Off The Record: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎల్‌నినో ఎఫెక్ట్!

Off The Record: గ్రేటర్ హైదరాబాద్ త్రివిధ విభజన, 400 వార్డుల పునర్విభజన కసరత్తు మరియు ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 Oct 2026 7:55 AM IST
Off The Record
X

Off The Record: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎల్‌నినో ఎఫెక్ట్!

Off The Record: తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ విషయంలో ప్రభుత్వం భారీ రీడిజైన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 200కు పెంచడమే కాకుండా, గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించారు. ఒకవైపు జీహెచ్ఎంసీ, మరోవైపు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అయితే కొత్తగా ఏర్పడిన ఈ మూడు కార్పొరేషన్లను మరింత విస్తరించి మొత్తం వార్డుల సంఖ్యను 400కు చేర్చే ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు వార్డుల పునర్విభజనపై ప్రాథమిక సూచనలు కూడా వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొత్త వార్డులు, కొత్త సమీకరణలు, కొత్త రాజకీయ లెక్కలు ఒకవైపు ఉంటే.. మరోవైపు ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో ముందడుగు వేయలేకపోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. కారణం రాజకీయ పరిస్థితులా..? ప్రజాభిప్రాయమా..? లేక ఇంకేదైనా అంశమా..?

ఈ ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రీసౌండ్ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్ నినో ఎఫెక్ట్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనా పడనుందన్న ఆందోళన నాయకులను వెంటాడుతోందట. ఎల్‌నినో ప్రభావంతో.. వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత, పంటలపై ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న అసంతృప్తి... ఇవన్నీ రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలను తారుమారు చేసే అవకాశం ఉందని నాయకులు టెన్షన్ పడుతున్నారు.

ఇదే కారణంగా కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్లు, ఎన్నికల టికెట్ల కోసం ఎదురు చూస్తున్న ఆశావహ నాయకులు కూడా "ఇప్పుడే ఎన్నికలు పెట్టొద్దు... ఇంకొన్ని నెలలు ఆగితే మంచిది" అంటూ పార్టీ పెద్దల వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

ఎందుకంటే ప్రస్తుతం ప్రజల సమస్యలు హై లెవెల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ వెళ్తే.. అభివృద్ధి కంటే సమస్యలే ఎక్కువగా వినిపించే పరిస్థితి ఉందట. దీంతో అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు నేతలు అంచనా వేస్తున్నారట. అందుకే ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని తమకు రాజకీయ ఆయుధంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయని ప్రచారం సాగుతోంది. ప్రజల అసంతృప్తిని ఓట్ల రూపంలో మలచగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చనే లెక్కలు వేస్తున్నాయట.

ఇక వాతావరణ నిపుణులు కూడా ఎల్ నినో ప్రభావం మరికొంత కాలం కొనసాగొచ్చని చెబుతున్న నేపథ్యంలో.. వర్షాకాలం తర్వాత పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటికి ప్రజల మూడ్ కూడా మారే అవకాశం ఉందని, అభివృద్ధి పనులను మరింత హైలైట్ చేసే అవకాశం ఉంటుందని అధికార పార్టీ నాయకత్వం అంచనా వేస్తోందట.

అందుకే కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే నిర్వహించడం కంటే.. వార్డుల పునర్విభజన, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి, రాజకీయంగా అనుకూల సమయం చూసుకుని ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయం బలపడుతున్నట్టు సమాచారం. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా.. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం కార్పొరేషన్ ఎన్నికలు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొందరు నాయకులు అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమై వచ్చే ఏడాది చివర్లోనే ఎన్నికల నగారా మోగవచ్చని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి.. కార్పొరేషన్ ఎన్నికలంటే ప్రత్యర్థులను కాదు.. ప్రజల మూడ్‌ను చూసి కూడా నేతలు టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎల్ నినో ఎఫెక్ట్ రాజకీయ వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుందా..? ఎన్నికలు నిజంగానే వాయిదా పడతాయా..? లేక ఒక్కసారిగా ఎన్నికల బాంబ్ పేలుతుందా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది..!


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్