Burning Topic: తినడానికి గోధుమపిండి కూడా లేక అలమటిస్తున్న పాకిస్తాన్ కాశ్మీరీ ప్రజలు

Burning Topic: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? తినడానికి తిండి, కనీస సదుపాయాలు లేక ప్రజలు ఎందుకు అలమటిస్తున్నారు?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Jun 2026 7:11 AM IST
Burning Topic
X

Burning Topic: తినడానికి గోధుమపిండి కూడా లేక అలమటిస్తున్న పాకిస్తాన్ కాశ్మీరీ ప్రజలు

Burning Topic: భారత దేశాన్ని వర్ణించేందుకు ఆసేతు హిమాచలం అనే పదం వాడతారు. దక్షిణాన సముద్రం దగ్గర మొదలై, ఉత్తరాన ఉన్న హిమాలయాల విస్తరించిన ఈ దేశం భౌగోళిక సమగ్రతను, సాంస్కృతిక ఐక్యతను సూచిస్తుంది. భారత దేశానికి కిరీటంగా ఉన్నదే జమ్మూ కశ్మీర్.. భారత్‌కు స్వాతంత్ర్యంతో పాటు పాకిస్థాన్ ఆవిర్భవించడం తెలిసిందే. ఆ సమయంలో జమ్మూ కశ్మీర్ సంస్థానం ఎటు చేరాలో త్వరగా తేల్చుకోలేకపోయింది. ఈలోగా పాకిస్థాన్ దురాక్రమణకు దిగింది. దీంతో జమ్మూ కశ్మీర్ పాలకుడు మహారాజా హరిసింగ్ 1947 అక్టోబర్ 26న సంస్థానాన్ని సంపూర్ణంగా భారత్‌లో విలీనం చేస్తూ సంతకాలు చేశారు. వెంటనే దురాక్రమణకు దిగిన పాకిస్థాన్ మూకలను తిప్పి కొట్టడానికి భారత సైన్యం రంగంలోకి దిగింది. కాగా నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమతి దృష్టికి తీసుకెళ్లడంతో యధాతథ స్థితి అమల్లోకి వచ్చింది. అప్పటికే జమ్మూ కశ్మీర్‌లోని చాలా భాగం పాకిస్థాన్ ఆక్రమణలోకి వెళ్లిపోయింది. ఇదే పాక్ ఆక్రమిత పాకిస్థాన్... పీవోకే

పీవోకేలో మీర్‌పూర్, ముజఫ్పరాబాద్, గిల్గిత్ బాల్టిస్థాన్ భాగాలు. పాకిస్థాన్ దీన్ని"ఆజాద్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌"గా పిలుస్తుంది. ఆ ప్రాంతాన్ని అధికారిక ప్రావిన్స్‌గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కశ్మీర్‌పై తమ హక్కు బలహీనపడుతుందని భావించింది. ఈ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది. 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్థాన్‌ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్థాన్‌ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్‌ అనుమతితోనే అమలవుతాయి.

మరోవైపు కశ్మీర్ మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాకిస్థాన్ అమలు చేయని కుట్రలంటూ లేవు. దశాబ్దాల పాటు తీవ్రవాదం, వేర్పాటువాదాలకు బలైంది జమ్మూ కశ్మీర్. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిస్థితులు మారిపోయాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తర్వాత క్రమంగా పరిస్థితులు కుదుట పడ్డాయి. జమ్మూ కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల కల్పన భారీగా పెరిగింది. పెద్దఎత్తున జాతీయ రహదారులు, సొరంగాలు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక మౌలిక సదుపాయాలపై కేంద్రం భారీగా పెట్టుబడులు పెడుతోంది. జెడ్-మోర్ టన్నెల్, చీనాబ్ రైల్వే బ్రిడ్జి, కొత్త హైవేలు ఇక్కడి ప్రగతికి నిదర్శనాలు. మంచు కొండలు, పచ్చని లోయల నుంచి. వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తోంది. కశ్మీర్‌లో కనిపిస్తున్న ఈ అభివృద్ధి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే పహల్గామ్ లాంటి దాడుల ద్వారా అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించింది.

మరి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఏం జరుగుతోందో చూడండి.. పీవోకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్థాన్‌ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీవోకేలో నివసించే ప్రజల కోసం కాకుండా, పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్‌కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.. పీవోకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్‌ పాకిస్థాన్‌లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. దీంతో ఆజాద్ కశ్మీర్ అనేది.. ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్‌ సృష్టించిన నామ మాత్రపు వ్యవస్థేనని స్పష్టమవుతోంది.

పాకిస్థాన్ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ ప్రాంత వనరులను దోచుకుంటూనే ఉంది. కానీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అనేవి కనిపించవు అక్కడి ప్రజలకు పేరు ఆజాదీ కశ్మీర్. కానీ అక్కడి ప్రజలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు లేవు. క్రూరమైన అణచివేత కొనసాగుతోంది. సైన్యం ఆధిపత్యం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పీవోకే ప్రజలు చాలా ఏళ్లుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. తమకు తినడానికి గోధుమ పిండి, కరెంటు సబ్సిడీ ఇవ్వాలని, రాజకీయ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ 2024, 2025లో తీవ్ర ఆందోళనలు జరిగాయి.. తాజాగా పాకిస్థాన్ సైన్యం ఈనిరసనలను అణిచివేసేందుకు జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. రావలాకోట్, ముజఫరాబాద్, మీర్పూర్ పట్టణాలు అశాంతి, అరెస్టులు, హత్యలతో అట్టుడుకుతున్నాయి. ఈ ప్రాంతంలో పాక్‌ ప్రభుత్వ ఆధిపత్యాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సరిగ్గా అదే సమయంలో భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో 'జోజిలా టన్నెల్' నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తికావడంతో సంబరాలు చేసుకున్నారు. ఆసియాలోనే అత్యంత పొడవైన ద్విముఖ సొరంగంగా ఇది రికార్డు సృష్టించనుంది. జమ్ముకశ్మీర్‌ను లద్దాఖ్‌తో అనుసంధానించే ఈ సొరంగం అన్ని కాలాల్లోనూ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా నియంత్రణ రేఖకి ఇరువైపులా ఉన్న కశ్మీర్‌లో పరస్పర భిన్నమైన పరిస్థితులకు ఈ రెండు ఘటనలే సజీవ సాక్ష్యం.

పీవోకేను భారత్ ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్థాన్‌ అక్రమ ఆక్రమణలో ఉందని ప్రపంచానాకి పలుమార్లు స్పష్టం చేసింది. అందుకే పీవోకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో, ప్రత్యేక దేశమో అయిపోదని భారత్‌ వాదిస్తోంది. ఏనాటికైనా పీవోకే భారత్‌లో కలవాల్సిందే.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story