Off The Record: అర్వింద్ దూకుడు.. బీజేపీలో జోష్
Off The Record: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యూహాలు మరియు బీజేపీ కార్యాచరణపై తాజా సమాచారం.
Off The Record: అర్వింద్ దూకుడు.. బీజేపీలో జోష్
Off The Record: ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ మాట్లాడి అందరిని దృష్టిని ఆకర్షించే వ్యక్తి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. సొంత పార్టీ వారైనా సరే.. మనసులో ఉన్నది మాట్లాడటం ఆయన అలవాటు. తప్పు చేస్తే ఎంతటివారైనా ముఖం మీదే ప్రశ్నిస్తారు. తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో ప్రజా సమస్యలపై కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసే లక్ష్యంతో బీజెపీ సమీక్షలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఇతర ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ సూచించారు. ఈ క్రమంలో ఎంపీ అర్వింద్.. బీజేపీ ఎమ్మెల్యేలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సమీక్షలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ చూపిన పనితీరు మీద సమీక్షించడంతోపాటు రానున్న పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మండల, జిల్లా, ప్రజా పరిషత్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతోపాటు భవిష్యత్తులో వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం అయ్యేలా ముందుకు వెళ్లాలని ఎంపీ అర్వింద్ ప్రణాళికలు తయారు చేస్తున్నారట.
ఆర్మూర్ నియోజకవర్గంలో నెలకొన్న గ్రూప్ తగాదాల నేపథ్యంలో బీజేపీ కేడర్ అయోమయంలో ఉందట. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ పూర్తిగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికే బాధ్యతలు అప్పగించినప్పటికీ.. ఆశించిన మేరకు సీట్లు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇక ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే చేస్తున్నారనీ ఎంపీ మండిపడ్డారట. బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో సైతం కార్యక్రమాలు చేయడం లేదనీ పార్టీ శ్రేణులకు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో కోర్ కమిటీ సమావేశంలో చెప్పిన విధంగా ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలలో పార్టీ కార్యక్రమాలు చేయడం లేదనీ, దీనిపై ఎంపీ అర్వింద్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారని సమాచారం.
ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపైనా పట్టు కోసం అర్వింద్ ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆదేశించారు. అదేవిధంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా దారి మళ్లిస్తోందో కూడా గ్రామస్థాయిలో ప్రజలకు బీజేపీ కార్యకర్తలు వివరించాలని ఆయన సూచించారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అనైతిక పొత్తులతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయని, వారి పదవీకాలం ముగిసేలోపే అక్కడ బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ శ్రేణులు దూకుడుగా ముందుకు సాగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలతో రోడెక్కాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని కోల్పోయిందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఊహించని రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు.
అయితే రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు జరిగినా బిజెపి ఐకమత్యంతో ఉండి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఎంపీ అర్వింద్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఫలితంగా బీజేపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తోంది.




