Off The Record: క్రెడిట్ వార్..? తగ్గేదెవరు? నెగ్గేదెవరు?

Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరప్రదాయిని ‘తుమ్మిడిహెట్టి’ ప్రాజెక్టు చుట్టూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ సమరం ముదిరింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 May 2026 7:10 AM IST
Off The Record
X

Off The Record: క్రెడిట్ వార్..? తగ్గేదెవరు? నెగ్గేదెవరు?

Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వరప్రదాయినిగా భావిస్తున్న తుమ్మిడిహెట్టి, ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టు మరోసారి రాజకీయ హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉందని చెబుతుండగా.. అనుమతుల విషయంలో మహారాష్ట్ర సర్కార్ కీలకంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చుట్టూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ సమరం ఎండవేడిని మించి హీటెక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తుందా..? లేక రాజకీయ లెక్కలే ముందుకు వస్తాయా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రాణహిత జలాలను వినియోగించుకుని ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు.. ఏళ్లుగా రాజకీయ హామీలకే పరిమితమవుతోంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టంగా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టు అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే అసలు చిక్కు మహారాష్ట్ర అనుమతుల దగ్గరే ఉంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అంగీకారం తెలపలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం సహకారంతో మహారాష్ట్రను ఒప్పించాలని భావిస్తోంది.

ఇక్కడే బీజేపీ పాత్ర రాజకీయంగా కీలకంగా మారింది. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడి ప్రాజెక్టుకు మార్గం సుగమం చేస్తారా..? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్మించాల్సిన ప్రాంతం సిర్పూర్ నియోజకవర్గం కావడం.. అక్కడి బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాత్రను కీలకంగా మార్చింది. ప్రాజెక్టుకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులతో కలిసి పరిశీలన కార్యక్రమాల్లో పాల్గొన్నారు హరీష్ బాబు. ఈ క్రమంలో ఆయన ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారనే చర్చ సాగుతోంది. నియోజకవర్గ ప్రజల ప్రధాన డిమాండ్‌గా మారిన తుమ్మిడిహెట్టి విషయంలో వెనక్కి తగ్గితే రాజకీయంగా నష్టం తప్పదనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story