BURNING TOPIC: ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ఉభయ సభల్లో డెమోక్రాట్ల బ్లూ వేవ్!

BURNING TOPIC: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించి యూఎస్ కాంగ్రెస్‌ను చేజిక్కించుకోగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ల ఓటమి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Nov 2026 10:37 AM IST
BURNING TOPIC
X

BURNING TOPIC: ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ఉభయ సభల్లో డెమోక్రాట్ల బ్లూ వేవ్!

BURNING TOPIC: ఊహించినట్లుగానే అమెరికా ఓట్లర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి మధ్యంతర ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఎన్నికల ఫలితాలలో డెమోక్రాట్ల గాలి పెద్ద ఎత్తునే లేచింది. వరుస విజయాలతో రిపబ్లికన్ల నుంచి యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను హస్తగతం చేసుకున్నారు.

100 మంది సభ్యులుండే సెనెట్‌లో 2020 ఎన్నికల తర్వాత డెమొక్రాట్లు తిరిగి పూర్తి ఆధిపత్యాన్ని దక్కించుకున్నారు. 55 సీట్లకు పైగా ఆధిక్యతను సాధించారు. ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఉండగా, మెజారిటీకి అవసరమైన 218 సీట్ల మార్కును సునాయాసంగా దాటేశారు.

సంప్రదాయకంగా రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న టెక్సాస్, కాన్సాస్, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, ఓహియో, ఐయోవా, మైనే రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించి సీట్లను ఎగరేసుకుపోవడమే కాకుండా, కీలకమైన జార్జియా, న్యూ హాంప్‌షైర్ స్థానాలను విజయవంతంగా నిలబెట్టుకున్నారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. వర్జీనియాలోని 10వ కాంగ్రెస్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డెమొక్రటిక్‌ అభ్యర్థి సుహాస్‌ సుబ్రమణ్యం మరోసారి విజయం సాధించారు. . 2024లో తొలిసారి కాంగ్రెస్‌కు ఎన్నికైన ఆయన, అంతకుముందు వర్జీనియా సెనేట్‌, ప్రతినిధుల సభలో పనిచేశారు.

వర్జీనియా నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్‌ నియోజకవర్గం నుంచి డెమొక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పియా దండియా కీలక విజయం సాధించారు. రిపబ్లికన్‌ అభ్యర్థి, వ్యాపారవేత్త కేసీ ఆస్కర్‌ను ఓడించారు.

మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అరుణా మిల్లర్‌ కూడా మరోసారి ఎన్నికయ్యారు. డెమొక్రటిక్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌తో కలిసి పోటీ చేసిన ఆమె, తమ పార్టీ విజయంతో పదవిని నిలబెట్టుకున్నారు. దీంతో అమెరికా రాష్ట్రస్థాయి ప్రభుత్వంలో భారత సంతతి ప్రాతినిధ్యం కొనసాగనుంది.

ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేపిన పోటీల్లో ఒహియో గవర్నర్‌ ఎన్నిక ఒకటి. రిపబ్లికన్‌ అభ్యర్థి, భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. డెమొక్రటిక్‌ అభ్యర్థి అమీ ఆక్టన్‌ ఆయనపై విజయం సాధించారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీకి ప్రయత్నించిన వివేక్‌, ఈసారి ఒహియో గవర్నర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు కూడా ఆయనకు లభించింది. అయినప్పటికీ ఓటర్లు అమీ ఆక్టన్‌ వైపు మొగ్గుచూపారు. వైద్యురాలైన అమీ ఆక్టన్‌ గతంలో ఒహియో ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర ప్రజల జీవన వ్యయం, ఆర్థిక పరిస్థితులు, పాలనా అంశాలను ప్రచారంలో ప్రస్తావించారు. చివరకు ఆమె విజయం సాధించడంతో 2006 తర్వాత తొలిసారిగా ఒహియోలో డెమొక్రటిక్‌ పార్టీకి గవర్నర్‌ పదవి దక్కింది. ఈ విజయంతో రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా అమీ చరిత్ర సృష్టించారు.

డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఫలితాలు కోలుకోలేని రాజకీయ ఎదురుదెబ్బగా మారాయి. దేశవ్యాప్తంగా రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున స్వయంగా విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటర్లు డెమొక్రాట్లకే పట్టం కట్టారు. అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్న తరుణంలో ఈ ఎన్నికలు ఆయన నాయకత్వానికి, రాజకీయ ప్రభావానికి గట్టి పరీక్షగా నిలిచాయి.అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయంతో కాంగ్రెస్‌లో వారికి ఆధిపత్యం లభించింది.

దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు చేపట్టడం, ట్రంప్ తెస్తున్న కొత్త చట్టాలను అడ్డుకోవడం, ప్రభుత్వ నిధుల కేటాయింపులను నిలిపివేయడం వంటి అధికారాలు డెమోక్రాట్లకు దక్కనున్నాయి. ఇరాన్ యుద్ధం, వలస విధానాలతో పాటు ట్రంప్ ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై డెమోక్రాట్లు విచారణలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ఇప్పటికే తీసుకున్న విదేశాంగ, వాణిజ్య, వలస విధానాల నిర్ణయాలను పూర్తిగా అడ్డుకోవడం డెమోక్రాట్లకు అంత సులభం కాదు.

ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ డొనాల్డ్ ట్రంప్‌ తన దూకుడును తగ్గించలేదు. 'నేను ఎన్నికల బరిలో లేను. ఒకవేళ పోటీ చేసి ఉంటే మేము భారీ మెజారిటీతో గెలిచేవాళ్లం' అని ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు. ప్రచార సమయంలో తనను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరిన ట్రంప్‌ ఇప్పుడు ప్లేటు పిరాయించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను.

డెమొక్రాట్లతో కలిసి పనిచేస్తాం. వారితో కలిసి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొంటాం' అని పేర్కొన్నారు. అదే సమయంలో ఎరుపు రంగులో ఉన్న టోపీపై 'వీటో' అని ముద్రించిన చిత్రాన్ని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు మెజారిటీ సాధించినప్పటికీ అధ్యక్షుడిగా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని ఈ పోస్టు ఇచ్చినట్లయింది. 'గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఎందుకు అలా జరిగిందో మంచి, చెడు కారణాలపై రాజకీయ వ్యాఖ్యాతగా విశ్లేషిస్తా' అని పేర్కొన్నారు.

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. విజయంతో సంబరాలు చేసుకుంటూనే ఆ పార్టీ ముందున్న బాధ్యతలను గుర్తుచేశారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో తమకు ఉన్న రాజకీయ అధికారాన్ని ఉపయోగించి అవసరమైన మార్పులు తీసుకురావాలని, మరింత నష్టం జరగకుండా అడ్డుకోవాలని సూచించారు. భవిష్యత్తుకు పునాది వేసేలా పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

అమెరికా ప్రజలు రాజకీయ విభేదాలను మరింత పెంచే నాయకత్వాన్ని కోరుకోవడం లేదని, అందరినీ కలుపుకొని వెళ్లే పాలనను ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపించడమే నాయకుల ప్రధాన బాధ్యత కావాలని సూచించారు.

మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఇరాన్‌ స్పందించింది. ఈ ఎన్నికల ద్వారా అమెరికా ప్రజలు యుద్ధాన్ని తిరస్కరించినట్లు స్పష్టమైందని పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ గలీబాఫ్‌ వ్యాఖ్యానించారు. ఓటర్ల తీర్పు యుద్ధానికి వ్యతిరేకంగా వెలువడిందని పేర్కొన్నారు.

అమెరికన్లు యుద్ధానికి 'నో' చెప్పారని, తాము ఈ సందేశాన్ని సమర్థిస్తున్నామని తెలిపారు. అయితే అమెరికా ప్రభుత్వం తన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మధ్యంతర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో గలీబాఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఓటర్ల ఆర్థిక ఆందోళనలు, విదేశాంగ విధానంపై అసంతృప్తి, ముఖ్యంగా ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు ఎన్నికలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్