Off The Record: మార్కాపురంలో మామా కోడళ్ళ సవాల్!

Off The Record: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ పీఠం కోసం టీడీపీలో మొదలైన ఉత్కంఠ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 11:16 AM IST
Off The Record
X

Off The Record: మార్కాపురంలో మామా కోడళ్ళ సవాల్!

Off The Record: మార్కాపురం జిల్లా పాలిటిక్స్‌లో జెడ్పీ పీఠం చుట్టూనే అసలు లెక్కలు మొదలయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో.. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఇప్పుడే జోరందుకుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జిల్లాలో పూర్తి పట్టు సాధించాలనే లక్ష్యంతో కూటమి నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.

"మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసింది తామే.. వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1 పనులు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తామే" అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం పార్టీ బలం మాత్రమే సరిపోదనేది నేతల ఆలోచన. గ్రామస్థాయిలో ప్రజలతో ఉన్న పరిచయం, అభ్యర్థి వ్యక్తిగత బలం, స్థానిక సమీకరణాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మార్కాపురం తొలి జడ్పీ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనే దానిపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ రేసులో ఒకే పేరు బలంగా, పదేపదే వినిపిస్తోంది.. అదే డాక్టర్ మన్నే రవీంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేసిన ఆయన.. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాన్ని తన కనుసన్నల్లో నడిపించిన సీనియర్ నేత ఆయన.

రాజకీయాలకు అతీతంగా 'పేదల డాక్టర్‌'గా వైద్య వృత్తి ద్వారా దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు ఎంతో ప్లస్ పాయింట్. జడ్పీ రాజకీయాలు మన్నే రవీంద్రబాబుకు కొత్తేమీ కాదు. 2001లో ఎర్రగొండపాలెం జడ్పీటీసీగా ఎన్నికై వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2013లో దోర్నకొండ జడ్పీటీసీగా ఎన్నికైన సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అప్పటి రాజకీయ సమీకరణాల కారణంగా చైర్మన్ పీఠం దక్కక.. మరోసారి వైస్ చైర్మన్‌ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అప్పట్లో అందని ద్రాక్షగా మిగిలిన జడ్పీ చైర్మన్ పదవికి.. ఇప్పుడు కొత్త జిల్లా రూపంలో మరో అరుదైన అవకాశం ముందకు వచ్చింది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి.. కొత్త జిల్లాలోని ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ ఆయనకు వైద్యుడిగా, రాజకీయ నేతగా ఉన్న సుదీర్ఘ పరిచయం ఆయన పేరును ముందువరుసలో నిలబెడుతోంది.

మన్నే రవీంద్రబాబు పేరు రేసులో ముందంజలో వినిపిస్తున్న వేళ.. అదే కుటుంబం నుంచి మరో బలమైన పేరు కూడా తెరపైకి వస్తోంది. అదే మన్నే రాధిక. 2024 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి ప్రత్యక్ష రాజకీయాలపై తన ఆసక్తిని చాటుకున్నారు రాధిక. ఆ సమయంలో టికెట్ దక్కకపోయినా.. కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎర్రగొండపాలెంలో కూటమి గెలుపు కోసం ఆ కుటుంబం శ్రమించింది.

పశ్చిమ ప్రకాశంతో ఉన్న పరిచయాలు, వజ్రాల వ్యాపారంలో స్థిరపడిన నేపథ్యం, రాజకీయాలపై యువతకు తగినట్టుగా దూసుకుపోయే తత్వం రాధిక ప్రత్యేకత. ఒకవేళ రవీంద్రబాబుకు ఏదైనా సమీకరణాల రీత్యా అవకాశం దక్కని పరిస్థితి వస్తే.. మన్నే కుటుంబం నుంచి రాధికను ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకురావచ్చన్న చర్చ గట్టిగా నడుస్తోంది.

అంటే ఇది కేవలం మరో పేరు కాదు.. రవీంద్రబాబు తర్వాత మన్నే కుటుంబానికి సరికొత్త 'ప్లాన్-బి' పొలిటికల్ ఆప్షన్ రాధికే అన్నమాట! ఒకవైపు సీనియర్ అనుభవం.. మరోవైపు కొత్త తరం యువ నాయకత్వం.. ఈ రెండూ ఒకే కుటుంబం నుంచి రేసులో ఉండటం విశేషం.

కొత్త జిల్లాలో తొలి జడ్పీ చైర్మన్ పీఠం కావడంతో ఈ పదవికి ఎంపికయ్యే వ్యక్తి పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందనే ఉద్దేశంతో అన్ని పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వ బలాలు, పార్టీ కోసం చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తోంది.

ముందువరుసలో సీనియర్ నేత మన్నే రవీంద్రబాబు పేరు గట్టిగా వినిపిస్తుండగా.. ప్రత్యామ్నాయంగా లేదా అవసరమైతే ప్లాన్-బిగా మన్నే రాధిక పేరు పరిశీలనలో ఉంది. ఒకే కుటుంబం నుంచి రెండు బలమైన ఆప్షన్లు ఉన్నప్పటికీ.. పార్టీ చివరి నిమిషంలో ఎవరి పేరును ఫైనల్ చేస్తుంది..? మార్కాపురం జిల్లా తొలి జడ్పీ పీఠం ఎవరి ఖాతాలో పడుతుంది..? అన్నది ఇప్పుడు మార్కాపురం పాలిటిక్స్‌లో తేలాల్సిన అసలు సస్పెన్స్! ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్