Burning Topic: ఢిల్లీ జనాన్ని వణికిస్తున్న కాలుష్యం!
Burning Topic: ఢిల్లీలో అకాల వర్షాలతో 123.3 mm వర్షపాతం నమోదైంది. 1951 తర్వాత అత్యంత తక్కువ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, వాయు నాణ్యత (AQI) గణనీయంగా మెరుగుపడింది.
Burning Topic: ఢిల్లీ జనాన్ని వణికిస్తున్న కాలుష్యం!
Burning Topic: దేశ రాజధానిలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత రెండు రెండు, మూడు రోజులుగా భారీ వర్షాల కారణంగా చలి పెరిగిపోయింది. అక్టోబర్ 30 ఉదయం నాటికి ఢిల్లీ నగరంలో సగటున 61.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో అక్టోబర్ నెల మొత్తం కురిసిన వర్షపాతం 123.3 mm కి చేరింది. సాధారణంగా ఈ నెలలో కురిసే 15.1 mm కంటే ఇది చాలా ఎక్కువ.
గడిచిన నాలుగేళ్లలోనే అక్టోబర్ నెలలో అత్యధిక వర్షం కురిసిన రోజుగా ఇది నమోదైంది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఝరోడా కలాన్, లోధి రోడ్, సఫ్దర్‌జంగ్, ఝజ్జర్, పితాంపూర, పూసా, ఘజియాబాద్ కమలా నెహ్రూ నగర్, ప్రగతి మైదాన్, గురుగ్రామ్, జనక్‌పురి తదితర ప్రాంతాల్లో వానలు దండి కొట్టాయి. దీంతో వాతావరణ శాఖ సౌత్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, షాహదర, సెంట్రల్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, వెస్ట్, నార్త్ ఢిల్లీ సహా చాలా ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
మూడు వేర్వేరు వాతావరణ వ్యవస్థలు ఒకే సమయంలో పరస్పరం ప్రభావితం చేసుకోవడంమే ఢిల్లీలో ఏర్పడ్డ ఈ అసాధారణ వర్షలకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో అకస్మాత్తుగా చలి పెరగడానికి, అకాల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచడానికి ఇది అత్యంత ప్రధాన కారణం. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే ఈ తక్కువ పీడన వ్యవస్థలు ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.
దీనివల్ల ఎండాకాలంలో లేదా చలికాలం ముగిసే సమయంలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 9 నుండి 10 డిగ్రీలు తక్కువగా పడిపోతాయి.బంగాళాఖాతంలో లేదా అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులు, వాయుగుండాల ప్రభావం వల్ల ఢిల్లీకి అకస్మాత్తుగా తేమతో కూడిన గాలులు వస్తాయి. ఇవి స్థానిక వాతావరణ వ్యవస్థలతో కలిసినప్పుడు అనుకోకుండా దట్టమైన మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి.
ఢిల్లీలో ఒకవైపు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన అక్టోబర్ నెలలో, మునుపెన్నడూ లేని విధంగా గాలి స్వచ్ఛంగా మారడం వెనుక ప్రకృతి సృష్టించిన విచిత్రమైన వాతావరణ సమతుల్యత దాగుంది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడింది. అక్టోబర్ నెలలో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి నమోదైంది. 2022 అక్టోబర్ 10న ఏక్యూఐ 44గా నమోదైన తర్వాత ఇదే అత్యుత్తమ స్థాయి.
సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 20.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సాధారణం కంటే ఇది 10.3 డిగ్రీలు తక్కువ. 1951 తర్వాత అక్టోబర్ నెలలో ఇంత తక్కువ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ వాసులు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు, శాలువాలు, వెచ్చని దుస్తులు బయటకు తీశారు. శీతాకాల కాలుష్య ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబరులో ప్రకృతి ఇచ్చిన ఈ ఊరట ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగించింది. అయితే రానున్న రోజుల్లో కాలుష్య స్థాయులు మళ్లీ పెరుగుతాయా? అన్నది వేచి చూడాలి.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 5 నుంచి 20 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి మాత్రమే ప్రత్యక్షంగా పనిచేసేందుకు అనుమతించనున్నారు. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘజియాబాద్, నోయిడా జిల్లాల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో దుమ్ము, ధూళి వెలువడే నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయనున్నారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, విద్యుత్ ప్రసార లైన్లు, పైప్లైన్లు, టెలికమ్యూనికేషన్ పనులకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అయితే రైల్వేలు, మెట్రో, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, జాతీయ భద్రత, రక్షణ రంగానికి సంబంధించిన అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కాని పారిశ్రామిక సంస్థలు, అత్యవసర సేవలకు కూడా వెసులుబాటు కల్పించారు.
ఢిల్లీ-ఎన్సీఆర్లో నవంబర్‌లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరే అవకాశముండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లు సీఏక్యూఎం వెల్లడించింది. 2018 నుంచి 2025 మధ్య నమోదైన గణాంకాల ప్రకారం నవంబర్ మొదటి, రెండో వారాల్లో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్లు గుర్తించారు.
చలికాలం ప్రారంభమవడంతో గాలి వేగం తగ్గడం, వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం నుంచి వెలువడే పొగ వాతావరణంలోనే నిలిచిపోవడం కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. ఈ ఆంక్షల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలకు అప్పగించారు.
స్థానిక అధికారులు, పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. నవంబర్ 5 నుంచి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగుతాయి. నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణ సంస్థలు, కార్యాలయాలపై భారీ జరిమానాలు విధించనున్నారు.




