Burning Topic: ప్రపంచ దేశాలను శాసిస్తున్న బ్రిక్స్ దేశాలు!

Burning Topic: సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు. జిన్‌పింగ్ భారత్ పర్యటన, ట్రంప్ హెచ్చరికల వేళ, ఆర్థిక స్వయంప్రతిపత్తికి ఈ కూటమి కీలకం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Aug 2026 7:30 AM IST
Burning Topic
X

Burning Topic: ప్రపంచ దేశాలను శాసిస్తున్న బ్రిక్స్ దేశాలు!

Burning Topic: బ్రిక్స్ ...ఒక అంతర్జాతీయ కూటమి. ఈ కూటమి ఆవిర్భావానికి ఓ నేపథ్యం ఉంది. 2006 సెప్టెంబరులో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చలు జరిగాయి. ఈ సమావేశాలకు బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు.

ఆ తరువాత ఈ నాలుగు దేశాల ప్రతినిధులు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2009 జూన్ 16న రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో ఈ దేశాల ప్రతినిధుల పూర్తి స్థాయి దౌత్య సమావేశం జరిగింది. దీనినే బ్రిక్ కూటమి మొట్టమొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశమని చెప్పుకోవచ్చు.

అప్పటికి బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా చేరలేదు. కేవలం నాలుగుదేశాలతోనే బ్రిక్స్ కూటమి ప్రారంభమైంది.ఈ సదస్సుకు భారత్ తరఫున మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను సంస్కరించడం వంటి మార్గాలపై కూటమి శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది.

ఈ సందర్భంగా కొత్త గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవసరాన్ని బ్రిక్‌ సమూహంలోని సభ్యదేశాలు ప్రకటించాయి. బ్రిక్స్ భౌగోళిక రాజకీయాల్లో కీలకమైన కూటమి. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా....ఈ కూటమిలో సభ్యదేశాలు. ఈ దేశాల తొలి అక్షరాలతో...బి, ఆర్‌, ఐ, సీ, ఎస్‌ తో ...కూటమికి బ్రిక్స్ అనే పేరు పెట్టుకున్నారు.

ప్రాంతీయ ఆర్థిక వ్యవహారాలపై వాటికున్న పరపతికి బ్రిక్స్ సభ్యదేశాలు ప్రపంచమంతటా పేరు పొందాయి. 2009 నుంచి ప్రతి ఏడాది బ్రిక్స్ సభ్య దేశాల అధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. 2018 నాటి లెక్కల ప్రకారం ఈ ఐదు దేశాల జీడీపీ 18.6 ట్రిలియన్ డాలర్లు. స్థూల ప్రపంచ ఉత్పత్తిలో ఇది 24 శాతం.

కాగా2014లో 250 బిలియన్ డాలర్లతో బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ పేరుతో ఒక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేశాయి. అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడమే బ్రిక్స్ కూటమి లక్ష్యంగా మారింది. అయితే అప్పటివరకు బ్రిక్స్ కూటమిలో ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సభ్యత్వం లేదు.

అయితే 2014లో ఈ దేశాలకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో సభ్యత్వం ఉండటం విశేషం. అంతర్జాతీయ సంస్థల విషయాన్ని కూడా బ్రిక్స్ సదస్సు గతంలోనే ప్రస్తావించింది. ఐక్యరాజ్యసమితితో పాటు భద్రతామండలిలో సమగ్ర సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ సదస్సు పిలుపునిచ్చింది.

ఐక్యరాజ్యసమితిని మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దాలని బ్రిక్స్ కూటమి అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వర్థమాన దేశాలకు కూడా ప్రాతినిధ్యం దక్కేలా ఐక్యరాజ్యసమితిని తీర్చిదిద్దాలని బ్రిక్స్ జొహన్సెస్‌బర్గ్ సదస్సు అభిప్రాయపడింది. దీంతో పాటు సుస్థిరాభివృద్ది అజెండాను సమర్థంతంగా అమలు చేయాలని కోరింది.

మొత్తంగా ప్రపంచ జనాభాలో 41 శాతానికి బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచ జీడీపీలో 24 శాతం వాటా కలిగి ఉన్నాయి. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి బ్రిక్స్ కూటమి దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి.

భవిష్యత్తులో బ్రిక్స్ కూటమి ఒక బలమైన వేదికగా మారుతుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇదిలా ఉంటే, బ్రిక్స్‌ కూటమిపై భారత్ కు స్పష్టమైన అభిప్రాయం ఉంది.బ్రిక్స్ కూటమికి సమష్టి ప్రయోజనాలు ఉండాలనేది మౌలికంగా భారత్ చేస్తున్న వాదన.

భవిష్యత్ అవసరాలకు దీటుగా బ్రిక్స్ కూటమిని తీర్చిదిద్దుకోవాలంటే ముందుగా సభ్యదేశాల మధ్య సహకారం చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అంతేకాదు రానున్న సంవత్సరాల్లో ప్రపంచపటంపై బ్రిక్స్ కూటమి ఒక బలమైన శక్తిగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు.

వాస్తవానికి బ్రిక్స్ కూటమికి ప్రపంచపటంపై ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలు వెతికే కూటమిగా బ్రిక్స్ కు తనదైన గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణపై దృష్టి పెట్టింది బ్రిక్స్ కూటమి.

అయితే సభ్యత్వ విస్తరణ అనేది ఏకాభిప్రాయంతోనే జరగాలని భారత్ తెగేసి చెప్పింది. బ్రిక్స్ కూటమిపై పెత్తనానికి డ్రాగన్ చైనా చేసిన ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది భారత్‌. కాగా ప్రపంచపటంపై భారత్‌కు ఒక ప్రత్యేకత ఉంది.

భౌగోళిక రాజకీయాల్లో భారత్ తనదైన ముద్ర వేసింది. కొన్ని సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ కూటమి 15వ సదస్సులోనూ భారతదేశం కీలకపాత్ర పోషించింది. బహుళపక్ష సంస్థల్లో ఆర్థికపరమైన సంస్కరణల అవసరాన్ని జొహన్నెస్‌బర్గ్‌ సదస్సులో భారత్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఈ ప్రస్తావనతో బ్రిక్స్ కూటమి సభ్యదేశాల అభినందనలు అందుకుంది. బహుళపక్ష సంస్థల్లో సంస్కరణలకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో బలమైన సంబంధాలు పెంపొందించుకోవడానికి బ్రిక్స్ కూటమిని ఒక సాధనంగా భారతదేశం ఉపయోగించుకుంటోంది.

పాశ్చాత్య దేశాలతో ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక అవసరాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారతదేశం అభిప్రాయపడింది. కిందటేడాది జులై 6,7 తేదీల్లో బ్రిక్స్ కూటమి 17వ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్‌లోని రియో డీ జనీరో వేదిక గా జరిగింది.

ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరంగా బ్రిక్స్ కూటమి మారాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు రియో డీ జనీరో సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

ఇదిలా ఉంటే, బ్రిక్స్ కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిందటేడాది మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగేలా బ్రిక్స్ కూటమిలోని ఏ సభ్య దేశమైనా ప్రయత్నాలు మొదలెడితే, సదరు దేశంపై అదనంగా పది శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ మహాశయుడు హెచ్చరించారు.

అంతేకాదు...ఇందులో ఏ దేశానికీ మినహాయింపు కూడా లేదని డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టారు. 2025లో జరిగిన బ్రిక్స్ సదస్పులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల విషయాన్ని పలువురు దేశాధినేతలు ప్రస్తావించారు.

ఒక్కమాటలో చెప్పాలంటే...బ్రిక్స్ అంటే అనేక అభివృద్ది చెందుతున్న దేశాల కూటమి. ఇటీవలికాలంలో గ్లోబల్ సౌత్ సమస్యలు ప్రస్తావించే ఒక అంతర్జాతీయ వేదికగా బ్రిక్స్ కూటమి మారింది. కాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర దాటింది.

ఈ ఏడాదిన్నర కాలంలో డొనాల్డ్ ట్రంప్ సాధించింది శూన్యమే అని చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ల పేరుతో ఇష్టారీతిన ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ల విషయంలో కోర్టు నుంచి మొట్టికాయలు కూడా తిన్నారు డొనాల్డ్ ట్రంప్.

ఏ దేశం పైన కోపం వచ్చినా, ట్రంప్ మొదటగా ప్రయోగించే ఆయుధం సుంకాలే. ఈ క్రమంలో బ్రిక్స్ కూటమి సభ్య దేశాలను హెచ్చరించడానికి కూడా సుంకాల ఆయుధాన్నే డొనాల్డ్ ట్రంప్ నమ్ముకున్నారు.

వాస్తవానికి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా విధిస్తున్న సుంకాలు మోయలేని భారంగా మారుతున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. చైనా అయితే సుంకాల విషయంలో ఒక దశలో అమెరికాతో ఢీ అంటే ఢీ అంది.

అమెరికా తో టారిఫ్ వార్ కు చైనా రెడీ అంది. అయితే చైనాతో గొడవ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ...డొనాల్డ్ ట్రంప్ ఓ మెట్టు దిగారు.సైలెంట్ గా చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుని విభేదాలను తాత్కాలికంగా అటకెక్కించారు.

కాగా కిందటేడాది బ్రిక్స్ కూటమి సభ్య దేశాలకు అమెరికా ఇచ్చిన వార్నింగ్ కు చైనా యే స్పందించడం విశేషం. అమెరికాతో ఘర్షణను బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు కోరుకోవడం లేదని చైనా క్లారిటీ ఇచ్చింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లే భావించాలి.

కాగా 2024లో రష్యాలోని కజాన్ లో బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు జరిగింది.ఈ సదస్సులో ఉమ్మడి కరెన్సీ ప్రస్తావన వచ్చింది. ప్రపంచ జీడీపీలో 35శాతానికి పైగా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిక్స్ కూటమి దేశాలు... పరస్పర ప్రయోజనాల రీత్యా వ్యాపార, ద్రవ్య లావాదేవీలను స్వంత కరెన్సీలో నిర్వహించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే డాలర్ కు ప్రత్యామ్నాయంపై కూటమి సభ్య దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్పట్లో సూచించారు. పుతిన్ చేసిన ఈ సూచనే డొనాల్డ్ ట్రంప్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ ఆగ్రహంతోనే బ్రిక్స్ కూటమి సభ్యదేశాలపై ట్రంప్ మహాశయుడు నిప్పులు చెరిగారు.

డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే భారత్ సహా బ్రిక్స్ దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో హెచ్చరించారు. అంతేకాదు డాలర్‌కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని చూసినా లేక డాలర్ విలువ తగ్గించాలని ప్రయత్నించినా సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ మహాశయుడు.

కరెన్సీ విషయంలో డాలర్‌కే కట్టుబడి ఉండాలని బ్రిక్స్ కూటమి సభ్య దేశాలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. కాగా వర్థమాన దేశాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్థమాన దేశాలపై అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక యుద్దం ప్రకటించారన్న విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం అంటే అమెరికాను సవాల్ చేయడమే అనే రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. బ్రిక్స్ కూటమి ఒక్కటే కాదు....ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ కూటములు తమకంటూ ఉమ్మడి కరెన్సీ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సమాలోచలు జరుపుతున్నాయి.

అయితే సదరు ప్రయత్నాలు వర్క్ అవుట్ అవుతాయా లేవా అనేది వేరే విషయం. సూటిగా చెప్పాలంటే....డాలర్ కరెన్సీకి కట్టుబడి ఉండాలా లేక ప్రత్యామ్నాయ కరెన్సీ వైపు చూడాలా అని నిర్ణయించుకునే హక్కు ఏ దేశానికి అయినా ఉంటుంది. అంతేకాదు బహళ ధృవ ప్రపంచాన్ని కోరుకుంటున్న అనేక దేశాలు ...డాలర్ కరెన్సీకి ప్రత్యామ్నాయం వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

కాగా ఢిల్లీ వేదికగా సెప్టెంబరు 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సదస్సుకు హాజరవడానికి చైనా అధినేత జిన్ పింగ్ భారత్ రానున్నారు. అంతేకాదు 400 మంది ప్రతినిధులను వెంటేసుకుని ఆయన భారత్ రాబోతున్నారు. గతంలో 2019లో జిన్ పింగ్ భారత్లో పర్యటించారు. అంటే బ్రిక్స్ సదస్సు పుణ్యమా అంటూ ఏడు సంవత్సరాల తరువాత ఆయన భారత్ కు రానున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story