Burning Topic: ట్రంప్ జిన్ పింగ్ కీలక ఒప్పందాలు!

Burning Topic: అమెరికాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వైట్‌హౌస్‌లో ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Sept 2026 7:51 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్ జిన్ పింగ్ కీలక ఒప్పందాలు!

Burning Topic: మూడు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు వాషింగ్టన్ డీసీలో అరుదైన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా ట్రంప్‌లు మెరీల్యాండ్‌లోని జాయింట్‌ యాండ్రూస్‌ సైనిక విమానాశ్రయంలో స్వయంగా షీ జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్‌ లియువాన్‌లకు స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌ స్వాగతం కోసం 100 అడుగుల రెడ్‌కార్పెట్‌ ఏర్పాటు చేశారు. అమెరికా, చైనా జాతీయ జెండాల రెపరెపల మధ్య మిలిటరీ బ్యాండ్‌ సంగీతం వినిపిస్తుండగా ట్రంప్, జిన్‌పింగ్‌లు పక్కపక్కన నిల్చున్న సమయంలో.. రెండు బీ-1 బాంబర్లు గాల్లో విన్యాసాలు చేశాయి. విమానాశ్రయంలో రెడ్‌ కార్పెట్‌ వద్ద ఆరు ఎఫ్‌-22 యుద్ధ విమానాలు, ఆరు ఎఫ్‌-16 విమానాలు రన్‌వేపై బారులు తీరాయి. . గత 6 నెలల వ్యవధిలో డొనాల్డ్ ట్రంప్- జిన్‌పింగ్ కలుసుకోవడం ఇది రెండోసారి.

జిన్‌పింగ్ గౌరవార్దం డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో అమెరికన్ నాయకులతో పాటు టెక్ రంగానికి చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. చైనా ప్రజల తరఫున అమెరికా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు జిన్‌పింగ్.. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ముందుకు సాగేందుకు సూచించారు. మన మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.. ఇది ఒకరిని దాటిపోయేందుకు మరొకరు ప్రయత్నించే పరుగుపందెంలా ఉండాలే తప్ప ఒకరు ఓడి మరొకరు గెలిచే మల్లయుద్ధం కాకూడదు అని వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ మనుషుల నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉందని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. ఇది మానవాళి మేలు కోసం అభివృద్ధి పరచి, మానవ ప్రమేయంతో నియంత్రించాల్సిన బాధ్యత మనపై ఉంది అని వ్యాఖ్యానించారు. చైనా- అమెరికా పరిస్థితులు, భావజాలాలు వేర్వేరుగా అనిపించినా, నిరంతరం పారదర్శక చర్చల ద్వారా పరస్పరం అర్థం చేసుకోవచ్చన్నారు

ఇక ఇరు దేశాల వ్యవస్థలలో తేడాలు ఉన్నప్పటికీ, సంబంధాలు మాత్రం బలపడ్డాయని అన్నారు డొనాల్డ్ ట్రంప్. బీజింగ్‌లో తాను పర్యటించినప్పుడు చైనా ప్రజల ఆతిథ్యం ఎంతో అద్భుతం సాగిందని కొనియాడారు. జిన్‌పింగ్ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అమెరికా కూడా ఆయనకు అదే గౌరవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. తాను మొదటిసారిగా ఎన్నికైన 2016 నుంచి జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని ట్రంప్ అన్నారు. అమెరికాకు రెండోసారి అధికారిక పర్యటన నిమిత్తం వచ్చిన తొలి చైనా నేతగా ఆయన నిలుస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకల సమయంలో షి పర్యటన జరగడం ప్రత్యేకమైన సందర్బమని అన్నారు. ఇరు దేశాల నాయకులుగా జిన్‌పింగ్, నేను వేర్వేరు వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తామని అర్థం చేసుకున్నాం. కానీ అమెరికా, చైనా ప్రజల మధ్య బంధాలు శాశ్వతంగా ఉంటాయి. కలిసి మనం భవిష్యత్ తరాలకు శ్రేయస్సు, భద్రతను ప్రోత్సహించే సంబంధాన్ని నిర్మించుదాం. " అని ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు చైనా అధ్యక్షుని అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ విరామాన్ని మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విరామ సమయంలో విస్తృతమైన ఆర్థిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వెల్లడించారు. తమ వాణిజ్య యుద్ధాన్ని ఏడాది పాటు పక్కనపెట్టాలని జిన్‌పింగ్, ట్రంప్‌లు గత సంవత్సరం అక్టోబరులో దక్షిణ కొరియాలో జరిగిన ఒక సమావేశంలో నిర్ణయించారు. నాటి ఒప్పందానికి రానున్న నవంబరులో కాలం చెల్లనున్న నేపథ్యంలో దాన్ని జనవరి 10 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు బెసెంట్‌ తాజాగా వెల్లడించారు. అయితే ఈ విరామాన్ని గురించి చైనా తరఫు నుంచి ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. వచ్చే జనవరి కల్లా ఇరుదేశాలూ మరింత విస్తృతమైన ఆర్థిక ప్యాకేజీపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి తెలిపారు.

అమెరికా, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తీవ్రమైన ఆంక్షలు, సుంకాల కారణంగా గణనీయంగా క్షీణించింది. పరస్పర ఆంక్షల వల్ల 2024లో 584 బిలియన్ల డాలర్లుగా ఉన్న ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం, 2025 నాటికి దాదాపు 30 శాతం క్షీణించి 415 బిలియన్లకు పడిపోయింది. 2026 ప్రథమార్ధంలో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. జనవరి-జూలై 2026 మధ్య కాలంలో వాణిజ్యం గత ఏడాదితో పోలిస్తే మరో 14.5% తగ్గింది. ఆంక్షల తర్వాత అమెరికాకు చైనాతో ఉన్న వస్తు వాణిజ్య లోటు $297 బిలియన్ల నుండి $203 బిలియన్లకు తగ్గింది. అమెరికా, చైనా నుండి దిగుమతులను తగ్గించుకోవడమే దీనికి ప్రధాన కారణం. వస్తువుల పరంగా అమెరికా లోటులో ఉన్నప్పటికీ, సేవల రంగంలో మాత్రం చైనాపై అమెరికా సుమారు $34 బిలియన్ల మిగులుతో ఉంది. అయితే ఇప్పటికీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి బలమైన ఆధారపడటాన్ని కొనసాగిస్తున్నాయి.

కాగా అమెరికాలో జిన్‌పింగ్‌కు ట్రంప్ స్వాగతం పలుకుతున్న సమయంలోనే చైనా- ఇరాన్ సంబంధాలపై సంచలన వివరాలు బయటకు వచ్చాయి. అమెరికాతో ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే చైనా నుంచి రహస్యంగా ఇరాన్ రక్షణ సంస్థలకు సాయం అందిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. జూన్‌ నెలలో అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరిన రోజే చైనా కార్పో విమానం టెహ్రాన్ చేరుకుంది. ఇందులో డ్రోన్ వ్యవస్థలు, క్షిపణుల నావిగేషన్‌కు ఉపయోగపడే భాగాలు ఉన్నాయి. అయితే ఇది ఒకేసారి జరిగిన రవాణా కాదని చెబుతున్నారు. 2026 జూన్ వరకు చైనా నుంచి ఇరాన్ డిఫెన్స్ సంస్థలకు సుమారు 1300 డ్యూయెల్ యూజ్ షిప్‌మెంట్లు వెళ్లాయి. వాటి విలువ సుమారు 6 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది.ఇక చైనా నుంచి ఇరాన్‌కు అందిన పరికరాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు, ఎలక్ట్రిక్ మోటార్లు, విమాన ఇంజిన్‌కు సంబంధించిన భాగాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్