Burning Topic: నమ్మక ద్రోహం చేసిన రాహుల్ గాంధీ..?

Burning Topic: తమిళనాడు రాజకీయాల్లో పెను భూకంపం! డీఎంకేతో దశాబ్దాల బంధానికి కాంగ్రెస్ స్వస్తి పలికిందా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 May 2026 6:53 AM IST
Burning Topic
X

Burning Topic: నమ్మక ద్రోహం చేసిన రాహుల్ గాంధీ..?

Burning Topic: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇండీ కూటమి చీలికకు దారితీశాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమిలోకి కీలక భాగస్వామి డీఎంకేతో కలిసి పోటీ చేసింది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో డీఎంకే, కాంగ్రెస్, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేసి, 5 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని కోల్పోయినా ఈ సీట్లు కాంగ్రెస్ కు కీలకంగా మారాయి. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే కనీస మెజారిటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ సరికొత్త అవకాశంగా భావించింది. వెంటనే టీవీకేకు మద్దతు ప్రకటించేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు కూడా హాజరయ్యారు. ఈ పరిణామం సహజంగానే డీఎంకేకు ఆగ్రహం కలిగించింది.

తమిళనాడులో తాజా పరిణామాలు ఇండీ కూటమిలో చిచ్చు పెట్టేశాయి. కాంగ్రెస్ పార్టీతో తమ బంధం తెంచుకుంటున్నట్లు ప్రకటించేసింది డీఎంకే. దీన్ని వెన్నుపోటుగా అభివర్ణించింది. తమతో పొత్తు పెట్టుకొని 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు స్వల్ప లాభాలను ఆశించి దూరదృష్టి లేకుండా వ్యవహరించిందని ఆరోపించింది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి బీజేపీని గద్దె దింపుతామని తాము నమ్మకంతో ఉంటే, ఆ పార్టీ మాత్రం అస్థిర భాగస్వామిగా మారిపోయిందని ధ్వజమెత్తింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక్క రోజులోనే కాంగ్రెస్ అవిశ్వసనీయ రీతిలో ప్రవర్తించిందని మండిపడింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించిన డీఎంకే, పార్లమెంటులో తమకు విడిగా సీట్లు కేటాయించాలని స్పీకర్‌కు లేఖ రాసింది. కాంగ్రెస్‌ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంచేసింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. డీఎంకే ఈ నిర్ణయంతో ఇండీ కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త సమీకరణాలు, కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు తమిళనాడును పాలించిన కాంగ్రెస్.. ద్రవిడ పార్టీలు ఉనికిలోకి వచ్చాక అస్థిత్వాన్ని కోల్పోయింది. తన రాజకీయ మనుగడ కోసం కొంత కాలం అన్నాడీఎంకేతో, మరికొంత కాలం డీఎంకేతో పొత్తు కొనసాగిస్తోంది.. 1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో డీఎంకే పాత్ర ఉందన్న కారణం చూపి దూరమైన కాంగ్రెస్, అన్నా డీఎంకే గూటికి వచ్చింది. ఆ తర్వాత తన వైఖరిని మార్చుకొని డీఎంకే పంచన చేరింది. 2013లో యూపీఏ కూటమిలో చేరమని డీఎంకే బ్రతిమిలాడి ఒప్పించింది కాంగ్రెస్.. ఇప్పుడు తన అవసరాల కోసం మళ్లీ వదిలించేసుకుంది. తమిళనాడులో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకోవడం కోసం, లౌకిక వాదాన్ని కాపాడటం కోసం టీవీకేకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకుంటోంది. అయితే ఈ మద్దతు స్థానిక సంస్థలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలలో కూడా కొనసాగుతుందని, ఇది కాంగ్రెస్-టీవీకే మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యమని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో పార్టీని పునరుద్దరించేందుకు ఇదో అవకాశమని బెంగాల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. టీఎంసీలోని ఒక వర్గం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీని బలోపేతం చేయవచ్చని వారు నమ్ముతున్నారు. టీఎంసీ ఓడిపోగానే కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇది తప్పుడు సంకేతానికి దారి తీస్తుందని రాహుల్ గాంధీ తమ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి టీఎంసీ కూడా ఇండీ కూటమిలో ఉన్నా మమత కాంగ్రెస్ కు మాత్రం గౌరవం ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే తృణమూల్ ఓటమి తర్వాత స్పందించిన మమత, జాతీయ స్ధాయిలో ఇండీ కూటమితో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. కాగా 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండీ కూటమి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బీటలు వారిన కూటమిని ఎలా తిరిగి నిర్మిస్తారో చూడాలి.

బీజేపీని ఓడించే లక్ష్యంతో 2023లో విపక్షాలన్నీ ఇండీ కూటమి పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. కాగా కూటమి ఏర్పడ్డ తొలిరోజుల్లోనే నితీష్ కుమార్ ఎన్డీఏలో తిరిగి చేరిపోయారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి.. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీట్ల పంపకాల విషయంలో అభిప్రాయ బేధాలు.. వరుస ఓటములు.. ఆ కూటమిని బలహీనపరుస్తూ వచ్చాయి. ఇండియా బ్లాక్‌ ముగిసినట్లేనని డీఎంకే అధినేత స్టాలిన్‌ తెలిపారు. మరోవైపు సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆసక్తికర పోస్టు చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్‌, మమతా బెనర్జీతో ఉన్న ఫొటోను అం జత చేసి.. “ మేం కష్టకాలంలోనూ ఒకరినొకరు వదిలిపెట్టేవాళ్లం కాదు ” అని కామెంట్‌ పెట్టారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి అఖిలేష్ అంటించిన చురక. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది.. రాహుల్‌ను నమ్మలేని ఎస్పీ నేతలు అంటున్నారు. అయితే ప్రియాంక గాంధీ చొరవ చూపితే ఇరు పార్టీల పొత్తుకు అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కాంగ్రెస్‌ ఒక విశ్వాస ఘాతుక పార్టీ మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని విమర్శలు గుప్పించారు. 2014 కంటే ముందు కేంద్రంలో పదేళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ కేవలం మిత్రపక్షాలను మాత్రమే వెన్నుపోటు పొడవలేదని, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్‌ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే ప్రజలు 2,3 సార్లు అధికారం అప్పగించేలా పాలన ఉంటుందని మోదీ తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story