. గవర్నర్ కోటాలో పదవీకాలం ముగుస్తున్న బస్వరాజు సారయ్య మరొకసారి తన స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మైనారిటీ కోటా కింద మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఎమ్మెల్సీ రేసులో ముందంజలో ఉండేందుకు గాంధీ భవన్, ఢిల్లీ స్థాయిల్లో చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నహర్కర వేణుగోపాల్, ఆర్టీఐ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బోరెడ్డి అయోధ్య రెడ్డి కూడా తమదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ విధంగా ప్రతి సామాజిక వర్గం నుంచి హేమాహేమీలు రంగంలోకి దిగడంతో పీసీసీ నాయకత్వానికి అభ్యర్థుల ఎంపిక ఒక పెద్ద కత్తిమీద సాములా మారింది.

గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నామినేషన్ల సమయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు, వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సర్వీస్, సమాజిక సేవ, కళలు లేదా సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన అర్హతలను పరిగణనలోకి తీసుకుంటూనే, సాంకేతిక లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలోలాగా కేవలం ‘ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తే పదవి దక్కుతుంది’ అనుకుంటే పొరపాటేనంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన పేర్లకే అధిష్ఠానం పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. దీంతో ఆశావహులందరూ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తూనే.. ఎవరిలోనూ అసంతృప్తి రాకుండా చూడటం కాంగ్రెస్ పెద్దలకు సవాలుగా మారింది.

గ్రాడ్యుయేట్ సీట్ల కేటాయింపు తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక తెలంగాణ రాజకీయంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చే సీటు‌పై స్పష్టత ఉన్నప్పటికీ.. మిగిలిన రెండు స్థానాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? సిరిసిల్ల వేదికగా పద్మశాలీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా..? మైనారిటీ, బ్రాహ్మణ లేదా బీసీ వర్గాల మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తారు..? అనేది త్వరలోనే తేలనుంది. గాంధీ భవన్ కసరత్తు పూర్తయి ఫైనల్ లిస్ట్ గవర్నర్ ముందుకు వెళ్లే వరకు ఈ ఉత్కంఠ కొనసాగక తప్పదు మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్