Burning Topic: నేను లేకపోతే నీకు చిప్పకూడే గతి?

Burning Topic: పశ్చిమాసియాలో శాంతి చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహోల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Jun 2026 6:43 AM IST
Burning Topic
X

Burning Topic: నేను లేకపోతే నీకు చిప్పకూడే గతి?

Burning Topic: ఎక్కడ వేసిన గొంగలి అంటే ఏమిటో కాదు.. పశ్చిమాసియా పరిణామాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య ఎత్తుకు పైఎత్తులు, పరస్పర దాడులతో మరింత దూరం పెరిగిపోతోంది. దీంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం ఇప్పట్లో సాధ్యమయ్యేనా? అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాతో చర్చలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. దీంతో ఇక హార్ముజ్ జలసంధి తెరుచుకునే అవకాశాలు కనిపించట్లేదు. తాజా పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసారి ఉద్రిక్తతలకు కారణం ఇటు అమెరికా కాదు, అటు ఇరాన్ కూడా కాదు. శాంతి ప్రక్రియకు అసలు అవరోధం ఇజ్రాయెల్ అంటూ అటు ఇరాన్, ఇటు అమెరికా కూడా నిందించడం విశేషం.

పశ్చిమాసియాలో ఓవైపు కాల్పుల విరమణ కొనసాగుతున్నా ఇదేమీ తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్.. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్‌‌పై భీకర వైమానిక దాడులను కొనసాగిస్తోంది. రాజధాని బీరుట్ సహా సైదా, టైర్, నగరాలపై తీవ్ర స్థాయిలలో విరుచుకుపడింది. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకెళ్లాయి. 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతి పెద్దది. ఇప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ పట్టుసాధించింది. ఈ దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్లా సైతం ఇజ్రాయెల్ మీద రాకెట్లు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది. ఈ పరిణామాలు ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. లెబనాన్ వంటి తమ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపేంత వరకు చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.

అంతకు ముందుకు ఇజ్రాయెల్‌-హిజ్బుల్లాల మధ్య సంధి కుదిరిందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో జరిపిన చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. ఈ చర్చల తర్వాత లెబనాన్‌ మీదకు ఇజ్రాయెల్ సైన్యం వెళ్లడం లేదని, ఇప్పటికే అక్కడ ఉన్న బలగాలను కూడా వెనక్కి రప్పించిందని స్పష్టంచేశారు. తాము హిజ్బుల్లాతో కూడా మధ్యవర్తుల ద్వారా మాట్లాడామని, అన్ని రకాల దాడులను నిలిపివేయడానికి వారు కూడా అంగీకరించారని ట్రంప్ తెలిపారు. ఇకపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోబోవని హామీ ఇచ్చారు. ఇరాన్‌తో శాంతి పునరుద్ధరణకు ఇజ్రాయెల్‌-హిజ్బుల్లా యుద్ధం పెద్ద అడ్డంకిగా మారిన వేళ ట్రంప్‌ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఇటు ఇరాన్‌తో చర్చలు వేగంగా జరుగుతున్నాయంటూ ట్రంప్‌ మరో పోస్ట్‌చేశారు. ఇంతలోనే ఇజ్రాయెల్ ప్రధాని చేసిన పనితో పరిస్థితి తారుమారైంది.

కాల్పుల విరమణ మీద డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది సేపటికే హిజ్బుల్లాకు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమపై దాడులను నిలిపివేయకపోతే బీరూట్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ భూభాగంలో జరుగుతున్న సైనిక చర్యలు ఆగవని నెతన్యాహు స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ రక్షణ దళాల ఆపరేషన్లు ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారమే కొనసాగుతాయని చెప్పారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. అలాగే ట్రంప్​తో ఫోన్​లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ పరిణామాలపై నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ, ఇజ్రాయెల్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఈ ప్రకటన ఇరాన్‌కు పుండుమీద కారం చల్లినట్లయింది. దీంతో అమెరికాతో చర్చల ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చర్యల కారణంగా పరిస్ధితులు మళ్లీ మొదటికి రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్గి మీద బుగ్గిలంలా మండిపోయారు. వెంటనే నెతన్యాహూకు ఫోన్ చేసి ‘అసలు నువ్వు ఏం చేస్తున్నావు..?’ అంటూ గట్టిగా అరిచేశారు. ఇజ్రాయెల్ చర్యలు ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని మండిపడ్డారు. ఇజ్రాయెల్ చర్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల పెరిగిన వ్యతిరేకతకు నెతన్యాహు బాధ్యుడని ట్రంప్ ఆరోపించారు. నువ్వు పిచ్చివాడివి. నేను లేకుంటే నువ్వు జైలులో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్‌ను కూడా ఇష్టపడటం లేదు అంటూ నెతన్యాహూను దులిపేశారు. ఒక హిజ్బుల్లా కమాండర్‌ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల్లో అనేకమంది లెబనీస్‌ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

నెతన్యాహూకు ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. తాను హిజ్బుల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు. కాగా ఇప్పటి వరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హిజ్బుల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు. లెబరాన్‌పై దాడుల హెచ్చరికలు.. ట్రంప్-నెతన్యాహు మధ్య బహిర్గతమైన విభేదాలు.. పశ్చిమాసియాను మరో కీలక మలుపు వద్ద నిలబెట్టాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story