Big Story: ఠాక్రే బ్రదర్స్‌తో ఫడ్నవీస్ రహస్య భేటీ!

Big Story: ముంబైలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 Oct 2026 1:05 PM IST
Big Story
X

Big Story: ఠాక్రే బ్రదర్స్‌తో ఫడ్నవీస్ రహస్య భేటీ!

Big Story: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ఒకే వేదికపై కనిపించారు. అంతేకాదు సదరు కార్యక్రమానికి ముందు ముగ్గురూ ఏకాంతంగా సమావేశమైనట్లు రాజకీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య విభేదాలు పెరుగుతున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించారన్నది అధికారికంగా వెల్లడికాలేదు.

ముంబైలో తాజాగా జరిగిన ‘మహారాష్ట్రచ్యా హాస్యరేఖా’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మరాఠీ రాజకీయ వ్యంగ్య చిత్రాల వందేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రముఖ కార్టూనిస్టు ప్రశాంత్‌ కులకర్ణి సంపాదకత్వంలో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముందు ఫడ్నవీస్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రే ఓ గదిలో సమావేశమై మాట్లాడుకున్నారు. అయితే ఈ సమావేశానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన చాయ్‌ భేటీ మాత్రమేనని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలోనూ ముగ్గురు నేతల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. రాజ్‌ ఠాక్రేను ఆహ్వానించినందుకే ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ కార్యక్రమానికి వచ్చారని మంత్రి ఆశిష్‌ షెలార్‌ అన్నారు. అయితే 2029 వరకు ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని రాజ్‌ ఠాక్రే చమత్కరించారు. రాజకీయాలకు అతీతంగా కళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో నేతలు కలుసుకోవడం మహారాష్ట్ర సంప్రదాయమని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా దీనిపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ స్పందించారు. 2019 వరకు ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌ చేసినప్పుడల్లా వెళ్లేవాడినని అన్నారు. ఆ తర్వాత ఉద్దవ్ థాక్రే నుంచి ఫోన్‌ కోసం ఎదురుచూశానని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకే వేదికపై కనిపించినంత మాత్రాన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు, కార్టూనిస్టుల కోసం ముంబయిలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తానని ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ విషయంలో ఠాక్రే సోదరుల సహకారం తీసుకుంటానన్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికలు అధికార కూటమి అయిన మహాయుతిలో చిచ్చు పెట్టాయి.మహారాష్ట్రలో మొత్తం ఐదు శాసనమండలి సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ప్రతిప‌క్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ మూడు స్థానాలను గెలుచుకుంది.అధికార మహాయుతి కేవలం రెండు స్థానాలే పరిమితమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మహాయుతి కూటమిలో విభేదాలున్నాయన్న విషయం బయటకు వచ్చింది.

దీంతో భారతీయ జనతా పార్టీ అలాగే ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన నాయకులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన తమకు సహకరించలేదని బీజేపీ నాయకులు అరోపించారు. ప్రధానంగా పూణే, నాగ్ పూర్ లలో కూటమి ధర్మాన్ని షిండే వర్గానికి చెందిన నాయకులు పాటించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు.

అయితే బీజేపీ నాయకుల ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తోసిపుచ్చారు.తన నాయకత్వంలోని శివసేన...ఎప్పుడూ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు.అయితే పూణే వంటి కొన్ని చోట్ల బీజేపీతో తాము స్నేహపూర్వక పోటీ చేశామని షిండే వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌, ఠాక్రే సోదరుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఆధారంగా కొత్త రాజకీయ కూటమి ఏర్పడుతుందని ఇప్పుడే అంచనా చెప్పలేమని బీజేపీ నేత ప్రవీణ్‌ దరేకర్‌ వ్యాఖ్యానించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్