Burning Topic: ట్రంప్ ఓటమితో ఇరాన్‌లో సంబరాలు

Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు నీలి ప్రభంజనం సృష్టించారు. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు మెజారిటీ గవర్నర్ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయం సాధించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Nov 2026 7:09 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్ ఓటమితో ఇరాన్‌లో సంబరాలు

Burning Topic: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చి తీర్పు అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మీద వారి ఆగ్రహాన్ని చాటుతున్నాయి. రిపబ్లికన్ల సాంప్రదాయ కోటలుగా ఉన్న పలు కీలక రాష్ట్రాలలో డెమోక్రాట్లు చారిత్రాత్మక విజయాలు సాధించి, భారీగా సీట్లను చేజిక్కించుకున్నారు.

సెనేట్‌లో డెమోక్రాట్లు రిపబ్లికన్ల నుంచి స్పష్టమైన ఆధిక్యం సాధించడానికి ప్రధానంగా టెక్సస్, కాన్సస్, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, ఒహోయో, అయోవా, మైన్ రాష్ట్రాలు కారణమయ్యాయి. గతంలో ఎన్నడూలేని విధంగా డెమోక్రాట్ల విజయం అగ్రరాజ్య రాజకీయ ముఖచిత్రాన్ని గణనీయంగా మార్చివేసిందని చెబుతున్నారు. ఈ విజయాన్ని నీలి ప్రభంజనంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

100 సీట్లున్న సెనెట్‌లో డెమోకాట్ల ఆధిక్యత 54 సీట్లుకు చేరగా, రిపబ్లికన్ల బలం 44 సీట్లుకు పడిపోయింది. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా డెమోక్రాట్లు 240 సీట్ల ఆధిక్యతను సాధించగా, రిపబ్లికన్ల బలం 147 సీట్లుకు పరిమితం అయింది.

ఈ ఎన్నికల్లో కాన్సస్ రాష్ట్రం నుండి డెమొక్రాటిక్ పార్టీ సాధించిన విజయానికి అత్యంత చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. కాన్సస్ సంప్రదాయబద్ధంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కంచుకోట. 1932 తర్వాత ఇక్కడ డెమొక్రాట్లు ఎప్పుడూ సెనేట్ స్థానాన్ని గెలవలేదు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ 16 శాతానికి పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

అలాంటి రాష్ట్రంలో రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించడం గత 94 ఏళ్లలో ఇదే మొదటిసారి. అమెరికా రాజకీయాల్లో ఒకే పార్టీకి అత్యంత సుదీర్ఘకాలం పాటు ఉన్న ఓటమి పరంపరకు ఇది ముగింపు పలికినట్లయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన సిట్టింగ్ సెనేటర్, రిపబ్లికన్ అభ్యర్థి రోజర్ మార్షల్ మీద డెమొక్రాట్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ విజయ ఖేతనం ఎగురవేశారు.

డెమోక్రాట్లు కేవలం సెనేట్ స్థానమే కాకుండా, 2010 తర్వాత కాన్సస్ రాష్ట్ర అసెంబ్లీని కూడా కైవసం చేసుకున్నారు. డెమోక్రాట్ల విజయం రాష్ట్ర చరిత్రలోనే ఓ సంచలనంగా మారింది.

రిపబ్లికన్‌ పార్టీ కంచుకోట టెక్సాస్‌ నుంచి 38 ఏళ్ల తరువాత మొదటిసారిగా డెమొక్రాట్‌ అభ్యర్ధి జేమ్స్‌ టలారికో సెనేటర్‌గా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. . జార్జియా నుంచి మరోసారి జాన్‌ ఓసాఫ్‌ విజయం సాధించారు. నార్త్‌ కారొలీనాలో రాయ్‌ కూపర్‌ రిపబ్లికన్‌ అభ్యర్థి మైకేల్‌ వాట్లేపై విజయం సాధించారు.

ఓహాయోలోనూ డెమోక్రాట్ల అభ్యర్థి షెర్రాడ్‌ బ్రౌన్‌ రిపబ్లికన్ల అభ్యర్థి జాన్‌ హస్టెడ్‌పై విజయం సాధించగా... మిషిగన్‌ నుంచి అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ముస్లిం సెనేటర్‌గా డాక్టర్‌ అబ్దుల్‌ ఎల్‌ సయ్యద్‌ ఘన విజయం సాధించారు. అయోవాలో డెమొక్రాట్‌ అభ్యర్థి జోష్‌ తురెక్‌ విజయం సాధించారు.

న్యూ హాంప్షైర్‌లో డెమొక్రాట్‌ అభ్యర్థి క్రిస్‌ పప్పాస్‌ సెనేట్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. సౌత్‌ కరోలినా డెమొక్రాట్‌ అభ్యర్థి అన్నీ ఆండ్రూస్‌ సంచలన విజయం సాధించారు. పెన్సిల్వేనియా, న్యూజెర్సీలలో టామ్‌ కీన్, రియాన్‌ మెకెంజీ, స్కాట్‌ పెర్రీ, రాబ్‌ బ్రెస్నాహాన్‌ వంటి కీలక రిపబ్లికన్‌ ప్రతినిధులు ఓటమిపాలయ్యారు.

అమెరికా కాంగ్రెస్‌లోని హౌస్, సెనేట్‌లతోపాటు జరిగిన 36 రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికల్లోనూ రిపబ్లికన్లకు ఎదురుదెబ్బే తగిలింది. డెమొక్రాట్లు కనీసం 28 రాష్ట్రాల గవర్నర్ పదవులను చేజిక్కించుకున్నారు. మొత్తం 50 రాష్ట్రాలలో మెజార్టీ గవర్నర్ స్థానాలను డెమొక్రాట్లు కైవసం చేసుకోవడం గత 16 ఏళ్లలో ఇదే మొదటిసారి.

ఈ ఎన్నికలకు ముందు రిపబ్లికన్లు 26-24 ఆధిక్యతతో ఉండగా, తాజా ఫలితాల ద్వారా డెమొక్రాట్లు బలమైన రిపబ్లికన్ కంచుకోటలను సైతం బద్దలు కొట్టారు. టెక్సస్‌ నుంచి గినా హినోజోసా ఒహాయో నుంచి ట్రంప్‌ మద్దతుదారు, భారతీయ సంతతికి చెందిన వివేక్‌ రామస్వామిపై ఆమీ యాక్టన్‌ గెలుపొందారు.

అలాగే అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి నల్లజాతి గవర్నర్‌గా జార్జియాకు చెందిన కీషా లాన్స్‌ బాటమ్‌ విజయం సాధించారు. అయోవాలో డెమొక్రాట్లకు చెందిన రాబ్‌ శాండ్‌ గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు 2027 జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.

మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలకడలేని మాటలు, పొంతనలేని విధానాలు, కొన్ని దేశాలపై ద్వేషం మీద అమెరికా ఓటర్లు గట్టిగానే బుద్ధి చెప్పారు. రెండేళ్లకిందే భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన అనుచిత నిర్ణయాలతో ప్రపంచాన్ని అల్లకల్లోలంలోకి నెట్లడం అమెరికన్లకు ఆగ్రహం తెప్పించింది ఈ కారణంగానే ప్రజలు ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి లేలకు దించేశారు.

గతంలో ఎన్నడూలేని స్థాయిలో రిపబ్లికన్‌ పార్టీని తిప్పికొడుతూ డెమోక్రాట్లకు పట్టం కట్టారు. అమెరికా కాంగ్రెస్‌‌పై ఆ పార్టీకి అసాధారణ ఆధిపత్యం కట్టబెట్టారు. దేశవ్యాప్తంగా ఓటర్ల నాడి ఒకేలా ఉంది. వారంతా మార్పునే కోరుకున్నారు. కౌన్సిలర్ల నుంచి మేయర్లదాకా, రాష్ట్రాల సెనెట్‌ల నుంచి గవర్నర్లదాకా, అటార్నీ జనరళ్ల నుంచి సెనెట్‌ సభ్యులదాకా డెమోక్రాట్ల ప్రభంజనమే కనిపించింది. మధ్యంతర ఎన్నికల తీర్పుతో అమెరికాలో ట్రంప్‌ శకం ముగిసినట్లేననని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ల ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 3.7 శాతానికి చేరుకుంది. పెట్రోలు ధరలు మునుపెన్నడూ లేనంతగా గ్యాలన్‌కు 6.52 డాలర్లకు చేరుకోవడం... ఇందుకు ట్రంప్‌ విధానాలే కారణమని 60 శాతం మంది ఓటర్లు విశ్వసించారు.

ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆరోగ్యం, అవినీతి, కుటుంబాల ఆర్థిక సమస్యలవంటి అంశాలపై ఒక పద్ధతి ప్రకారం స్పష్టమైన ప్రచారం చేశారు. ఈ ఎన్నికలను అధ్యక్షుడిగా తన రెఫరెండంగా పరిగణించాలన్న ట్రంప్‌ వ్యాఖ్యలు ఓటర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

కాగా ఇరాన్ మీద ఇజ్రాయెల్‌తో కలిసి దాడులకు దిగడం అమెరికా ఓటర్లకు ఏమాత్రం రుచించలేదు. యుద్ధాలకు దూరంగా ఉంటానని, అమెరికా ఫస్ట్‌ అని హామీలిచ్చి అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో చాలామంది మద్దతుదారులు ట్రంప్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వానికి ఎదురు దెబ్బ తగలడం ఇరాన్‌కు ఆనందం కలిగిస్తోంది. తమ దేశంపై చేపట్టిన యుద్ధ విధానాలను అమెరికా ప్రజలు తిరస్కరించారని ఇరాన్ నాయకత్వం పేర్కొంది. ట్రంప్‌కు అమెరికా ప్రజలు రాజకీయ పరాజయం చూపించారని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మోహ్సేన్ రెజాయ్ తెలిపారు.

పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ స్పందిస్తూ, అమెరికా ఓటర్లు యుద్ధానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. కాగా అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇరాన్ పట్ల వారి శత్రుత్వ వైఖరి మారబోదని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా వ్యాఖ్యానించారు.

ట్రంప్ పార్టీ ఓటమిని ఇరాన్ ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నాయకులను దోషులుగా చూపుతూ వారి చిత్రాలను టెహ్రాన్ వీధుల్లో వీధుల్లో దహనం చేశారు. వీ విల్ కిల్ ట్రంప్ అంటూ బిల్ బోర్ట్ ప్రదర్శించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్