Off The Record: పోచారం మనసు బీఆర్ఎస్ వైపు మళ్ళుతోందా ?

Off The Record: కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాన్సువాడలో పోచారంను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వ్యూహాలపై విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Aug 2026 11:46 AM IST
Off The Record
X

Off The Record: పోచారం మనసు బీఆర్ఎస్ వైపు మళ్ళుతోందా ?

Off The Record: ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి, ఆ పార్టీ కార్యకర్తలతో పోరాడిన నేతలు… ఇప్పుడు అదే పార్టీలోకి వచ్చి వారి కింద పనిచేయడం, లేదా స్థానిక కాంగ్రెస్ కేడర్ వీరి రాకను జీర్ణించుకోలేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ మారినప్పటికీ క్షేత్రస్థాయిలో పాత వైరుధ్యాలు అలాగే కొనసాగుతున్నాయి.

పార్టీ ఫిరాయించిన సీనియర్ నేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కుతుందని భావించినా, గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్న పరిణామాలు వేరుగా ఉన్నాయి. కీలక పదవి దక్కుతుందని ఆశించిన సీనియర్లకు నిరాశే ఎదురైంది. వీరికి కేవలం ‘ఎమ్మెల్యే’ హోదా మినహా పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండటం వీరిని నిద్రపోనివ్వడం లేదు. ఒకవేళ కోర్టు నుంచి ప్రతికూల తీర్పు వస్తే శాసనసభ్యత్వమే కోల్పోవాల్సి వస్తుందనే భయం వారిని తీవ్రంగా వెంటాడుతోంది.

అందుకే తాము కేవలం ‘అభివృద్ధి కోసమే’ కలిశామంటూ లీగల్ లేదా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలోనూ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్నప్పటికీ, రాజకీయ సమీకరణాలు ఎప్పుడైనా మారవచ్చు.

ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ బలపడినా లేదా రాజకీయంగా గాలి మారినా, అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా యూ-టర్న్ తీసుకోవడానికి వీలుగా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకోలేక, అలా అని కాంగ్రెస్‌ను కాదనలేక…

ఇటు అభివృద్ధి, అటు సర్వైవల్ బ్యాలెన్స్ చేయడానికి ఈ తరహా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారనే వాదన బలపడుతోంది. మరోవైపు.. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ వ్యూహాలు కూడా పోచారాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి. ఇక్కడ గులాబీ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టి పని చేస్తోంది.

స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆ నియోజకవర్గ వ్యవహారాలు పర్యావేక్షిస్తుండటం వెనుక పెద్ద వ్యూహాం ఉంది. ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి గులాబీ పార్టీకి వలసలు పెరుగుతున్నాయి. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి చేరికల బాధ్యత అప్పగించి మానిటరింగ్ చేస్తున్నారట కేటీఆర్.

తాజాగా బాన్సువాడలో బలమైన బీసీ నేత, వ్యాపార వేత్త మోరల్ శ్రీనివాస్ ను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారట. 2 వేల మంది అనుచరులతో గులాబీ తీర్దం పుచ్చుకున్నారట శ్రీనివాసరావు. మొన్నటి మున్సిపల్ ఎన్నికలకు ముందు పోచారం అనుచరులు, అలాగే ఆయన వ్యతిరేకవర్గంలోని ముఖ్య నేతలంతా గులాబీ గూటికి చేరారట.

రాష్ట్రంలో పరిస్దితి ఎలా ఉన్నా.. బాన్సువాడలో మాత్రం గులాబీ పార్టీలోకి వలసలు పెరిగాయనే టాక్ నడుస్తోందట. త్వరలో ఓ మాజీ ఎమ్మెల్యే సైతం గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోందట. ఐతే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుందట.

బాన్సువాడలో బీసీ నినాదాంతో పోచారం శ్రీనివాస్ రెడ్డికి గట్టి జవాబు ఇవ్వాలనే స్కెచ్ వేస్తున్నారట కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలంతా.. ఇప్పుడు స్వగృహ ప్రవేశం చేసేందుకు క్యూ కడుతున్నారట.

పంచాయతీ ఎన్నికల్లో కొందరూ, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకొందరు.. కాంగ్రెస్ ను వీడీ కారెక్కేస్తున్నారట. ఇలా ఈ ఒక్క నియోజకవర్గంలో మరిన్ని చేరికలకు ప్లాన్ చేస్తున్నారట కేటీఆర్. ఆ బాధ్యతను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డిలకు అప్పగించారట.

వర్ని, కోటగిరి మండలాలకు చెందిన కొందరు నేతలు కూడా బీఆరెస్ కండువా కప్పుకున్నారట. వలసలు కొనసాగుతున్నా.. అడ్డుకట్ట వేయలేక పోతున్నారట హస్తం నేతలు. కష్టకాలంలో పోచారం పార్టీని వీడి మోసం చేశారంటూ విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లో వ్యతిరేకత పెంచే వ్యూహాంలో ఉందట గులాబీ పార్టీ.

పోచారం సైతం బీఆర్ఎస్ వ్యూహానికి ప్రతివ్యూహాం పన్నుతున్నారట బాన్సువాడ గడ్డ గులాబీ అడ్డా.. అని కేటీఆర్ చెబుతుంటే.. పోచారం అడ్డా అంటున్నారట ఆయన వర్గీయులు. తాజా వలసలతో బాన్సువాడ నియోజకవర్గంపై రాష్ట్ర స్దాయిలో చర్చ జరుగుతోందట.

రానున్న రోజుల్లో పోచారం టార్గెట్ గా కదులుతున్న పావులు ఆయన కంచుకోట బద్దలు కొట్టటం ఖాయమని చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బాన్స్వాడ నియోజకవర్గంలో బీసీ నినాదంతో పాటు.. పక్కా లోకల్ అనే ప్రచారం కూడా కొనసాగుతోంది.

పోచారం గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా ఎదురులేని నేతగా బాన్సువాడలో నిలిచారు. కానీ ప్రస్తుతం మారుతున్న కాలంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటు..? కాంగ్రెస్లో కొనసాగుతారా లేక పాతగూటికి చేరతారా అనే టాక్ నడుస్తోంది. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన అంతర్మాదంలో ఉన్నట్లు భావిస్తున్నారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం లేదు, పనులు ఆగిపోతున్నాయని, సిద్దాపూర్ రిజర్వాయర్, ఆసుపత్రి భవనాల నిర్మాణాలకు సంబంధించి వందల కోట్లు రావాల్సి ఉందని ఈ విషయాన్ని పలుమార్లు సిఎంకు చెప్పినా పని జరగకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారట.

కేసీఆర్ను మోసం చేసి వెళ్లాలని లేకుండే కానీ అభివృద్ధి కోసం తప్పలేదని ఆయన వ్యాఖ్యలు చర్చ నియాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో మన జెండానే గెలుస్తుందని పోచారం అనడంతో ఏ పార్టీ జెండా ఎగురుతుంది అన్న చర్చ జోరుగా నడుస్తోంది.

నియోజకవర్గంలో పోచారానికి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని..అందుకే కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారన్న మరో వాదన కూడా వినబడుతోంది. చూడాలి మరి.. పోచారం.. అడుగులు ఎలా సాగుతాయో.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story