Burning Topic: హర్ముజ్‌పై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్!

Burning Topic: హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 11:23 AM IST
Burning Topic
X

Burning Topic: హర్ముజ్‌పై వెనక్కి తగ్గని అమెరికా, ఇరాన్!

Burning Topic: పశ్చిమాసియా సంక్షోభానికి ఇప్పట్లో తెర పడేలా లేదు. వివాదం ఎంతకీ చల్లారకుండా ఎప్పటికప్పుడు మరింత ఆజ్యం పోస్టున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్‌ జలసంధిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో జరుగుతున్న పోరాటంలో విజయం సాధించిన తర్వాత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించి జెండా ఎగురవేస్తామని ప్రకటించారు.

ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితిలోనూ అణ్వాయుధాలు ఉండటాన్ని అంగీకరించబోమని తెలిపారు ట్రంప్. ఆ దేశం టెర్రరిస్టులను తయారు చేసే కర్మాగారమని దుయ్యపడ్డారు. తమ సైనిక చర్యలు ఎంత విజయవంతమయ్యాయో ఇరాన్ బయటకు పూర్తిగా చెప్పడం లేదని, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసని అన్నారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశానికి చెందిన 212 విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 159 నౌకలు సముద్రంలో మునిగిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఉన్న విమానాల్లో కొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేసినవేనని తెలిపారు.

ఇంకా కొన్ని క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని, అయితే వాటిని తయారు చేసే సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. రాడార్, నిఘా సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారాయన. తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక నాయకులు వరుసగా మృతి చెందారని పేర్కొన్నారు ట్రంప్. ప్రస్తుతం చర్చలు జరిపేందుకు సరైన నాయకత్వం లేకపోవడం తనకు సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. కాగా హర్మూజ్‌పై పూర్తిగా తమ హక్కు ప్రకటిస్తానని అమెరికా అధ్యక్షుడు చెప్పడం చర్చకు దారితీసింది. అయితే దీనికి చట్టపరమైన అవకాశాలు ఏంటన్నదీ స్పష్టం చేయలేదు.

అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు హర్ముజ్‌ జలసంధి అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్‌ఎన్‌జీలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన మొదలైన అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఈ ఏకపక్ష యుద్ధ నిర్ణయాలు అమెరికా సామాన్య ప్రజల పైనా, ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర భారం మోపుతున్నాయి.

ఇప్పటికే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్‌ ధర గ్యాలన్‌కు 4 డాలర్ల స్థాయికి చేరింది. రానున్న ఎన్నికల తరుణంలో ఈ ఆర్థిక భారం డెమొక్రాట్లకు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉంది. అయినప్పటికీ ట్రంప్ ఈ ఇంధన ధరల పెరుగుదలను సమర్థిస్తూ, ప్రపంచ శాంతి కోసం, ఇరా‌న్‌కి అణ్వాయుధాలు దక్కకుండా చేయడం కోసం అమెరికన్లు కొంచెం ఎక్కువ డబ్బులు చెల్లించడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు.

వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిపై అమెరికా శాశ్వత పెత్తనం చెలాయించాలని చూస్తుండగా, ఇరాన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని డొనాల్డ్ ట్రంప్‌ చేసిన వ్యాఖ‌్యలను తీవ్రంగా ఖండించింది. హర్మూజ్‌ ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చెబుతున్న మాటల్లో నిజం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే.. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్నారు.

తమ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ మార్గంలో ప్రయాణించబోదని స్పష్టం చేశారు. హర్మూజ్‌ విషయంలో అమెరికా తప్పుడు అంచనాలు వేస్తోందన్నారు. ఈ జలసంధిని ఎవరూ ఆక్రమించుకోలేరని ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్‌ ఘరీబాబాది తెలిపారు. హర్మూజ్‌ను మూసి ఉంచాలా? తెరవాలా? అనేది తమ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

అమెరికాకు వేల కిలోమీటర్ల దూరంలోని పశ్చిమాసియాలోని హార్ముజ్ జలసంధిపై భౌతిక పెత్తనం చెలాయించడం అంత సులువైన విషయం కాదు.

హర్మూజ్ మీద పూర్తి నిమంత్రణ సాధించడం ద్వారా, అక్కడి నుంచి వెళ్లే వాణిజ్య నౌకలపై సుంకాలు వసూలు చేయాలనే యోచనలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకపై 20 శాతం టోల్ వసూలు చేయాలని నెల రోజుల కిందటే ప్రతిపాదించారు. అయితే గల్ఫ్ దేశాల ఒత్తిడి, లాబీయింగ్ కారణంగా తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, ఆ ఆలోచనను అమెరికా ఇంకా పూర్తిగా విరమించుకోలేదనీ, అమెరికా సొంతంగా సుంకాలు వసూలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. అమెరికా పూర్తి స్థాయిలో నౌకల రాకపోకలను నియంత్రించి, భవిష్యత్తులో సుంకాల వసూళ్ల ద్వారా భారీగా లబ్ది పొందాలని చూస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. దాన్ని నిరవధికంగా కొనసాగించాలని చూస్తోంది. ఇరాన్‌ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం ద్వారా మరింత ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం తమకు ఉందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్‌ హెగ్‌సెత్‌ చెప్పారు.

అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్‌ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు. ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు నౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్‌ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని అంటున్నా ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story