Burning Topic: డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా సుప్రీం కోర్టు బిగ్ షాక్?
Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Burning Topic: డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా సుప్రీం కోర్టు బిగ్ షాక్?
Burning Topic: అమెరికాలో జన్మించే ప్రతి బిడ్డకూ లభించే సహజ సిద్ధ పౌరసత్వ హక్కును హరిస్తూ ఉత్తర్వు జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఆయన గతంలో జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ నిర్ణయం అక్కడ శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న భారతీయులతో పాటు వలసదారులకు అతి పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.. కాగా కోర్టు తీర్పు నిరాశ కలిగించినా తన దగ్గర మరో వ్యూహం అందని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు. దీంతో డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే తదుపరి చర్య ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలి కాలంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వికటిస్తున్నాయి. తాజాగా అమెరికా సుప్రీంకోర్టులో ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ తిగిలింది. అమెరికాలో పుట్టిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వం కల్పించే 'జన్మతః పౌరసత్వం' విధానాన్ని పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ప్రధాన న్యాయస్థానం కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్దమని తేల్చి చెప్పింది.
ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరిపిన దిగువ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా, తాజాగా అమెరికా సుప్రీం కోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. పౌరసత్వం అనేది ఒక వ్యక్తికి అన్ని హక్కులను కల్పించే ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్. 14వ రాజ్యాంగ సవరణ రూపకర్తలు యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన ప్రతి వ్యక్తికి ఆ హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని మేము ఈరోజు నిలబెడుతున్నాం" అని తన తీర్పులో పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుని రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు లేదా తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న విదేశీయులకు అక్కడ జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించకూడదని ఆయన నిర్ణయించారు. ముఖ్యంగా గ్రీన్‌కార్డు లేని విదేశీయుల పిల్లలకు పౌరసత్వ హక్కు నిరాకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
అక్రమ వలసలను అరికట్టడం, 'బర్త్ టూరిజం'కు ముగింపు పలకడం తన రెండో విడత పాలనలో ప్రధాన లక్ష్యమని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అమెరికాకు వచ్చి పిల్లలకు జన్మనిచ్చి పౌరసత్వం పొందే విధానాన్ని నిలిపివేయాలన్నదే తన ఉద్దేశమని గతంలోనే స్పష్టం చేశారు. అయితే దీనిపై పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని 14వ సవరణను మార్చే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అక్రమ వలసలను అడ్డుకునే పేరుతో, తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయుల పిల్లలకు కూడా పౌరసత్వం రద్దు చేయాలన్న ట్రంప్ యత్నాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది.ఈ తీర్పు విషయంలో 'యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్' కేసు తీర్పును కూడా సుప్రీంకోర్టు ఆధారంగా తీసుకుంది. ఆ తీర్పులో విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వ హక్కు ఉంటుందని ఇప్పటికే తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన వలస విధానానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
కాగా ఈ కేసులో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ముగ్గురు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు క్లారెన్స్ థామస్, నీల్ గోర్సచ్, శామ్యూల్ అలిటో ట్రంప్ వాదనకు అనుకూలంగా విభేదాభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ మెజారిటీ తీర్పుకు మద్దతు తెలిపారు. అయితే తన నిర్ణయం రాజ్యాంగం కంటే ఫెడరల్ చట్టాల ఆధారంగా తీసుకున్నదని పేర్కొన్నారు.
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ వెలువడిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ దేశ రాజ్యాంగ విలువలను బలపరిచేదిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల వలస హోదా కారణంగా పిల్లల భవిష్యత్తు నిర్ణయించబడదని, అమెరికా సమాన అవకాశాల దేశంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ తీర్పుతో అమెరికాలో పుట్టిన ప్రతి చిన్నారికి పౌరసత్వ హక్కు కొనసాగనుంది.
లక్షలాది మంది భారతీయులకు, ప్రవాస భారతీయ కుటుంబాలకు ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు చాలా పెద్ద శుభవార్త. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ఆర్డర్ అమలులోకి వచ్చి ఉంటే.. అమెరికాలో పుట్టే భారతీయుల పిల్లలకు పౌరసత్వం లభించేది కాదు. సుప్రీంకోర్టు తీర్పును పౌర హక్కుల సంఘాలు, వలసదారుల హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు స్వాగతించాయి.
కాగా సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఈ తీర్పు అమెరికాకు మంచిది కాదు. కానీ దీనిని కాంగ్రెస్‌లో చట్టం ద్వారా సులభంగా సరిచేయవచ్చు. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కాంగ్రెస్ ఈ రోజే పని ప్రారంభించాలి. వారికి నా పూర్తి మద్దతు ఉంటుంది" అని పేర్కొన్నారు. జన్మహక్కు పౌరసత్వం వల్ల అమెరికాపై భారీ ఆర్థిక భారం పడుతోందని, ప్రస్తుత విధానం దేశానికి అన్యాయమని ఆయన వాదించారు.
అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే ప్రస్తుత విధానం అక్రమ వలసలను, 'బర్త్ టూరిజం'ను ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపించారు. మరోవైపు "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అభినందనలు" అంటూ ట్రంప్ వ్యంగ్యంగా సోషల్ పోస్టు చేశారు. ఈ తీర్పుతో చైనా సహా ఇతర దేశాల పౌరులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన పరోక్షంగా చెప్పినట్లుయింది.
కోర్టు తీర్పు నిరాశ కలిగించినా.. నా దారి నాకుంది" అంటూ డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని ప్రకటించారు. దీంతో ట్రంప్ తదుపరి అడుగు ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు 14వ సవరణను వేరే కోణంలో అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. అమెరికాలో శాశ్వతంగా నివసించే ఉద్దేశం ఉన్నవారికే జన్మతః పౌరసత్వం వర్తించాలని వాదించారు. అయితే సుప్రీం కోర్టు ఆ వాదనను అంగీకరించలేదు.
రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వ హక్కు వర్తిస్తుందని తేల్చిచెప్పింది. కాగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ అక్రమంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు జరుగుతున్న 'బర్త్ టూరిజం' పై చర్యలు కొనసాగుతాయని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. చట్టంలోని లోపాలను ఉపయోగించుకుని పౌరసత్వం పొందేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మరోవైపు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘గ్రేట్ ఇమిగ్రెంట్స్’ జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి వచ్చి అమెరికాలో పౌరసత్వం పొందిన 25 మందిని ఈ ఏడాది అమెరికా గొప్ప వలసదారులుగా గుర్తించింది. వీరిలో భారత మూలాలున్న హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డా.సంజీవ్ చోప్రా, వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ప్రెసిడింట్ రేష్మ కెవల్రామణి, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ ఛైర్మన్ నికేష్ అరోరా, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మహరీన్ బనాజీ ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన మహరీన్.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆ దేశ సమాజం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ మరియు కళలకు విశేష సేవలు అందించిన సహజసిద్ధమైన అమెరికన్ పౌరులను కార్నెగీ కార్పొరేషన్ ప్రతి ఏటా ఈ జాబితాతో సత్కరిస్తుంది.




