Off The Record: గద్వాల బరిలో స్నిగ్ధారెడ్డి ?

Off The Record: మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తన వారసురాలిగా కూతురు స్నిగ్ధారెడ్డిని గద్వాల అసెంబ్లీ బరిలో దించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Sept 2026 7:50 AM IST
Off The Record
X

Off The Record: గద్వాల బరిలో స్నిగ్ధారెడ్డి ?

Off The Record: పాలమూరు ఎంపీ డీకే అరుణ రాబోయే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెట్టారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారట. ముఖ్యంగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన గద్వాల్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట.

ఇప్పటికే రెండు టర్మ్‌లుగా గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ తన చేతిలో లేకుండా పోయింది. 2018లో ఓడిపోయిన తర్వాత.. 2023లో పోటీ కూడా చేయలేకపోయారు. ఇక గద్వాలలో తన పూర్వవైభవం చూపాలని భావిస్తున్నారట. అందుకే వచ్చే ఎన్నికల్లో తన వారసులను రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారట. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న టాక్‍ గట్టిగానే వినిపిస్తోంది.

పాలమూరు పాలిటిక్స్‌లో డీకే అరుణది చెరగని ముద్ర. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న డీకే అరుణ.. తన రాజకీయ ముఖచిత్రం మొత్తం గద్వాల చుట్టూనే ఉంటుంది. గద్వాల్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే అరుణ మంత్రి అయ్యాక జిల్లా పాలిటిక్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నారు.

మరీ ముఖ్యంగా గద్వాల నియోజకవర్గాన్ని కంటి చూపుతో శాసించిన డీకే అరుణ.. గత పదేళ్లుగా దూరంగా ఉండాల్సి వచ్చింది. 2018లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2019లో బీజేపీ ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు.

ఆ తర్వాత జిల్లా పాలిటిక్స్‌లో యాక్టీవ్‌గా ఉంటూ వచ్చిన డీకే అరుణ.. 2023 అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్‌లో గద్వాల నుంచి పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. గద్వాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో బీజేపీ నుంచి పోటీ చేయడానికి నిరాకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతుదారుడిగా బలిగెర శివారెడ్డిని రంగంలోకి దించారు. కానీ శివారెడ్డి ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయారు.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న డీకే అరుణ ఇక నేషనల్ పాలిటిక్స్‌లోనే కీ రోల్ పోషించాలని భావిస్తున్నారట. బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వంటి పోస్టుతో ఆమెకు పార్టీలో మంచి పట్టు దొరికింది. ఆమె ఆ పదవిలో కొనసాగినన్ని రోజులు పార్టీలోని పెద్దలు కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో.. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారన్న ప్రచారమూ కొనసాగుతోంది.

అయితే తాను ఎప్పటి నుంచి ప్రాతినిధ్యం వహించి, తన ఫ్యామిలీకి అత్యంత పొలిటికల్ అటాచ్మెంట్ ఉన్న గద్వాలను ఎట్టి పరిస్థితిలో వదులుకోకూడదని భావిస్తున్నారట. గద్వాల అంటే డీకే.. డీకే అంటే గద్వాలగా పేరగాంచిన నేపథ్యంలో అక్కడ మరోసారి తన పట్టును నిలుపుకోవాలని చూస్తున్నారట.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను నిలబెట్టిన వ్యక్తి అంతగా ఫర్ఫామెన్స్ ఉండకపోవడంతో రూటు మార్చారన్న టాక్‍ కొనసాగుతోంది. ఇక బయటి వ్యక్తులను కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్‌నే రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యారట. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి తన రాజకీయ వారసురాలుగా తన కూతురు స్నిగ్ధా రెడ్డిని రంగంలోకి దించాలని భావిస్తున్నారన్న టాక్‍ వినిపిస్తుంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున డీకే స్నిగ్ధా రెడ్డిని బరిలో దించడం కోసం పొలిటికల్ ప్లాట్ ఫామ్‌ను సిద్ధం చేస్తున్నారట డీకే అరుణ. రాబోయే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండటంతో.. ఇప్పటి నుంచే తన కూతురును గ్రౌండ్లోకి పంపిస్తున్నారట.

ఎన్నికల్లో తలపడాలంటే.. ప్రజల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ప్రజా ఆందోళనలలో డీకే స్నిగ్ధారెడ్డి పాల్గొంటున్నారట. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చేస్తున్న ప్రతీ ఆందోళన కార్యక్రమంలో డీకే స్నిగ్ధారెడ్డి పాల్గోంటున్నారట. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలోని ధరూరు మండల రైతులకు ర్యాలంపాడు నుంచి సాగునీరు అందించాలని ఆందోళన చేశారు.

బీజేపీ తరపున చేపట్టిన రహదారి దిగ్బంధం కార్యక్రమంలో స్వయంగా డీకే స్నిగ్ధ పాల్గొన్నారు. అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలంటూ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. గతంలో పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆదుకోవాలంటూ ఆందోళన చేశారు. ఇలా గద్వాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోనూ డీకే స్నిగ్ధ ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారట.

ఐతే మొత్తం మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల గడ్డను తన ఫ్యామిలీ ఎట్టి పరిస్థితిలో చేజిక్కించుకోవాలని డీకే అరుణ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పదేళ్లుగా గద్వాల్ గడ్డకు దూరం కావడంతో ఈసారి ఖచ్చితంగా పట్టుసాధించాలని చూస్తున్నారట డీకె అరుణ.

అందుకే ఏకంగా తన కూతురుకు ఆ బాధ్యతలను అప్పగించారట. పాలమూరు ఎంపీగా ఉంటూనే.. గద్వాల్ అసెంబ్లీపై ఓ కన్నేశారట. చూడాలి.. వచ్చే ఎన్నికల్లో గద్వాలను చేజిక్కించుకోవడం కోసం డీకే అరుణ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనేది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story